పాకిస్థాన్ భద్రతా దళాలు ఎట్టకేలకు తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఒక ఆపరేషన్ చేపట్టాయని ఆ దేశ మీడియా సంస్థలు చెబుతున్నాయి. పాక్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ‘తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్’ (టీటీపీ) ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ ఒబైద్ అలియాస్ మొహమూద్ హతమయ్యాడని అంటున్నారు. అనేక ఉగ్రదాడుల్లోనూ పాల్గొన్న ఒబైద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా పోలీసుల రికార్డులకెక్కాడు ఒబైద్ తలపై రూ. 50 లక్షల రివార్డు ఉంది. మర్దాన్ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ అధికారి సబ్ ఇన్‌స్పెక్టర్ ఫరీద్ ఖాన్ ఆయన ఇంటి ముందే హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఒబైద్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఖైబర్ ఫఖ్తుంఖ్వాకు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం పోలీసులు పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో నిన్న రాత్రి నిర్వహించిన ఆపరేషన్‌లో ఒబైద్ హతమయ్యాడు.
మర్దాన్ జిల్లాలో ఖైబర్ పఖ్తున్‌ఖ్వా పోలీస్‌కి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఆపరేషన్‌లో ఒబైద్ అలియాస్ మెహమూద్‌గా గుర్తించబడిన టీటీపీ కమాండర్ మరణించాడు. ఒబైద్ పోలీసులపై ఎదురు తిరగడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు, నవంబర్ 7 న, ఖైబర్ జిల్లా జమ్రుద్ తహసిల్‌లో సెర్చ్ ఆపరేషన్‌లో లియాఖత్ అనే మరో టీటీపీ కమాండర్ మరణించాడు. పెషావర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో ఇతడికి ప్రమేయం ఉందని చెప్పబడింది. అయితే గతంలో ఇలా పలు టెర్రరిస్టులను మట్టుబెట్టామని చెప్పిన పాకిస్థాన్.. ఆ తర్వాత వారికి అన్ని రకాల సౌకర్యాలను అందించి ఎంతో బాగా చూసుకున్న సంగతి తెలిసిందే..! ఈసారి కూడా పాక్ అదే చేస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.