సోషల్ మీడియాలో టీటీడీపై విషప్రచారం తగదని హెచ్చరించారు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. టీటీడీపై బురద చల్లడానికే డిపాజిట్లపై సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. రూ.5వేల కోట్ల డిపాజిట్లను స్టేట్ గవర్నమెంట్‌కు బాండ్ల రూపంలో ఇచ్చారనేది ముమ్మాటికీ అవాస్తవమని స్పష్టం చేశారు. నేషనలైజ్డ్ బ్యాంకులలోనే నగదు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఇలాంటి వందంతులు ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. డిపాజిట్లపై శ్వేతా పత్రం విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఎస్ఎస్డి టైం స్లాట్ ఆన్లైన్లో విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు ఎస్ఎస్డి టైం స్లాట్ కోరుకుంటే టిక్కెట్ల సంఖ్య పెంచుతామన్నారు. 800 మేర చిన్న పిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్ నిర్వహించామని పేర్కొన్నారు. ఆపన్న హృదయం ట్రస్టుకు 1లక్ష రూపాయలు డొనేషన్ చేస్తే ఆరుగురు కుటుంబసభ్యులకు బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. ఆపన్న హృదయం ట్రస్టుకు డొనేషన్ ఇచ్చి చిన్న పిల్లల హృదయ శస్త్రచికిత్సకు సహకారం అందించాలని కోరారు. అక్టోబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 122.23 కోట్లు వచ్చినట్లు తెలిపారు.