More

    మహిళా కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడ్డ సిపిఎం నేతలు

    కేరళ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఓ మహిళా కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళా కార్యకర్తపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సిపిఎం నుండి ఈ ఇద్దరు పార్టీ నాయకులను సస్పెండ్ చేశారు. కోజికోడ్ జిల్లా వడకర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి పి బాబూరాజ్, టి పి లిజీష్‌పై సోమవారం ఉదయం మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అయితే అప్పటినుండి నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారని వడకర డిఎస్‌పి మూసా వల్లికాదన్ తెలిపారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 376 (2), 354 (ఎ), 109, 376 కింద కేసు నమోదు చేశారు.

    మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ములియేరి ఈస్ట్ బ్రాంచ్ సిపిఎం కార్యదర్శిగా ఉన్న బాబూరాజ్ మూడు నెలల క్రితం ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. ఈ సంఘటనను ఆమె భర్తకు చెబుతానంటూ బాబూరాజ్ ఆమెను చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత మరో సిపిఎం నేత లిజీష్ కూడా ఆమెను బెదిరించాడు. ఈ సంఘటనను బహిర్గతం చేయవద్దని బ్లాక్ మెయిల్ చేశాడు.

    ఈ సమస్యను వడకర సిపిఎం పార్టీ యూనిట్‌లో చాలాసార్లు బహిర్గతం చేశారు. అయినా బాధితురాలికి న్యాయం జరగలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్, బిజెపి నేతలు బయట పెట్టడంతో సిపిఎం మీద ఒత్తిడి పడింది. సిపిఎం మహిళా విభాగం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ శనివారం పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులైన నాయకులను వెంటనే సిపిఎం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. వీరిద్దరిపై సోమవారం ఉదయం కేసు నమోదైంది. ప్రస్తుతానికి వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

    Related Stories