More

  కమలం గూటికి కొండా..? కారు పార్టీకి కష్టాలు తప్పవా..??

  త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?

  ‘కొండా’ కమలం గూటికి చేరితే కేసీఆర్ కు పదవీగండం?

  Consolidate అవుతున్న ‘రెడ్డి సామాజిక వర్గం’ !

  గులాబీ పార్టీలో భగ్గుమంటున్న విభేదాలు !

  తెలంగాణ రాష్ట్ర రాజకీయం ‘రంగస్థలాన్ని’ తలపిస్తోంది. నేతలంతా నటులవలె జనాన్ని రంజింపజేసేందుకు ఎవరి స్థాయిలో వారు తమ నటనా కౌశలాన్ని ప్రదరిస్తున్నారు. ఇదంతా Course of fraud అని అర్థమవుతున్నా వినోదం కోసం జనం టీవీ తెరలకు అతుక్కుపోతున్నారు. బహుశా తెలుగు సాంఘిక నాటరంగం చివరి రోజుల్లో ఎదుర్కొన్న పతనావస్థ లాంటి స్థితి గుర్తుకువస్తోంది.

  కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ పర్యటన, రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న హడావిడీ, బండి ప్రజా సంగ్రామ యాత్ర, వరిధాన్యం కొనుగోలుతో అధికార పార్టీ చేస్తున్న అంతర్నాటకం, బీజేపీపై ఒంటికాలితో లేస్తున్న కేసీఆర్ వైఖరీ, జాతీయ స్థాయిలో కాంగ్రేసేతర, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ గురించి నవ్వు తెప్పించే ప్రేస్ మీట్లూ…..తిట్ల దండకాన్ని మరోసారి ప్రజలు మననం చేసుకుంటున్నారు.

  ‘Phony’ political strategist  ప్రశాంత్ కిషోర్ కోస్తున్న కోతలూ, చేస్తున్న పర్యటనలూ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల శాసన సభ్యులు, నేతల మధ్య బహిర్గతమవుతున్న విభేదాలూ, సీటు నాదంటే నాదంటూ రచ్చకెక్కుతున్న దాఖలాలు….

  కన్సాలిడేట్ అవుతున్న రెడ్డి సామాజిక వర్గం….ఈ పరిణామాలన్నీ ఎన్నికల పండగ దగ్గర పడిందనే సూచిస్తున్నాయి. ఇక ఆటలో అరటి పండులా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తపున గ్రామాల పర్యటనలో ఉన్నారు. వైఎస్.షర్మిల పాదయాత్ర చేస్తోంది. తీన్మార్ మల్లన్న త్వరలో తన ఆస్తులను ప్రజాపరం చేసి ‘ప్రజా ప్రభుత్వం’ ఏర్పడేదాకా పాదయాత్ర చేస్తానంటున్నాడు. నాటకంలో విదూషకుడిలా…కే.ఏ.పాల్ కూడా తెలంగాణ ఎన్నికల గురించే మాట్లాడుతున్నాడు.  మొత్తంగా బయటకు వ్యక్తమవుతున్న వర్తమాన రాజకీయ దృశ్యం వెనుక కనిపించని పొలిటికల్ డైనమిక్స్ ఏవో ప్లే అవుతున్నాయని చూచాయిగా తెలుస్తూనే ఉంది.

  నటనను మీరిన రాజకీయ దృశ్య కావ్యం వెనుక దాగిన కోణాలేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను.

  ఏప్రిల్ చివరి వారంలో ప్రగతి భవన్ లో బస చేసిన ప్రశాంత్ కిషోర్ సుమారు 20 గంటల పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియోజక వర్గాల్లో బలాబలాలు, సిట్టింగ్ ల స్టాటస్ గురించి చర్చించినట్టూ వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఢిల్లీలో సోనియగాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్ కోర్ కమిటీతో సమావేశమైన పీకే తిరిగి హైదరాబాద్ కు రావడం, కేసీఆర్ ను కలవడంతో రాజకీయ ఉత్కంఠకు తెరలేచింది. మరోవైపు కాంగ్రెస్ లో కలవరం మొదలైంది.

  కాంగ్రెస్ తో భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్  చేసిన వ్యాఖ్యలు గమనంలోకి తీసుకోవాల్సినవి. ‘మూడు, నాలుగో ఫ్రంట్లు అసాధ్యమనీ…కేవలం రెండే కూటములే’ అనడంతో తెలంగాణలో కాంగ్రెస్-టీఆర్ఎస్ జట్టు కట్టబోతున్నాయంటూ కమలం పార్టీ నేతలు ప్రచారం లంకించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శల జోరు పెంచింది.

  ఇక బండి సంజయ్ చేస్తున్న రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు జనం స్వచ్చందంగా వస్తూన్నారే వార్తలు వస్తున్నాయి.

  రంగారెడ్డి జిల్లాలో బలమైన, సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బండి సంజయ్ పాద యాత్ర సందర్భంగా ఆయనతో భేటీ అయి గంటపాటు చర్చలు జరిపారట. ఈ భేటీలో మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణలో మొదటి నుంచీ రాజకీయంగా, సామాజిక వర్గం పరంగా బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం క్రమంగా బీజేపీ ఛత్రఛాయల్లోకి వెళ్లిపోతోంది.

  హిందూ ఓట్ల పోలరైజేషన్, కాస్ట్ ఈక్వేషన్, ఇప్పటికే ఆ పార్టీకీ ఉన్న బలం. ఆర్ఎస్ఎస్ లాంటి బలమైన సంస్థల వెన్నుదన్నూ కలిస్తే మొత్తంగా రాబోయే ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అవకాశాన్ని కాదనలేం! దీనికి తోడు అధికార పార్టీ పట్ల వ్యతిరేకత, నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య పెరగడం, వర్గ విభేదాలూ కూడా బీజేపీకి మేలు చేయోచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది గులాబీ గూటికి చేరడం, అంతకుముందునుంచి పార్టీలో ఉన్న కేడర్ కు కొత్తగా చేరిన వారికీ మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది.

  తాండూరు, కొల్లాపూర్ లో ఇటీవలే వర్గపోరులు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలాంటి ప‌‌రిణామాల‌‌కు దారితీస్తుందోన‌‌నే బెంగలో ఉందట అధిష్ఠానం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావం చూసే అవకాశం ఉంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో తన అనుచరులను పాల్గొనకుండా, జెండా ఎగరనీయకుండా హర్షవర్ధన్ రెడ్డి అడ్డుకున్నారని జూపల్లి ఆరోపించారు.

  తన కార్యకర్తలపై రాయలసీమ రౌడీలు, గుండాలను పెట్టి దాడులు చేస్తున్నారని, పోలీసులను సంప్రదించినా, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జూపల్లి ప్లీనరీకి రాకుండా నిరసన తెలిపారు.

  తాండూరులోని భావిగీ భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో రథోత్సవం సందర్భంగా రౌడీషీటర్లకు పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఐని రాయలేని భాషలో బూతులు తిట్టడం అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చిపెట్టింది.  పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి పైలెట్, పట్నం పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ నాదే అంటూ ఇధ్దరూ భీషణ ప్రతిజ్ఞలు చేశారు.

  ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో ఒక్క ఖ‌మ్మం అసెంబ్లీలో త‌ప్ప మ‌రెక్కడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవ‌లేదు. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంక‌ట‌వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి గెలిచిన వ‌న‌మా వెంక‌టేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేంద‌ర్ రెడ్డి, బానోతు హ‌రిప్రియా నాయ‌క్ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో పార్టీపై పట్టు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది.

  కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన రేగా కాంతారావు భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడ‌య్యారు. గ‌తంలో టీఆర్ఎస్ లో కీల‌కంగా ప‌నిచేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిలకు ఎలాంటి పదవులూ లేవు. ప్రాధాన్యతా లేదనే వాదనలున్నాయి. వారిరువురూ కమలం వైపు చూస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటారు ఖమ్మం జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్నవారు.

  పొంగులేటి శ్రీనివాస్​రెడ్డే 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్యర్థుల ఓట‌మికి కార‌ణ‌మ‌ని ఓడిపోయిన అభ్యర్థులు సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ కు సహకరించలేదని, మరోసారి ఫిర్యాదు చేశారు. పిన‌పాక నియోజ‌క‌వ‌ర్గంలో అంబేద్కర్​ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.

  ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం పరిస్థితి ఇలాగే ఉంది. ఎమ్మెల్యే న‌న్నపనేని న‌రేంద‌ర్, మేయ‌ర్ గుండు సుధారాణి, మంత్రి ఎర్రబెల్లి సోద‌రుడు ప్రదీప్ రావుల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్​ మెట్టు శ్రీ‌నివాస్ బాధ్యతలు చేపడుతున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను ఆయా నేత‌ల అనుచ‌రులు చింపేసి పరస్పరం దాడులు చేసుకున్నారు.

  అధికార పార్టీ పిలుపునిచ్చిన వడ్ల ధర్నాకు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ మొదట దూరంగా ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అక్కడి నుంచి వెళ్లిన తర్వాతే ఎమ్మెల్యే వేదికపైకి వచ్చారట!

  గ‌త ఎన్నిక‌ల్లో తన కుమార్తే కావ్యను స్టేష‌న్ ఘ‌న్ పూర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించాల‌ని మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి ప్రయత్నించినప్పటికీ పార్టీ నాయ‌క‌త్వం మాత్రం తిరిగి తాటికొండ రాజ‌య్యనే బరిలోకి దింపింది. దీంతో సహజంగా రాజయ్యకు క‌డియం వ‌ర్గం నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర్కోవాల్సి వచ్చింది.

  రాబోయే ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి ఎలాగైనా తన కుమార్తెను పోటీ చేయించాల‌ని క‌డియం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టూ సమాచారం. మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ మ‌ధ్య, మంత్రి సత్యవతి రాథోడ్​తోనూ ఎమ్మెల్యేకు విభేదాలు కొనసాగుతున్నాయి.

  ఉమ్మడి నల్లగొండలోని ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అయిన న‌కిరేక‌ల్ లో ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ‘నాదంటే నాదనీ ఇద్దరూ బాహటంగానే చెప్పుకుంటున్నారు. నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు చాన్నాళ్ల నుంచీ కొనసాగుతోంది.

  ప్రధానంగా ఈ అంతర్గత కలహాలకు కారణం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే వారి సంఖ్య ఒకటీ, రెండుకు మించి ఎక్కువ ఉండటం, గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరినవారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదన్న పంతం మరో ప్రధాన కారణం.

  ఇక కాంగ్రెస్ క్రమంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ పార్టీలోనూ లెక్కకు మించిన గ్రూపులూ….వారి మధ్య నిరంతరం డైలాగ్ వార్ లూ నడుస్తూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్ కు జగ్గారెడ్డికీ మధ్య, కోమటి రెడ్డి బ్రదర్స్ కు రేవంత్ రెడ్డికీ మధ్య ఏదో ఓక రకమైన విభేదాలు ఉంటూనే ఉన్నాయి.

  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీ చూస్తున్నారని స్పష్టంగానే తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో నిర్వహించిన ‘రాహుల్ గాంధీ’ సభకు దూరంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసేందుకు ఆశపడుతున్నారు. బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టూ సమాచారం.  

  కాంగ్రెస్ బలం పెరగడం వల్ల ఎవరికి లాభం?

  కాంగ్రెస్ బలం పెరిగితే ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ చీలుతుందనే వాదనలో పసలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చగలిగిందనే ప్రశ్న వేసుకుంటే జవాబు సులభం.

  కాంగ్రెస్ బలం పెరగడం వల్ల బీజేపీకి నష్టం కాకపోగా ప్రయోజనమే ఉంది. అదెలా సాధ్యం? చూద్దాం…..

  కాంగ్రెస్ సహా షర్మిల పార్టీ, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోని బీఎస్పీ, కమ్యూనిస్టులు ఇతర సంస్థలు, వ్యక్తులూ… చేసే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎన్నికల్లో బీజేపీకి ఓటుగా తర్జుమా అయి తీరుతుంది. అందుకు ప్రధాన కారణం ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అయితే కాంగ్రెస్ పై నమ్మకం లేదు.

  భారతీయ జనతా పార్టీ ఎన్నికల నాటికి బలమైన ప్రభావాన్ని నెరపగలిగితే…విశ్వాసం కలిగే వాతావరణాన్ని సృష్టించ గలిగితే….టీఆర్ఎస్ కు బలమైన పోటీ ఇవ్వగలదు.

  బీజేపీకి ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనే ఆయుధాన్ని రెండు రకాలుగా వాడుకోవడం తెలుసు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి….తాను లాభపడగలదు. వైరి పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో Anti-incumbency ని ఉపయోగించుకుని తాను అధికార పీఠాన్ని అధీష్ఠించగలదు. అందుకు తగిన వ్యూహం-ఎత్తుగడలు, రణరంగ చతురత ఆ పార్టీ అమ్ముల పొదిలో ఉన్నాయి.

  ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను.

  2014కు ముందు రాందేవ్ బాబా, అన్నా హజారే, కేజ్రీవాల్ నాయకత్వంలో జరిగిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’  అప్పటికప్పుడే ఎగిసిపడిన Spontaneous combustion కాదు. దాని వెనకాల దీర్ఘకాల ప్రణాళిక ఉంది.

  దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఒక ఉద్యమం రావాలి. అప్పటికే కాంగ్రెస్ కుంభకోణాల ఊబిలో కూరుకుపోయింది కాబట్టి…అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మిస్తే…..అది అంతిమంగా కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమమే అవుతుంది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం దానికి రావాల్సినంత లెజిటిమసీ రాదు. దీంతో సదరు ఉద్యమం కాంగ్రెస్ పట్ల భయంకరమైన వ్యతిరేకతను పెంచింది. ఈ వ్యతిరేక ఉద్యమం దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలేమీ పెద్దగా బావుకోలేదు. కానీ, బీజేపీ మాత్రం భారీ మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర పార్టీగా చరిత్ర సృష్టించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆ పార్టీకి అట్లా ఉపకరించింది. ఇలాంటి ప్రయోగాల వచ్చే ప్రయోజనాన్ని అంచనావేయగల దూరదృష్టి బీజేపీకి ఉంది.

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 90ల్లో వచ్చిన ‘‘సారా వ్యతిరేక ఉద్యమం’ సద్యోజనితమైందేమీ కాదు. ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలనుకున్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ప్రధాన పార్టీ…ఎక్కడో చిన్న నిప్పురవ్వ రగిందని గుర్తించగానే…పూర్తి అగ్నిపర్వతంగా మార్చడం…అందుకు తగిన ప్రచారం చేయడం, వెంటనే ఎన్టీఆర్ ‘సారా నిషేధం’ వాగ్దానం ఇవ్వడం, 1994లో విజయం సాధించడం జరిగిపోయాయి.   

  Perspective, political vision, strategy-tactics ఉన్న పార్టీలు స్థితిని బేరీజు వేసి స్పాంటెనిటీనీ….అంచనా కట్టి అందుకు తగిన విధంగా ప్రణాళికలు రచిస్తే….వచ్చే ఫలితాలు వేరు.

  రాబోయే ఆరు మాసాల్లో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికార పార్టీలో భయం, ప్రతిపక్ష పార్టీల్లో ఉబలాటం అందుకు కారణం. ప్రజల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేయాలన్న ఆగ్రహం, అమితాసక్తి రెండూ పుష్కలంగా ఉన్నాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్నివేయగలరు. బీసీల విషయంలో ఇప్పటికే కమలం పార్టీ దృష్టి సారించింది. ఇక కలిసివచ్చే అన్ని శక్తులనూ తన గొడుగుకిందకు తెచ్చుకుంటే ఎన్నికల తీరును మార్చగలదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

  Trending Stories

  Related Stories