పాకిస్తాన్ లో చైనీయులపై కాల్పులు

0
763

పాకిస్తాన్ లో చైనీయులపై దాడి చోటు చేసుకుంది. ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోటార్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్‌తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వారిని కరాచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 14న ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఎగువ కోహిస్థాన్‌లోని దాసు ఆనకట్ట స్థలానికి చైనా ఇంజనీర్లతో వెళ్తున్న బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది చైనా పౌరులతో సహా 13 మంది మరణించారు. ఇది జరిగిన రెండు వారాలకు పాకిస్థాన్‌లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం కాల్పులు జరిపారు. పాక్ లో ఇటీవలి కాలంలో చైనాకు ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పాక్ లో ఉంటున్న చైనా జాతీయులపై దాడులు జరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపెడుతోంది.

భద్రతాబలగాల రక్షణ లేకుండా వారు కరాచీలోని ఇండస్ట్రియల్ కారిడార్ కు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. ఈ దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కాల్పులకు తామే కారణమని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత తీసుకోలేదు. తమ దేశీయులపై కాల్పుల ఘటనను ప్రత్యేకంగా చూడాల్సిన కేసు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు. పాక్ లోని చైనా ప్రజలు, ఆస్తులకు పాక్ రక్షణ కల్పిస్తుందన్న పూర్తి నమ్మకం తమకు ఉన్నదని ఆయన అన్నారు.

చైనా ఇంజినీర్లు, పాకిస్తాన్ నిర్మాణ కార్మికులు దాసు జలవిద్యుత్ ప్రాజెక్టుపై కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 14న ఖైబర్ ఫఖ్తూంఖ్వా ప్రావిన్స్ లో చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న వాహనంపై బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది చైనా ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మరువక ముందే ఈరోజు చైనీయులపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. 2019 లో సిపిఇసి ప్రాజెక్టుకు దగ్గరలోని ఒక లగ్జరీ హోటల్‌పైకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డంతో ఎనిమిది మంది మరణించారు. చైనా పాకిస్తాన్‌ కు ఇటీవలి కాలంలో ఎంతో సన్నిహితంగా ఉంటోంది. పాక్ లో చైనా ఎన్నో పెట్టుబడులు పెడుతూ ఉంది. దాసు జలవిద్యుత్ ప్రాజెక్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) లో భాగం. బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద 65 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టారు. ఇది పశ్చిమ చైనాను దక్షిణ పాకిస్తాన్లోని గ్వాడార్ సముద్ర ఓడరేవుతో అనుసంధానించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్మిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ లో చైనా కార్మికుల భద్రత చాలాకాలంగా ఆందోళన కలిగిస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి, నిర్మించడానికి పెద్ద సంఖ్యలో చైనా పౌరులు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు. వారిపై కొనసాగుతున్న దాడుల వలన చైనాకు టెన్షన్ మొదలైంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here