More

    ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విట్టర్ విఫలమైంది: కేంద్రం ఆగ్రహం

    నూతన ఐటీ చట్టం-2021 మార్గదర్శకాలను పాటించటానికి అన్ని ఎస్‌ఎస్‌ఎంఐలకు (ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తులు) 3 నెలల సమయం ఇచ్చినప్పటికీ.. ట్విట్టర్ మాత్రం ఆ పనులను పూర్తీ చేయలేదు. మే 26 తో గడువు ముగిసినప్పటికీ, ట్విట్టర్ ఇంక్ నిబంధనలను పూర్తిగా పాటించడంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నూతన ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విట్టర్ విఫలమైందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ న్యాయస్థానానికి నివేదించింది. ఐటీ చట్టం నిర్దేశించిన మేరకు ప్రత్యేక అధికారులను నియమించడంలో ట్విట్టర్ విఫలమైందని వివరించింది. నూతన ఐటీ చట్టం-2021 మార్గదర్శకాలు పాటించేందుకు, ప్రత్యేక అధికారులను నియమించేందుకు దేశంలోని అన్ని సోషల్ మీడియా సంస్థలకు మూడు నెలలు సమయం ఇచ్చామని తెలిపింది. కానీ ట్విట్టర్ నిర్దేశించిన సమయంలోగా చర్యలు తీసుకోలేకపోయిందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది.

    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 లోని రూల్ 4 ప్రకారం నిర్దేశించిన గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించడంలో విఫలమైనందుకు మైక్రోబ్లాగింగ్ సైట్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది భారత ప్రభుత్వం. ఇందుకు వ్యతిరేకంగా ట్విట్టర్ ఇండియా శనివారం సమాధానం ఇచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గతవారం జరిగిన విచారణలో ట్విట్టర్ ప్రత్యేక అధికారి (గ్రీవెన్స్) నియామకం చివరిదశలో ఉందని న్యాయస్థానానికి చెప్పుకొచ్చింది. ఐటీ చట్టం-2021లోని రూల్ నెం.4 ప్రకారం ట్విట్టర్ వెంటనే ఓ గ్రీవెన్స్ అధికారిని నియమించాలని కోరుతూ న్యాయవాది అమిత్ ఆచార్య ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగానే కేంద్రం సోమవారం నాడు అఫిడవిట్ దాఖలు చేసింది.

    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కొత్త చట్టాలను పాటించినప్పటికీ, ట్విట్టర్ గత నెలలో ప్రభుత్వానికి అదనంగా మూడు నెలలు కావాలని కోరింది. కావాలనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ నడుచుకుంటూ ఉంది. కొత్త సమాచార సాంకేతిక పరిజ్ఞానం (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021 ను పాటించడం కోసం జూన్ 5 న భారత ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు తుది నోటీసు జారీ చేసింది.

    భారతదేశ కొత్త ఐటి నిబంధనలను పాటించకపోవడం అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ను హెచ్చరించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2020, సెక్షన్ 79 ప్రకారం అందుబాటులో ఉన్న మధ్యవర్తిగా ట్విట్టర్ మినహాయింపును కోల్పోతుంది. రెండు నోటీసులు పంపినప్పటికీ, ట్విట్టర్ ధిక్కార స్వరంతో కొత్త డిజిటల్ నిబంధనలను పాటించలేదు.

    Trending Stories

    Related Stories