మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు శుక్రవారం మధ్యాహ్నమే గడువు ముగిసింది. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇలా తిరస్కరణకు గురైన నామినేషన్లలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్ కూడా ఉంది. అయితే కేఏ పాల్ ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు శనివారం సాయంత్రం ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కేఏ పాల్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఓ నామినేషన్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేయగా, మరో నామినేషన్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేశారు. ప్రజాశాంతి పార్టీని గుర్తింపు లేని పార్టీగా ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
నల్లగొండ జిల్లా చండూరు రిటర్నింగ్ కార్యాలయం వద్ద జరుగుతున్న స్క్రూటీనికి హాజరైన కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తోందని.. నిబంధనలకు విరుద్ధంగా తన తర్వాత వచ్చినవారిని లోపలికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కమ్యూనిస్టులను కొనేశాడని ఆరోపించారు. మునుగోడులో తనని గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు, ఉపాధి, ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, మంచినీరు, రోడ్లు, కాలేజీ, యూనివర్సిటీ ఆరు నెలల్లో చేసి చూపిస్తానని అన్నారు.