టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణలో రాబోయే ఎన్నికలపై శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు లేవని ఆయన ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారమే 2023లోనే ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వెల్లడించారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు కేటీఆర్. అంతేకాకుండా ఎన్నికల్లో 90కి పైగా స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా ఉందని బీజేపీ, కాంగ్రెస్ సర్వేలే చెబుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దొర అయితే ఆయన ఎంతమందిని జైల్లో పెట్టారని ప్రశ్నించారు. పార్టీలో కొన్ని చోట్ల గొడవలు ఉన్నాయన్న మాట వాస్తవమేనని.. అది టీఆర్ఎస్ బలంగా ఉందనడానికి నిదర్శనమని చెప్పారు.