More

    తీన్మార్ మల్లన్న vs KTR..
    తెలంగాణ అరాజకీయ క్రీడ

    భాష చాలా పదునైంది. ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలదు. ప్రమోదాన్ని పంచగలదు. భాష కేవలం సమాచార వినిమయ సాధనమనుకుంటే పొరపాటు. పాత్రికేయ వృత్తిలో మాటల్ని తూకం వేసినంత కచ్చితంగా ప్రయోగించాలి. పొరపాటు దొర్లితే ఉనికికే ప్రమాదం వస్తుంది. మన మాటతీరు మంటలు రేపుతుంది. ఏళ్లతరబడి శ్రమించి సంపాదించుకున్న కీర్తి ఒక్కమాటతో ఆవిరైపోతుంది.

    ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమంలో భాషలోని యాసే ప్రధాన నినాదంగా మారింది. ఆంధ్రాభాష, తెలంగాణ యాస ఇవే కదా 1969 నుంచి 2014 వరకూ తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్విగ్న, ఉద్రిక్త సందర్భాలకు కారణమయ్యాయి.

    తాజాగా తీన్మార్ మల్లన్న కేటీఆర్ తనయుడి గురించి అభ్యంతరకరంగా ట్వీట్ చేసినందుకు దుమారం చెలరేగుతోంది. ‘బాడీ షేమింగ్’ అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. గతంలో మల్లన్నకు మద్దతు ఇచ్చినవారంతా ప్రస్తుతం కేటీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు.

    పరుషంగా మాట్లాడ్డం ఒక ఎత్తు, అభ్యంతరకరంగా మాట్లాడ్డం ఒక ఎత్తు, అనుచితంగా మాట్లాడం మరొక ఎత్తు. తీన్మార్ మల్లన్న ఈ మూడింటినీ తన వ్యాఖ్యానాల్లో ఉపయోగించారు. ఇందుకు ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు తీన్మార్ మల్లన్నపై, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక, ఛానళ్లపై, సిబ్బందిపై హేయమైన దాడికి దిగారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ తనయుడిపై చేసిన వ్యాఖ్యలు ఎంత ఖండనీయమో, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం కూడా అంతే ఖండించదగింది.

    మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో అవాంఛనీయ వాతావరణం క్రమంగా విస్తరిస్తోంది. అదుపులేని మాటతీరుకు ఆదరణ పెరుగుతోంది. ఎవరెంత పరుషంగా మాట్లాడితే అంత భారీ సంఖ్యలో అభిమానులు జేజేలు కొడుతున్నారు. ఇంగితాన్ని ఎంత మరిచిపోతే అంత ఎక్కువగా  ప్రేక్షకులు పోగుపడే స్థితి నెలకొంది.

    ‘నేషనలిస్ట్ హబ్’ ఈ తరహా అవాంఛనీయ వాతావరణాన్ని గర్హిస్తోంది. అధికారంలో ఉన్నవారు ఓరిమితో ఉంటే విలువ మరింత పెరుగుతుంది. దాడికి దిగడం సులభం. దానివల్ల అహాన్ని కొంచెం ఉపశమింపచేయవచ్చు. కానీ, పరిణతితో వ్యవహరిస్తే అంతకన్నా మించిన ప్రయోజనాన్ని రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పొందవచ్చనేది ‘నేషనలిస్ట్ హబ్’ అభిప్రాయం.

    ప్రస్తుతం నెలకొన్న ఉద్రేక స్థితిలో స్పందించాలా వద్దా అన్న మీమాంస ఎదురైంది. అయితే, క్లిష్ట సమయంలోనే సరైన బాణీ వినిపించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ వీడియో ద్వారా మా అభిప్రాయాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం.

    రాజకీయ విమర్శకు ఉపయోగించాల్సిన భాష విషయంలో జాగరూకత అవసరం. అది పాటించనపుడు వాస్తవాలు మాట్లాడినా అవి చేరాల్సిన వారికి చేరకపోగా, ప్రతీప శక్తుల దాడికి కారణమవుతాయి. తీన్మార్ మల్లన్న విషయంలో ఇప్పుడదే జరిగింది. పరిణతి ప్రదర్శిస్తూ పదునైన విమర్శను సంధించవచ్చు. నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్నీ, కేబినెట్ మంత్రులనూ, శాసన సభ్యులనూ విమర్శించేందుకు సవాలక్ష అంశాలు ఉండనే ఉన్నాయి.

    అలా కాకుండా సామాన్య ప్రజలు తమ కోపతాపాల్లో ప్రయోగించే భాషను రాజకీయ విమర్శలో వాడితే, పాత్రికేయ వ్యాఖ్యలో ఉపయోగిస్తే…సాధారణ ప్రేక్షకులను రంజింపచేయవచ్చు. కానీ, అధికార వర్గాల ఆగ్రహానికి కారణమై, నిజాయితీగల శక్తులు నిలుచున్న ఫళాన ఊచలు లెక్కించే ప్రమాదాన్ని అంచనా వేయలేకపోవడం దురదృష్టకరం.

    వ్యక్తిజీవితాన్నీ, పిల్లల్నీ నీచ రాజకీయాల్లోకి లాగుతారా మంత్రి కేటీఆర్ ఆవేదనతో ట్వీట్ చేశారు. నిజమే తండ్రిగా ఆయనకు బాధ కలిగి ఉండవచ్చు. తనయుడి శరీర సౌష్టవం గురించి వస్తున్న వార్తల్ని విని కలత చెంది ఉండవచ్చు.

    కానీ, కేటీఆర్ తనయుడు కుటుంబ పరిధి నుంచి రాజకీయ మైదానంలోకి తెలిసో తెలియకో ప్రవేశించాడు. కుటుంబ పెద్దల అనుమతి ఉందో లేదో కూడా తెలియదు. లేదా కొంతమంది ఔత్సాహిక యువనేతలు ముఖ్యమంత్రి కుటుంబం దృష్టిలో పడాలన్న అత్యుత్సాహం కొద్దీ కేటీఆర్ తనయుణ్ని రాజకీయ మైదానంలోకి తీసుకువచ్చారేమో… అది కూడా తెలియదు.

    భద్రాద్రి ఆలయానికి కేటీఆర్ తనయుడు ముత్యాల తలంబ్రాలూ, పట్టు వస్త్రాలూ సమర్పించిన సందర్భాన్ని చూసినా, ముఖ్యమంత్రి సీటులో కూర్చుని పసితనంగా నవ్విన సందర్భంలో అయినా…ఎంతో కొంత కుటుంబ పెద్దల ఆమోదమో, ప్రోత్సాహమో ఉండే ఉంటుందని సామాన్యులకు అనిపించడం సహజం.

    అంతటితో ఆగలేదు. అనేక పత్రికల్లో అనేక సందర్భాల్లో కేటీఆర్ తనయుడు కనిపిస్తూనే ఉన్నాడు. మీరు రాజకీయాల్లోకి వస్తారా అని కేటీఆర్ తనయుణ్ని ప్రశ్నించడం తాను రానని, తనకు వేరే ఆశయాలూ, కలలూ ఉన్నాయని చెప్పడం కూడా జరిగిపోయాయి. కుటుంబం అనే వ్యక్తిజీవిత పరిమితి తొలగిపోయి బహిరంగ ప్రజా జీవితంలోకి నేతల కుటుంబ సభ్యులు ఎవరైనా సరే… వచ్చాక ఇలాంటి ఘటనలు తారసపడటం సహజం.

    గతంలో రాజకీయ నేతల వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ప్రజలకు తెలిసేది కాదు. ఉదాహరణ కేసీఆర్ తనయి కవిత వక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తెలంగాణ రాష్ట్ర సమితిలోని సీనియర్లకూ, కవిత కుటుంబ సన్నిహితులకు తెలిస్తే తెలియవచ్చు.

    మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ 2001లో ప్రారంభించినప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. కేటీఆర్, కవిత వచ్చేదాకా ప్రజలకు కేసీఆర్ సంతానం గురించి వీసమెత్తు వివరం తెలియదు. కేటీఆర్ మంత్రి అయ్యేవరకూ ఆయన కుటుంబం గురించి కూడా ఎవరికీ తెలియదు.

    అంటే రాజకీయ నాయకుల కుటుంబాలు పరదాలకే పరిమితమవ్వాలా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఖచ్చితంగా బహిరంగ జీవితంలోకి రావచ్చు. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించవచ్చు. అది వారివారి ఐచ్ఛిక నిర్ణయానికి సంబంధించిన అంశం. ఒక్కసారి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాక విమర్శలు రావడం సహజం. అయితే పిల్లల్ని నీచ రాజకీయాల్లోకి లాగుతారా అన్నది తాజా వివాదం.

    కేటీఆర్ తనయుడు ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న సందర్భంలో చాలా చర్చ జరిగింది. సరే దాన్ని పిల్లచేష్టగానో, ఆకతాయితనంగానో అర్థం చేసుకోవచ్చు. కానీ, భద్రాద్రి ఆలయానికి పట్టువస్త్రాలను సమర్పించడాన్ని ఆకతాయితనమని అనుకోలేం కదా అన్నది ప్రజల్లో కలిగే అభిప్రాయం. ఎక్కడో మారుమూల ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పిస్తే వివాదం చెలరేగేది కాదు.

    కానీ, దేవాదాయ శాఖ పరిధిలోని అతి పెద్ద ఆలయానికి ప్రభుత్వమే పెట్టిన ‘ప్రొటోకాల్’ను ప్రభుత్వమే అతిక్రమించిపుడు విమర్శలు రాకుండా ఉంటాయా? ముఖ్యమంత్రికి తీరిక లేకపోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవచ్చు. కేబినెట్ లో దేవాదాయశాఖ మంత్రి ఉంటారు… ఆయనైనా వెళ్లవచ్చు. సరే సదరు మంత్రిగారు కూడా సమయాభావం వల్ల రాలేకపోవచ్చు.

    స్థానిక శాసన సభ్యుడైనా వెళ్లవచ్చు. పోనీ, ఎమ్మెల్యేకు కూడా తన పనుల్లో మునిగిపోయి ఉండవచ్చు. ఇంకెవరైనా ప్రజాప్రతినిధిని పురమాయించి ఉండవచ్చు. ఇదేదీ జరగలేదు. పైగా ముఖ్యమంత్రి మనవడు, మంత్రి తనయుడు అనే ఏకైక అర్హత ప్రభుత్వ ప్రొటోకాల్ ను రద్దు చేసే స్థాయికి చేరితే ఎట్లా అర్థం చేసుకోవాలనే ఆవేదన ఓటువేసిన ప్రజలకు కలుగుతుంది కదా!

    మంత్రి కేటీఆర్ ట్విటర్ లో స్పందిస్తూ…సోషల్ మీడియా దిగజారిపోయిందని ఆవేదన చెందారు. ప్రసార మాధ్యమాలతో పాటు, సోషల్ మీడియా కూడా వాటంతట అవి దిగజారిపోలేదు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వస్తున్న అవాంఛనీయ పరిణామాలే మాధ్యమాల దిగజారుడుతనానికి ఆస్కారం ఇచ్చాయి. రాజకీయాలు హూందాగా ఉంటే మాధ్యమాలు మర్యదగానే ప్రవర్తిస్తాయి.  

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ కేంద్రంగా వ్యక్తిదూషణ మొదలైంది. ఈ దూషణల పర్వం ప్రజలను అలరించింది. ఈ జనరంజక దూషణల పర్వం ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఇంగితం ఆనాడు ఎవరికీ లేకపోయింది.

    అందుకు కారణం, చంద్రబాబునాయుడుపై ఉన్న వ్యతిరేకత. ‘‘తల ఎక్కడ పెట్టుకోవాల్నో అర్థమైతాందా రాజేంద్రా నీకు’’ అని అసెంబ్లీ సాక్షిగా ఈటల రాజేందర్ గురించి వైఎస్ అన్నప్పుడైనా, చంద్రబాబునాయుడును ఉద్దేశించి ‘మీ అమ్మకడుపులో ఎందుకు పుట్టానా అని బాధపడతావు’’ అని అన్నప్పుడైనా అందరూ కేరింతలు కొట్టారు. అక్కడ మొదలైంది పతనం వైపు ప్రయాణం.

    ఆ తర్వాత మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అనుచితమైన, పరుషమైన భాషా ప్రయోగాలు జరిగిపోయాయి. నాడు అందరికీ ఘాటుగా, సూటిగా వినిపించిన, అనిపించిన వ్యాఖ్యల్లో ఖండించదగిన పదప్రయోగాలు చాలా ఉన్నాయి. అయితే ప్రాంతీయ ఉద్యమాల బలం, బలహీనత కూడా ఇదే!

    ప్రాంతీయ ఆకాంక్ష సాధన అనే ఉద్వేగపూరిత యజ్ఞంలోని సంభాషణల్లో ఎన్ని నిందలైనా వినసొంపుగానే ఉంటాయి. దేశాల మధ్య ఉన్న వైరం స్థాయిలో ఉంటుంది ప్రాంతీయ ఉద్యమాల్లోని వైషమ్యం. తొలిదశ తెలంగాణ ఉద్యమం విద్రోహానికి గురై సుదీర్ఘ కాలం విస్మరణకు గురైన కారణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో విచక్షణ లేని వ్యతిరేకత మరింత ఘాటుగా వ్యక్తమైంది. అలాంటి ఉద్రిక్త స్థితిలో ఎవరూ వారించలేరు.  ఈ స్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతీయ ఉద్యమాలకూ ఈ పరిమితి ఉంది. ఉంటుంది కూడా.

    ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదమే పెద్ద సమస్య. ప్రాంతీయ ఉద్యమాలకు నాయకత్వం వహించిన సంస్థలు లేదా పార్టీలు లక్ష్యాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకాలంలో అలవడిన స్వభావం తాలూకు అనారోగ్యకర ధోరణి పరిపాలనలోనూ వ్యక్తమవుతుంది. ఇదే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది.

    ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యే వరకూ వివిధ సందర్భాల్లో స్పందిస్తున్న తీరు, వాడుతున్న భాష చూస్తే…రాజకీయ పరిణతి స్థానంలో వ్యక్తిత్వరాహిత్యమే కనిపిస్తోంది. రైతు ధర్నా సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ని ఉద్దేశించి పెంపుడు కుక్క అన్నారు. అంతటితో ఆగలేదు ప్రధానిని ఉద్దేశించి ‘బాడ్కవ్’ అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు.

    ధర్నాచౌక్ వద్ద ముఖ్యమంత్రి పక్కనే నిల్చుని ‘మూడిందిర ఓ కేడీ’ అంటూ ప్రధానిని ఉద్దేశించి పాటను ఆలపించారు. సీఎం కేసీఆర్ కనీసం వారించ లేదు కూడా. అభ్యంతరకరం, అసభ్యకరం, అనుచితం అనే ముసుగు మాటలు అక్కరలేదు. టీఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీల్లోని నేతలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. పైగా, ఈ బూతుపురాణాలకు విశేషమైన మద్దతు వస్తోంది. ఈ స్థితినే సోషల్ మీడియా సహా, ప్రసారమాధ్యమాలన్నీ వాడుకుంటున్నాయి.

    ‘యూట్యూబ్’లో కొడాలి నాని పేరు ట్రెండింగ్ లో ఉంటుంది. ఏది జరిగినా ఛానళ్లు, సోషల్ మీడియా కొడాలి నాని వెంటపడతాయి. ఎవరిని ఎలా చీవాట్లు పెడతారో చూసి ఆనందిద్దామనే ఉద్దేశంతో…కేసీఆర్ ప్రెస్ మీట్ అనగానే ప్రేక్షకులు టీవీ తెరలకు అతుక్కుపోతారు. ‘రారా కొడకా ఆరు ముక్కలైతవ్’ అంటే అందరూ తెగ సంబరపడ్డారు. ఇది తెలంగాణ ఉద్యమం సాధించిన రాజకీయ పరిణతి.

    మన రాజకీయ సంస్కృతికి ప్రతీక. కేటీఆర్ తనయుణ్ని అభ్యంతరకరంగా మాట్లాడటాన్ని ఖండించాల్సిందే కానీ, మోదీని బాడ్కవ్ అన్నపుడు కూడ మనకు ఇదేరీతి సంవేదశీలతను ప్రదర్శించి ఉండాల్సింది కదా! సంస్కారం గురించి స్పృహ ఆరోజు కూడా ఉండి ఉంటే బావుండు కదా!  మోదీ అనేకాదు, ఎవరు ఎవరినైనా విమర్శిస్తున్నపుడు ఉపయోగిస్తున్న భాషపట్ల జాగ్రత్తగా ఉండాలి కదా! మన నోటివెంట వెలువడే మాట మన పరిణతిని చెపుతుంది. రాజకీయ విమర్శలో ఉపయోగించే పదజాలం సమాజం పట్ల మనకున్న గౌరవాన్ని తేటతెల్లం చేస్తుంది. ఈ తరహా అనారోగ్యకర వాతావరణానికి ఇప్పటికైనా చికిత్స చేస్తే…రాజకీయాలకు మాత్రమే కాదు, సమాజానికి మరింత మేలు జరుగుతుంది. ఆ రోజులు వస్తాయని ఆశిద్దాం.

    Trending Stories

    Related Stories