ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో పాకిస్తాన్ సిరీస్ కు ఏ మాత్రం అనుభవం లేని ఆటగాళ్లను సెలెక్ట్ చేశారు. బెన్ స్టోక్స్ ను కెప్టెన్ గా ఉంచి.. కౌంటీ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇక పాకిస్తాన్ తో సిరీస్ మొదలైంది. ఇంగ్లండ్ జట్టు చాలా వీక్ గా ఉందని.. పాక్ ఫేవరట్ అంటూ లెక్కలు కట్టారు. కానీ గ్రౌండ్ లో దిగాక ఇంగ్లండ్ పాక్ కు దిమ్మదిరిగిపోయే షాక్ ను ఇచ్చింది. మొదటి బంతికి పాక్ ఓపెనర్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక నంబర్ 1 ఆటగాడైన బాబర్ ఆజమ్ మొదటి ఓవర్ మూడో బంతికే వెనుదిరిగాడు. ఇక 35.2 ఓవర్లలోనే పాక్ ఆలౌట్ అయింది. 142 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ చేరుకుంది. 21.5 ఓవర్లకే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డేవిడ్ మలాన్, జాక్ క్రాలీ లను పాక్ బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు.
సోఫియా గార్డెన్స్ క్రికెట్ మైదానంలో పాక్ చిత్తుగా ఓడిపోయిన కారణంగా అభిమానులు పాక్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందడంతో ఇంగ్లాండ్ పూర్తిగా భిన్నమైన, అనుభవం లేని వన్డే జట్టును దింపింది. దీంతో పాకిస్తాన్ సిరీస్ గెలవడానికి అవకాశం ఉందని అందరూ భావించారు.స్టాండ్-ఇన్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో తొలి వన్డేలో ఐదుగురు క్రికెటర్లకు ఇంగ్లాండ్ తొలిసారి అవకాశం ఇచ్చింది. యువ ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ ను అన్ని విభాగాలలో అధిగమించింది. కొంతమంది అభిమానులు పాక్ ప్రదర్శనపై నిరాశ చెంది పాకిస్తాన్ ను ట్వీట్లతో ట్రోల్ చేశారు. కెన్యా, జింబాబ్వేలతో మ్యాచ్ లు ఆడుకోమంటూ విమర్శలు గుప్పించారు. అలా అయితే పాక్ టీమ్ మెరుగ్గా కనిపిస్తుందంటూ విమర్శలు చేశారు.
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసు తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టును కరోనా వైరస్ వెంటాడింది. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయ సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అందరినీ ఐసోలేషన్‌కు పంపించి చికిత్స అందిస్తోంది. పాక్‌తో సిరీసుకు బెన్‌స్టోక్స్ సారథ్యంలో కొత్త ఆటగాళ్లతో అప్పటికప్పుడు మరో జట్టును ఎంపిక చేసింది. ఆ జట్టు మీద కూడా పాక్ విజయం సాధించలేకపోయింది సరి కదా కనీసం పోరాడలేదన్నది అభిమానుల వాదన..!