నిబంధనలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతగా చెబుతున్నా కూడా పట్టించుకోకుండా ప్రవర్తించిన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు ఊహించని షాక్ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్ తన ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం తేల్చి చెప్పింది. ఎవరైనా యూజర్లు అభ్యంతరకర పోస్టులు పెడితే.. ఇకపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్‌లో ఈ హోదా కోల్పోతున్న తొలి సోషల్‌మీడియా సంస్థగా ట్విట్టర్ నిలిచింది.
సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి రాగా వాటిని పాటించడానికి ట్విట్టర్ ఎందుకో బెట్టు చేస్తూ వస్తోంది. తాజా ఐటీ నిబంధనల ప్రకారం వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించడమే కాకుండా.. ముఖ్యంగా వీరు భారత్‌లో నివసిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ట్విటర్ మాత్రం ఈ నిబంధనలను పాటించకపోవడంతో కేంద్రం జూన్ మెదటివారంలోనే తుది నోటీసులు జారీ చేసింది. ట్విటర్ అధికారుల వివరాలను వెల్లడించకపోవడంతో తన ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం తేల్చి చెప్పాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్ కూడా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మంగళవారం నాడు కొత్త ఐటీ నిబంధనలను ట్విట్టర్ ఇంకా అమలు చేయకపోవడంపై కేంద్రం మరోసారి నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ ను నియమించినట్టు ట్విట్టర్ కేంద్రానికి తెలిపింది. ఆ అధికారికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కేంద్రంతో నేరుగా పంచుకుంటామని వెల్లడించింది. అంతకుముందు తమ నూతన ఐటీ నియమావళిని అంగీకరిస్తున్నట్టు సమ్మతి తెలిపేందుకు తుది అవకాశం ఇస్తున్నామని కేంద్రం తెలిపింది.
ఘజియాబాద్ ఘటనలో ట్విట్టర్ పై కూడా కేసు:
ఘజియాబాద్ సమీపంలోని లోని ప్రాంతంలో 72 సంవత్సరాల వయస్సున్న ఓ ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆ వృద్ధుడిని అబ్దుల్ సమద్‌గా గుర్తించారు. కొందరు వ్యక్తులు దాడి చేసి, తీవ్రంగా కొట్టడం, గడ్డాన్ని కత్తిరించడం వంటి దారుణ చర్యలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్, కొందరు జర్నలిస్టులు ఆరోపించారు. జైశ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చేయాలంటూ ఆయనను కొట్టారని పలువురు ప్రచారం చేశారు. కొందరు జర్నలిస్టులతో కలిసి ఈ ఘటనకు మతం రంగు పులమడానికి ప్రయత్నించారని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనకు మతం రంగు పులమడానికి ప్రయత్నించారనే కారణంతో కాంగ్రెస్ నేతలు, జర్నలిస్టులపై కేసు పెట్టారు. దీనితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న కొందరు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలు సహా ట్విట్టర్ యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహ్మద్ జుబేర్, సబా నక్వీ, రాణా అయ్యూబ్, సల్మాన్ నిజామీ, సమా మహ్మద్‌తో పాటు ఓ ఇంగ్లీష్ న్యూస్ పోర్టల్‌పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోను వైరల్‌గా మార్చడాన్ని నిరోధించడంలో ట్విట్టర్ విఫలమైందని సంస్థ పేరును కూడా ఇందులో చేర్చారు. ట్విట్టర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, భారత్‌లోని ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసులు పెట్టారు. నిందితులపై 153, 153-ఎ, 295-ఎ, 505, 120-బీ, 34 సెక్షన్ల కింద కేసులు చేశారు.