కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ళ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని టీవీ ఛానెళ్ళు జాతీయ ప్రయోజనాల కోసం ప్రజలకు ఉపయోగపడేలా అవగాహనా కార్యక్రమాలను టెలికాస్ట్ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యవధితో దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రసారం చేయాలని ఆదేశించింది. దీనిపై తాజాగా కేంద్ర ఉత్తర్వులు జారీచేసింది. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ, శిశు సంరక్షణ, మహిళా సంరక్షణ తోపాటు అక్షరాస్యత, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అవగాహన కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించింది. అంతేకాదు, సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సాంస్కృతిక అవగాహనా కార్యక్రమాలను ప్రసారం చేయాలని కూడా ఆదేశాలు జారీచేసింది. వీటిలో ఛానెళ్ళకు తగ్గట్లు ఏదో ఒక అవగాహన కార్యక్రమాలను తయారు చేసి ప్రసారం చేయాలని నిర్దేశించింది. ఈ ఆదేశాలను ప్రతి ఒక్క సంస్థ కూడా ఖచ్చితంగా పాటించాలని తెలియజేస్తూ దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని తెలియజేసింది.
ఈ నిర్దేశిత ప్రసారాలను అన్ని ఛానెళ్ళు కచ్చితంగా పాటించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎయిర్‌వేవ్స్, ఫ్రీక్వెన్సీవేవ్ లన్నీ ప్రజల వనరులనీ,.. వీటిని ఉపయోగించుకునే అన్ని డిజిటల్ ఛానెళ్ళు కూడా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరముందని తెలియజేసింది. అయితే ఈ కార్యక్రమాలను ఏ సమయంలో ప్రసారం చేయాలనే దానిపైనా, ఎదురయ్యే ఇబ్బందులపైనా కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని,.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. పూర్తి మార్గదర్శకాలు రూపొందించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఇక తాజా మార్గదర్శకాలతో టీవీ ఛానెళ్లలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని అన్ని ఛానెళ్ళూ భారత ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను రూపొందించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు సామాజిక అవగాహన కలిగే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ పోషణ, అక్షరాస్యత ఆవశ్యకతపై అవగాహన కలిగేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడనున్నాయి. మరీ ముఖ్యంగా పేద విద్యార్థులకు విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన ఎక్కువగా తోడ్పడే అవకాశం ఉంటుంది.
భారత్ లో ఇప్పటికే 870 టీవీ ఛానెళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలపై కేంద్ర ప్రసారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. ఈ ఆదేశాలను ఏవైనా ఛానెళ్ళు పాటించకపోతే వాటిపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది. అయితే ఈ ప్రసారాలు చేయడంలో కొన్ని టీవీ ఛానెళ్ళకు మినహాయింపు కల్పించింది. ఇటువంటి ప్రసారాలు చేసినప్పుడు వ్యూయర్ షిప్ తగ్గిపోయే అవకాశమున్న భిన్నమైన కంటెంట్ కలిగిన ఛానెళ్ళకు మినహాయింపునిచ్చింది. ఇందులో స్పోర్ట్స్, వైల్డ్ లైఫ్ ఛానెళ్లు ఈ ప్రసారాలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. వీటితో పాటు ఈ ఆదేశాలు కేవలం భారత టీవీ ఛానెళ్ళకు మాత్రమే వర్తిస్తాయని విదేశీ ఛానెళ్ళకు ఈ నిబంధనలు వర్తించవని ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా ఆదేశాలతో టీవీ ఛానెళ్ళ తీరు మారనుంది. ఎయిర్ వేవ్స్, ఫ్రీక్వెన్సీ వేవ్స్ అన్నీ కూడా ప్రజా వనరులు అయితే వీటిని ఇప్పటివరకు టీవీ ఛానెళ్ళు సరైన మార్గంలో ఉపయోగించలేదు. ఇప్పటివరకు టీవీ యాజమాన్యాలు వీటిని ఆదాయ సంపాదించే కార్పొరేట్ వనరుల్లాగా ఉపయోగిస్తూ వచ్చాయే కానీ సమాజానికి ఉపయోగపడే ప్రసారాలను చూపించడమే మానేసాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన తాజా ఆదేశాల వల్ల అవగాహనాపూరితమైన కార్యక్రమాలు మరింత పెరిగే అవకాశం ఉంది.