గత కొద్దిరోజులుగా ట్విట్టర్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్నట్లుగా సాగుతూ ఉంది. అయితే ఈరోజు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ట్విట్టర్ అకౌంట్ యాక్సెస్ చేయలేకపోయాడు. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తన అకౌంట్ ఒక గంట పాటు తాత్కాలికంగా పనిచేయలేదని మంత్రి తెలిపారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ఫోటోలను కానీ, వీడియోలను కానీ పోస్టు చేయలేకపోయారు. టీవీ చర్చలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేయడం వల్ల.. ఆ పోస్టులు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై తన ట్విట్టర్ ఖాతా పనిచేయలేదని మంత్రి వెల్లడించారు. మంత్రి అకౌంట్ మాత్రం నెట్ యూజర్లకు కనిపించింది. కానీ మంత్రి అకౌంట్‌లోకి లాగిన్ కావడానికి లేదా పోస్టు చేయడానికి మాత్రం యాక్సెస్ దొరకలేదు. కంటెంట్ పోస్టు చేస్తున్న సమయంలో డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ నోటీసు వచ్చినట్లు మంత్రి తెలిపారు.

మళ్లీ గంట తర్వాత తన ఖాతాను అన్ బ్లాక్ చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ట్విటర్ చర్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డీజిటల్ మీడియా నైతిక నియమావళి) 2021 రూల్ 4(8) నియమాలను ఉల్లంఘించినట్లు ఆయన తెలిపారు. నిబందనల ప్రకారం ఖాతాను బ్లాక్ చేసే ముందు ముందస్తు నోటీసు ఇవ్వడంలో విఫలమైనట్లు తెలిపారు. నేను పోస్ట్ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్ ఛానల్ గానీ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేసినట్లు ట్విటర్ చెబుతుంది. నిజానికి ట్విటర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడటంతోనే తన ఖాతాను బ్లాక్ చేసి ఉండవచ్చని కూ యాప్ లో కేంద్రమంత్రి పోస్ట్ చేశారు. నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా భారతీయ చట్టాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
