ఢిల్లీ శాసనసభ భవనాన్ని ఎర్రకోటతో కలిపే రహస్య సొరంగం తాజాగా కనుగొనడం ఆసక్తిని కలిగిస్తోంది. స్వాతంత్ర్య కాలంనాటి చారిత్రక సొరంగాన్ని ఢిల్లీ శాసనసభ వద్ద దీన్ని గుర్తించారు. ఈ సొరంగం ఎర్రకోట వరకు ఉండొచ్చని చెపుతున్నారు. ఢీల్లీ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఈ సొరంగం ఉందని.. బ్రిటీష్ పాలకులు ఈ సొరంగాన్ని ఉపయోగించేవారని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులను ఎలాంటి ప్రతీకార చర్యలకు అవకాశం లేకుండా ఈ సొరంగం గుండా తీసుకెళ్లేవారని చెప్పారు. 1993లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఈ సొరంగం గురించి చెప్పేవారని అప్పటి నుంచి దీని చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, స్పష్టత రాలేదని తెలిపారు. ఈ సొరంగం ప్రారంభ స్థానం కనిపించిందని అయితే మిగిలిన సొరంగాన్ని గుర్తించేందుకు తవ్వకాలను జరపబోమని రామ్ నివాస్ గోయల్ తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టు, మురుగు కాల్వల నిర్మాణాల వల్ల సొరంగ మార్గం చాలా వరకు ధ్వంసమయి ఉంటుందని ఆయన చెప్పారు. ఢిల్లీ శాసనసభ మరియు ఎర్రకోట మధ్య దూరం దాదాపు 5 కిమీలు. 1912 లో బ్రిటిష్ పాలనలో ఢిల్లీ శాసనసభ భవనం నిర్మించబడింది. E. మాంటెగ్ థామస్ దీనిని రూపొందించారు. 1638 లో ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత ఎర్రకోట నిర్మించబడిందని చెబుతుంటారు.
1912లో దేశ రాజధానిని కోల్ కతా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ఢిల్లీ శాసనసభ భవనాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మార్చారు. 1926లో దీన్ని న్యాయస్థానంగా మార్చారని ఆ సమయంలో స్వాతంత్ర్య సమరయోధులను న్యాయస్థానానికి తీసుకెళ్లడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారు బ్రిటీష్ పాలకులు. ఈ స్థలంలో ఉరికంబం గది ఉందనే విషయం అందరికీ తెలుసని స్పీకర్ చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల సందర్భంగా తాను ఉరికంబం గదిని పరిశీలించాలనుకుంటున్నానని తెలిపారు. దీన్ని స్వాతంత్ర్య సమరయోధుల పవిత్ర స్థలంగా మార్చి, వారికి నివాళి అర్పించాలనుకుంటున్నానని చెప్పారు.