More

    బీజేపీ కార్యకర్తలపై ఆగని హింస.. మరో ఇద్దరు మృతి

    భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై పశ్చిమ బెంగాల్ లో హింసకు ఇంకా ఫుల్ స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తరువాత పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసాకాండకు అంతం లేకుండా పోతోంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న హింసాకాండకు కొనసాగింపుగా, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.

    బిర్భుమ్ జిల్లాలోని ఖోయిరాసోల్ వద్ద ఒక పాడుబడిన భవనంలో బీజేపీ కార్యకర్త ఇంద్రజిత్ సూత్రధర్ ఒక గది పైకప్పుకు వేలాడుతూ కనబడ్డాడు. అతడి చేతులను కట్టేసి ఉంచారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపినట్లు సూత్రధర్ మరణంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు ఇది ఒక హత్య కేసుగా పేర్కొన్నారు. శవపరీక్ష నివేదిక ఖచ్చితమైన కారణం తెలియజేస్తుందని అంటున్నారు. తమ కార్యకర్తల హత్యలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం కల్పించిన దుర్మార్గులే కారణమని, ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసిన వారిని తృణమూల్ కాంగ్రెస్ నేతలు అంతం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సూత్రధర్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అతడు సోమవారం రాత్రి నుండి కనిపించకుండా పోయాడు. అతనికి కొంతమంది స్థానికులతో వ్యక్తిగత శత్రుత్వం ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు.

    మరో బీజేపీ కార్యకర్త తపన్ ఖతువా (45) పుర్బో మేదినిపూర్ జిల్లాలోని ఎగ్రాలో చనిపోయారు. అతని మృతదేహాన్ని ఆ ప్రాంతంలోని ఒక చెరువు నుండి బయటకు తీశారు. ఈ వివరాలను పోలీసు అధికారులు గోప్యంగా ఉంచారు. అతని మరణానికి తృణమూల్ కాంగ్రెస్ నేతలేనని కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు తెలిపారు. స్థానిక టీఎంసీ నాయకత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది, సూత్రధర్ వ్యక్తిగత వైరం కారణంగా చంపబడ్డాడని, ఖతువా ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. బీజేపీ కార్యకర్తల మరణాలపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ఆదేశించారు.

    బెంగాల్ హింస:

    పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి హింస ప్రతి రోజూ పెరుగుతూ వెళుతోంది. మే 2, 2021 న ఫలితాలు ప్రకటించిన తర్వాత బీజేపీ కార్యకర్తలు, ఇతర ప్రతిపక్ష నాయకులను వేటాడి చంపేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న రాజకీయ హింస సంస్కృతిపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తృణమూల్ విజయం తరువాత గిరిజన సంఘాలపై జరిగిన హింసపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

    Related Stories