తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) ఫలితాలు వాయిదా పడ్డాయి. సోమవారం (అక్టోబర్ 22) నాడు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. పలు సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారు. అధికారిక సమాచారం ప్రకారం ఐసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఐసెట్ ద్వారా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. ఈఏడాది ఐసెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 75,958 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందించే కాలేజీల్లో ప్రవేశాల కోసం ఐసెట్(Icet) నిర్వహిస్తారు.
TS ICET 2022 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఇందులో 200 MCQలు ఉంటాయి. ఇందుకోసం రెండున్నర గంటల పాటు సమయం కేటాయిస్తారు. ప్రశ్నాపత్రం మూడు సెక్షన్‌లుగా విశ్లేషణాత్మక సామర్థ్యం, గణిత సామర్థ్యం, కమ్యూనికేషన్ సామర్థ్యంగా విభజిస్తారు. టీఎస్ ఐసెట్ పరీక్ష ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియంలో నిర్వహించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.