టీఆర్ఎస్ నేత 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక విశ్వనాథ్‌పేటకు చెందిన టీఆర్ఎస్ నేత షేక్ సాజిద్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత వైస్ చైర్మన్ పదవిని చేపట్టాడు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన సాజిద్ అక్కడికొచ్చిన ఓ మైనర్ బాలికను చూశాడు. ఆ బాలికను లొంగదీసుకోవాలని నిర్ణయించుకున్న సాజిద్ అన్నపూర్ణమ్మ అనే మహిళ సహాయాన్ని తీసుకున్నాడు. తాను నిజామాబాద్ వెళ్తున్నానని, తోడుగా రావాలని వెంటబెట్టుకు వెళ్లింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో మంచి దావత్ ఉందని, అది చాలా గ్రాండ్‌గా ఉంటుంది రావాలని బలవంతం చేసింది. కారులో వెళ్లి సాయంత్రానికి వచ్చేద్దామని చెప్పింది. తెలిసిన మహిళే కావడంతో నమ్మి బాలిక వెళ్లింది. బాలికతో కలిసి హైదరాబాద్ చేరుకున్న అన్నపూర్ణమ్మ అప్పటికే చార్మినార్ సమీపంలోని ఓ హోటల్‌లో ఉన్న సాజిద్‌కు బాలికను అప్పగించింది. అక్కడ బాలికను బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సాజిద్‌పై పోక్సో సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను తీసుకెళ్లిన అన్నపూర్ణమ్మ, కారు డ్రైవర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు.

వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్ ను టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రకటించారు. పార్టీ ప్రతిష్టను భంగం కలిగించాడని షేక్ సాజిద్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడంతో సాజిద్ కు, టీఆర్ఎస్ కు సంబంధం లేదని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి తెలిపారు. అత్యాచారానికి గురైన అమ్మాయికి న్యాయం చేస్తామని ఇంద్రకిరణ్ రెడ్డి తెలిపారు.
