తిరుమలేశుడికి తమిళ భక్తులు భారీ విరాళాన్ని అందించారు. టీటీడీ చరిత్రలో ఇదే అత్యధికమని చెబుతున్నారు. తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ రూ.7 కోట్ల విరాళం అందించారు. అన్నదానం సహా 7 టీటీడీ ట్రస్టులకు రూ.1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు. మరో ముగ్గురు భక్తుల నుంచి రూ.3 కోట్ల విరాళం అందినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఒకే రోజు స్వామి వారికి రూ.10 కోట్ల విరాళం రావడం విశేషమని చెబుతున్నారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి దాతలు తిరుమలలో సోమవారం చెక్కులు అందజేశారు. తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ ఒక్కరే స్వామివారికి రూ.7 కోట్ల విరాళం అందించారు. అన్నదానం సహా టీటీడీ నిర్వహణలోని 7 ట్రస్టులకు రూ.1 కోటి చొప్పున ఆయన విరాళం అందించారు. విద్యాదాన ట్రస్టుకు ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్సెక్షన్ సంస్థ రూ.1 కోటి విరాళాన్ని అందించింది. శ్రీవాణి ట్రస్టుకు బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ రూ.1 కోటి విరాళం సమర్పించింది. ఎస్వీ వేద పరిరక్షణ సంస్థకు సీ హబ్ ఇన్సెక్షన్ సర్వీసెస్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. మొత్తంగా ఒకే రోజు వ్యక్తిగత హోదాల్లో నలుగురు భక్తులు స్వామి వారికి ఏకంగా రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు.
అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 9న ప్రాణప్రతిష్ట, మహా సంప్రోక్షణ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, స్వరూపానందస్వామికి ప్రథమ దర్శనం కల్పిస్తామని తెలిపారు. టీటీడీ ఆలయాల్లో అమరావతిలోనిదే అతిపెద్ద నిర్మాణమన్నారు. తిరుమల ఆలయం తర్వాత అమరావతిలోని ఆలయమే అతిపెద్దదని.. రూ.40 కోట్లతో 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మించామని చెప్పుకొచ్చారు.