More

  అమెరికాది ‘నెత్తుటి’ దాహం..! గంజాయి వనంలో ఉండలేనన్న ‘తులసి’..!!

  మనకు ప్రాచుర్యం పొందిన ఓ పాత సామెత ఉంది.. ‘తులసీ వనంలో గంజాయి మొక్క’ అని..! కానీ, అమెరికాకు చెందిన ఈ తులసి మాత్రం.. ‘నేను గంజాయి వనంలో తులసి మొక్కను కాలేను’ అంటోంది..!

  తులసీ గబార్డ్.. ఈ పేరు భారతీయులకి పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి రాక ముందు.. డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత పోటీ నెలకొంది. ఎవరు.. డొనాల్డ్ ట్రంప్‎తో వైట్‎హౌజ్ రేసులో పోటీ పడాలనే దానిపై డెమొక్రాట్స్‎లో చర్చ జరిగింది. అప్పుడు ప్రధానంగా వినిపించిన పేర్లలో తులసీ గబార్డ్ కూడా ఒకరు..!

  తులసీ గబార్డ్ అమెరికాలోని ప్రకృతి అందాలకు నెలవైన హవాయి ప్రాంతానికి చెందిన వారు. ఆమె 21 ఏళ్ల వయస్సులో.. రాజకీయంగా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేనప్పటికీ.. స్థానిక ఎన్నికల్లో పాల్గొన్నారు. అప్పుడే డెమొక్రటిక్ పార్టీలోనూ చేరారు. గత ఇరవై ఏళ్లుగా అదే పార్టీలో కొనసాగుతున్నారు. అమెరికన్ ఆర్మీలో వైద్య విభాగంలో పని చేసిన ఆమె.. ఇరాక్, కువైట్ వంటి దేశాల్లో యుద్ధ సమయాలప్పుడు కీలక సేవలు అందించారు..!

  సహజంగానే జాతీయవాది, దేశభక్తురాలైన తులసీ.. అమెరికాలోని అత్యున్నత స్థానానికి పోటీపడిన హిందూ నేపథ్యం కలిగిన తొలి మహిళ..! ఆమె తాను గతంలో పదవిని స్వీకరించే సమయంలో కూడా భగవద్గీతపైన ప్రమాణం చేసిందని చెబుతుంటారు. అంతలా భక్తి, దేశభక్తి కలిగిన తులసీ గబార్డ్ డెముక్రటిక్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. తన నిర్ణయం తెలుపుతూ.. దాదాపు ముప్పై నిమిషాల నిడివి ఉన్న వీడియో కూడా సొషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంతకీ, తులసీ గబార్డ్ నిరసన దేనికి..? చర్చిస్తే బోలెడు అంశాలే తెర మీదకు వస్తాయి..!

  తన వీడియోలో, బ్లాగ్‎లో అనేక ఆసక్తికర, ఆందోళనకర విషయాలు బయటపెట్టిన తులసీ అన్నిటికంటే ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ అస్థిత్వం మీదే ప్రశ్నలు లేవనెత్తింది..? ఒకప్పుడు తాను చేరిన ప్రజాస్వామ్యబద్ధమైన డెమొక్రటిక్ పార్టీ వేరనీ.. ఇప్పుడున్న వారి ‘ఎలిటిస్ట్’ ఎజెండా వేరనీ… సూటిగా తేల్చి చెప్పింది. బాగా డబ్బు, వ్యాపారాలు ఉన్న అతి కొద్ది మంది సంపన్నుల సంక్షేమం కోసం పార్టీ పని చేస్తోందని మాజీ డెమొక్రాట్ ఆరోపించింది. అంతే కాదు, పార్టీలోని అతి కీలక వ్యక్తులు ఓ ముఠాగా మారి ప్రపంచంలో యుద్ధాలు చేయించటమే పనిగా పెట్టుకున్నారని తులసీ అన్నారు!

  తులసీ గబార్డ్ వీడియోలో అందర్నీ షాక్ కి గురి చేసిన మాట ఏంటంటే.. న్యూక్లియర్ వార్..! అవును.. జో బైడెన్ ప్రభుత్వం ప్రపంచాన్ని అణు యుద్ధం ముంగిట్లోకి నెట్టేస్తోందని తులసీ వాపోయింది. గతంలో తమ ఆయుధాల తయారీ కంపెనీల కోసం యుద్దాలు చేయిస్తారని అమెరికన్ రిపబ్లిక్ పార్టీ పాలకులకు పేరుండేది. మొదటి బుష్ అధికారంలో ఉండగా ఇరాన్, ఇరాక్ యుద్ధం జరిగింది. రెండో బుష్ అధ్యక్షుడుగా ఉండగా సెప్టెంబర్ 11 ఆల్ ఖైదా విమాన దాడులు జరిగాయి. వాటికి ప్రతీకారంగా మొదలైన ఇరాక్, అఫ్ఘనిస్థాన్ దాడులు బైడెన్ వచ్చే వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. అయినా, ఉగ్రవాదం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అయితే, ఇప్పటి వరకు రిపబ్లికన్స్ ప్రయోగించిన యుద్ధం ఫార్ములా ఇప్పుడు డెమొక్రాట్స్ కూడా ఒంటబట్టించుకున్నారని తులసీ గబార్డ్ అంటోంది. ఆమె అభిప్రాయం ప్రకారం రష్యా, ఉక్రెయిన్ వార్ వంటివి అమెరికా రాజేసిన కుంపట్లే..!

  ఉక్రెయిన్‎ను నాటోలో చేర్చుకుంటాం అనటం ద్వారా బైడెన్ రష్యాకి కోపం తెప్పించాడు. పుతిన్ దాడికి దిగటంతో ఉక్రెయిన్ ఊగిపోయింది. కానీ, గట్టిగా వారం కూడా రష్యన్ ఎటాక్స్‎ని తట్టుకోలేని చిరు దేశం ఉక్రెయిన్.. ఇన్ని నెలలు అవుతున్నా పుతిన్ సైన్యాన్ని ఎలా తిప్పి కొడుతోంది..? అమెరికా, దాని అనుబంధ యూరోపియన్ దేశాల సహకారంతోనే..! వాటి నుంచి వచ్చే ఆయుధ సామాగ్రి వేలమంది రష్యన్ సైనికుల మరణాలకి కారణం అవుతోంది. అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవల కూర్చున్న డెమొక్రటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ రోజుకోసారి పుతిన్‎ను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నాడు. ఫలితంగా అహం దెబ్బతిన్న రష్యా అధ్యక్షుడు ఏ క్షణాన్నైనా అణు దాడి చేసే ప్రమాదకర స్థితి దాపురించింది..!

  తులసీ గబార్డ్ అంటోంది కూడా అదే.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం లాంటి మరిన్ని మారణకాండలు అమెరికా చేయించబోతోందట. దానికి కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్న డెముక్రాట్సే..! వాళ్లు దేశంలోని సంపన్నులు, పేరుగల ప్రముఖుల సేవలో తరిస్తున్నారని ఆమె ఆరోపించింది. ప్రస్తుత డెమొక్రాట్స్ రిపబ్లికన్స్ మాదిరిగానే యుద్ధోన్మాదులు అయిపోయారట..!

  తులసీ గబార్డ్ పార్టీ నుంచీ వెళ్లిపోవటం.. జో బైడెన్, అతని చుట్టూ చేరిన యుద్ధోన్మాదుల్ని తనలాగే వ్యతిరేకించే వారు.. పార్టీ వదిలి బైటకు రావాలనటం.. పెద్ద వార్తే..! కానీ, ఇది మరీ అనూహ్యం ఏం కాదు. ఆమె చాలా రోజులుగా డెమొక్రటిక్ పార్టీలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. తులసీ బయటకు వెళుతుందని పార్టీలో కొన్ని రోజుల ముందు నుంచే తెలుసు. అయితే, ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరతారా..? మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..!

  తులసీ గబార్డ్ ను నమ్మి ఆమె వెనుకాల ఎందరు బయటకు వెళతారన్నది ఇంకా తేలాల్సి ఉంది. కానీ, ఒకటి మాత్రం ప్రస్తుతం స్పష్టమైంది. ప్రపంచం మీద పెత్తనం చెలాయిద్దామనుకునే మన అంకుల్ సామ్ గతంలో మాదిరిగా గట్టిగా లేడు. అమెరికాలో అంతర్గత బలహీనతలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. మాజీ అధ్యక్షుడు ట్రంపుని రష్యా అధినేత పుతిన్ గెలిపించాడని అప్పట్లో హిల్లరీ ఆరోపించింది. శత్రుదుర్భేద్యం అనుకున్న అగ్రరాజ్యానికి అప్పుడే బీటలు మొదలయ్యాయి. ఇప్పటికిప్పుడు యూఎస్ నెంబర్ వన్ పొజిషన్‎కు వచ్చిన ఢోకా ఏంలేకున్నా.. అధికార డెమొక్రాటిక్ పార్టీలోనే లుకలుకలు బయలుదేరటం కొట్టిపారేయాల్సిన విషయం కాదు.

  కొందరు అంటున్నట్టు తులసీ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకూలమైన నేత కూడా అయి ఉండొచ్చు..! అదే నిజమైతే గతంలో ట్రంప్, ఇప్పడు తులసీ.. అమెరికా వెలుపలి శక్తులకి లొంగిపోతున్నట్టే లెక్క..! ఇక డెమొక్రాట్స్‎లో మిగతా వారిపై కూడా చాలానే ఆరోపణలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ లాబీలు, వ్యాపార లాబీలు, అరేబియా ప్రాంతంలోని సంపన్న ముస్లిమ్ దేశాలు.. వారిని తమకు నచ్చినట్టు ఆడిస్తున్నాయట..! అందుకే, డెమొక్రాట్స్ రోజురోజుకూ అతి ఉదారవాదులుగా మారిపోతున్నారని టాక్..!

  ట్రంప్ అధికారంలో ఉండగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అంటూ రచ్చ చేసింది డెమొక్రాట్సే..! కానీ, ఇప్పుడు స్వయంగా తామే అధికారంలో ఉన్నా కూడా అమెరికాలోని తెల్లవార్ని అహంకార పూరిత విలన్లుగా చీత్రీకరిస్తున్నారట..! యాంటీ వైట్ రేసిజం అంటోంది తులసీ గబార్డ్..! ఇది వినగానే మనకు భారత్ లోని కాంగ్రెస్ వారి సెక్యూలర్ రాజకీయాలు గుర్తుకు రావటం సహజమే..! ఇక్కడ హస్తం పార్టీ ఏది, ఎలా జరిగినా మెజార్టీ హిందువుల్నే తప్పుబడుతుంది. కాంగ్రెస్‎కు మైనార్టీల సేవలో తరించేందు కోసం భారత కమ్యూనిస్టులు కూడా ఇతోధికంగా సాయం చేస్తుంటారు..! ఏమన్నా అంటే హిందూత్వతో ముందుకుపోయే మతతత్వ బీజేపీని బూచిగా చూపిస్తారు. ఇటువంటిదే అమెరికన్ డెమొక్రాట్స్ అమలు చేస్తున్నారు.

  రిపబ్లికన్స్ నల్ల వారికి వ్యతిరేకమనీ, వాళ్లు యుద్ధానికి అనుకూలమనీ, ముస్లీములంటే రైట్ వింగ్ నేతలకు ద్వేషమని డెమొక్రాట్స్ ప్రచారం చేస్తుంటారు. కానీ, నిన్నటి ఒబామా అయినా.. నేటి జో బైడెన్ అయినా.. అధికారం చేజిక్కగానే యుద్ధా కాంక్షతో రగిలిపోతుంటారు..! ఒబామా కాలంలో పాకిస్థాన్‎లో అప్పటి అల్ ఖైదా చీఫ్ ని చంపారు. ఇప్పుడు అఫ్ఘనిస్థాన్ లో మరోసారి అల్ ఖైదా చీఫ్ ని మట్టుబెట్టారు. ఇతర దేశాల్లో చొరబడి దాడులు చేసే డెమొక్రాట్ అధ్యక్షులకి పాకిస్థాన్ మాత్రం పవిత్ర దేశంగా కనిపిస్తుంటుంది. అత్యంత తాజాగా ఉగ్రవాద దేశానికి బైడెన్ ఎఫ్-16 వంటి ఆధునాతన విమానాల్ని అందించేందుకు సిద్ధపడ్డాడు. పాక్ ప్రధానితో మీటింగ్ పెట్టుకున్నాడు. మరోవైపు పాక్ సైన్యాధ్యక్షుడికి వైట్ హౌజ్ లో ఘన స్వాగతం లభించింది..! ఇవన్నీ దేనికి..? భారత్‎ను బెదిరించటానికి..! చైనాకు వ్యతిరేకంగా భారత్, భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్.. ఇలా నాటకాలాడుతూ ఉంటారు అమెరికా అధ్యక్షులు. మళ్లీ అదే నోటితో శాంతి ప్రవచనాలు కూడా వల్లిస్తుంటారు..!

  రిపబ్లికన్ అయిన ట్రంప్ కాలంలో భారత్‎తో అమెరికా అనుబంధం ఎంతో బలపడింది. పాక్ పట్ల పక్షపాత చూపే డెమొక్రాట్స్ వచ్చాక పరిస్థితి తిరగబెట్టింది. భారత్ అభ్యంతరాలు లెక్కచేయకుండా.. ఉన్మాద దేశమైన పాకిస్థాన్‎కు అనుకూలంగా.. పీఓజేకేలో యూఎస్ దౌత్యవేత్త ఈ మధ్యే పర్యటించాడు. అతడి పర్యాటన గురించి ప్రస్తావిస్తూ ‘ఆజాద్ కశ్మీర్’ అని పేర్కొంది పాక్‎లో అమెరికన్ ఎంబసీ. ఇలాంటి పనులు చేయటం ద్వారా రష్యా నుంచి అయిల్ కొనుగోలు చేసిన మోదీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలనేది బైడెన్ ఆలోచన..! అందుకోసం పాక్ లాంటి హింసోన్మాద, మతోన్మాద దేశానికి కూడా వైట్ హౌజ్ వంత పాడుతోంది..!

  చైనా, తైవాన్ దేశాల మధ్య కూడా యుద్ధం రాజేసే ప్రయత్నం బైడెన్ గవర్నమెంట్ ఈ మధ్యే చేసి కూర్చుంది. యూఎస్ చట్ట సభకు స్పీకర్‎గా వ్యవహరిస్తున్న అత్యున్నత స్థాయి నాయకురాలు పనిగట్టుకుని తైవాన్ వెళ్లి వచ్చింది. జిన్‎పింగ్ సేనలు కొన్నాళ్ల పాటూ రెచ్చిపోయి సముద్ర, ఆకాశ విన్యాసాలు చేశాయి. అయినా కూడా చైనా అంతర్గత అనిశ్చితి కారణంగా డ్రాగన్ వెనక్కుతగ్గింది. లేదంటే.. తైవాన్‎పై సైనిక చర్యకు జిన్ పింగ్ తెగ ఉవ్విళ్లూరాడు. అమెరికా కూడా కవ్విస్తూ వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ పై దాడి చేసినట్టు బీజింగ్ కూడా అడుగు ముందుకు వేస్తే.. తైవాన్ కు ఆయుధాలు అమ్ముకుని వ్యాపారం చేసుకుందామని అమెరికా చూస్తోంది..! తులసీ గబార్డ్ చెబుతున్న డెమొక్రాట్ల యుద్దోన్మాదం ఇదే..! ప్రపంచంలో ఏ మూలనో రెండు దేశాల్ని ఒకరిపై ఒకర్ని ఉసిగొల్పి రక్తపాతం సృష్టించి.. ఆ నెత్తురు కూడు పుష్టిగా మెక్కటమే.. అమెరికా విధానం అయిపోయింది. ఇంతకాలం ఇటువంటి పనులు రిపబ్లికన్స్ చేసేవారు. తులసీ ఆరోపణల నేపథ్యంలో డెమొక్రాట్లు కూడా అదే బాట పట్టారని మనం నిర్ధారించుకోవచ్చు.

  అమెరికా యుద్ధోన్మాదం.. ఈనాటిది కాదు. ప్రపంచంలో అణుబాంబు ప్రయోగించిన ఏకైక ఉన్మాద దేశం యూఎస్ మాత్రమే..! అప్పటి నుంచి మొదలుపెడితే సోవియట్‎తో కోల్డ్‎వార్ పేరున దశాబ్దాల పాటూ హింస చేసిన ఘనత కూడా వాషింగ్టన్‎కే దక్కుతుంది. వియత్నాంలో ఘోర పరాభవం కూడా దానిదే. అఫ్గానిస్థాన్‎లో ముజాహిదీన్లకు సీఐఏ ద్వారా శిక్షణ ఇప్పంచి యూఎస్ఎస్ఆర్ మీదకు ఉసిగొల్పింది. ఈనాటికీ ఆసియాలో జిహాద్‎కు కారణమైంది అమెరికానే..! ఇలా చెబుతూ పోతే.. అఫ్గానిస్థాన్‎లో అత్యాధునిక ఆయుధాలు, విమానాలు తాలిబన్లకు వదిలేసి బాధ్యతరహితంగా తన దారిన తాను పోయింది కూడా పెంటగానే..! ప్రతీ చోటా దేశాల మధ్య పెంట, పెంట చేసి.. ముక్కు మూసుకుని చక్కా వెళిపోతుంది అగ్రరాజ్యం..!

  పార్టీ నుంచి వెళ్తూ.. వెళ్తూ.. మనందరికీ తెలిసిన చేదు నిజాన్ని మరోసారి తులసీ గబార్డ్ డెమొక్రాట్స్ దృష్టి కోణం నుంచి చెప్పింది. బయటి దేశాల వారికి అమెరికాలో రిపబ్లికన్స్ ఉన్నా, డెమొక్రాట్స్ ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ప్రపంచపు పెద్దన్నగా దాదాగిరి చేయడం ఆ దేశానికి ఆయుధాలతో అబ్బిన విద్య..! కాబట్టి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్దిక వ్యవస్థగా భారత్ మాత్రం ప్రస్తుతం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అమెరికాలోని డెమొక్రాట్ అధ్యక్షుడైన బైడెన్, అతని ప్రభుత్వం చేసే కుట్రలకు మనం ఎంత మాత్రం తత్తరపడకూడదు. చైనా, పాక్ లాంటి శత్రువుల మధ్య ఉన్న మనం.. అమెరికా ఏర్పరిచే ఏ ట్రాప్ లోనూ పడకూడదు. మోదీ నేతృత్వంలో జయశంకర్ ప్రస్తుతం ఆ పనిని జయప్రదంగానే చేస్తున్నారు..! తులసీ గబార్డ్ భవిష్యత్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో.. చూడాలి మరి..!

  Trending Stories

  Related Stories