పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ శ్రేణులు.. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేవలం, సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో ప్రతి పట్టభద్రుడిని ఆలోచింపజేసేలా.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. అనుబంధ సంఘాల కార్యకర్తలను క్షేత్రస్థాయికి పంపి ప్రచారం సాగిస్తోంది బీజేపీ. అటు బీజేపీ గెలుపుకోసం సంఘ్ పరివార్ సైతం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించుకున్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం సాగిస్తోంది. ఇటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమావేశాలను పూర్తి చేసుకున్న ఆ పార్టీ.. మేధావుల సదస్సులను నిర్వహిస్తోంది. లాయర్లు, డాక్టర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక సంఘ్ పరివార్ నేతలు పోలింగ్ బూత్‌ల వారీగా సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్లకు టచ్‌లో ఉంటూ ప్రథమ ప్రాధాన్య ఓట్లను రాబట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకొని బీజేపీ ముందుకెళ్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, టీఆర్‌ఎస్ అభ్యర్థులనే తమ ప్రత్యర్థులుగా చూస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ వర్గం వారూ టీఆర్‌ఎస్ పాలనలో సంతోషంగా లేరని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
ఇదిలావుంటే, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీవీ కూతరు సురభి వాణీదేవిని బరిలోకి దింపడంతోనే టీఆర్ఎస్ తన బలహీనతను ప్రదర్శించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి గతంలో టీఆర్ఎస్ ఇంతవరకు గెలవలేదు. దీంతో ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని.. మాజీ ప్రధానిగా పీవీ ఛరిష్మాను వాడుకునే ఎత్తుడగ వేసింది. ఓటమి భయంతోనే అధికార పార్టీ నుంచి పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాలేదని.. అందుకే, పీవీ కూతురుని ఒప్పించి బరిలోకి దింపారనే వాదన కూడా వుంది. దీనిని బట్టే టీఆర్ఎస్ ఓటమి ఖాయమైందంటున్నారు బీజేపీ నేతలు. మొత్తానికి పీవీ ఛరిష్మాతో గట్టెక్కాలన్న టీఆర్ఎస్ ఎత్తుగడ బెడిసికొట్టే ప్రమాదం పొంచివుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.