Special Stories

భగత్ సింగ్, రాజ్‎గురు, సుఖ్‎దేవ్.. మీ రుణం తీరేదెలా..?

అవి భారతీయులు అనేక రకల అవమానాలకు, హింసాకాండలకు గురవుతున్న రోజులు. వీటిని ఎదరించేందుకు ఆ నవయుకులు ఉద్యమించారు. ఆనాటి ఢిల్లీలోని సెంట్రల్‌ అసెంబ్లీలో బాంబులు ప్రాణ హాని జరుగకుండా కేవలం నిరసన వ్యక్తం చేస్తూనే బాంబులు విసిరారు. తద్వారా బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించారు. అంతేకాదు తమ పోరాట పటిమతో దేశంలో ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ రోజుల్లోనే యువకుల్లో గాంధీజీ కంటే ఎక్కువ కీర్తీని సంపాదించిన అగ్నికణమే భగత్‌సింగ్‌, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు..! మార్చి 23 ‘షహీద్ దివస్’ సందర్భంగా నేషనలిస్ట్ హాబ్ ఆ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తోంది..!

జలియన్‌వాలా భాగ్‌ మారణకాండ జరిగినప్పుడు భగత్‌సింగ్‌ వయస్సు 12ఏళ్ళు. ఆ ఘటన ఆ పసిహృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. భారత ప్రజల రక్తంతో తడిసిన ఆ మట్టిని సేకరించాడు భగత్‌ సింగ్! ఏనాటికైన బ్రిటీష్‌ పాలకుల్ని దేశం నుండి వెళ్లగొడతానని ఆనాడే ప్రతిజ్ఞ చేశాడు బాల భగత్. 1928 అక్టోబర్‌ 30న పంజాబ్‌ కేసరి లాలాలజ్‌పత్‌రాయ్‌ నేతృత్వంలో ‘సైమన్‌కమిషన్‌ గో బ్యాక్‌’ ఉద్యమంలో భగత్ సింగ్ తన మిత్రులతో కలిసి పాల్గొన్నాడు. రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో స్కాట్‌ అనే ఆంగ్లేయ అధికారి లాలాజీని టార్గెట్‌ చేసి విపరీతంగా కొట్టించాడు. అయితే భగత్‌ అతని స్నేహితులు సుఖ్‌దేవ్‌, యశ్‌పాల్, భగవతీ చరణ్‌లు లాలాజీకి దెబ్బలు తగలకుండా రక్షణగా ఉండే ప్రయత్నం చేశారు. అయినా ఆంగ్లేయ అధికారి లాఠీ చార్జ్ ను మాత్రం ఆపలేదు. దీంతో తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన లాలాజీ మరణించారు. లాలాజీ మరణంతో… భగత్ సింగ్ లో బ్రిటీష్ పాలనపై ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. లాలాజీ మరణానికి కారణమైన స్కాట్‌ను తుదముట్టించేందుకు భగత్‌సింగ్‌, చంద్రశేఖర్ ఆజాత్‌తో కలిసి పథక రచన చేశాడు. అయితే సాండర్స్‌ అనే అధికారిని స్కాట్‌గా భావించి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగానే మట్టుబెట్టారు.

సాండర్స్‌ హత్య తర్వాత లాహోర్‌లో ఉండటం క్షేమంకాదని తలచి.. విదేశీ యువకుడి వేషంలో భగత్‌ సింగ్, కూలివాని వేషంలో రాజ్‌గురు, సాధువు వేషంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేశ వ్యాప్తంగా తమ పోరాటానికి మద్దతు కోసం దేశప్రజలను చైతన్యవంతం చేయాలని భగత్‌సింగ్‌ భావించారు. ఏప్రిల్‌ 8-1929లో ఢిల్లీలోని సెంట్రల్‌ అసెంబ్లీ సమావేశంలో మరో విప్లవకారుడు బటుకేశ్వర్‌దత్‌తో కలిసి బాంబులు వేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయారు.

సాండర్స్‌ హత్యతోపాటు అనేక కేసులు భగత్‌సింగ్‌ పై బనాయించింది బ్రిటీష్‌ ప్రభుత్వం ! విచారణ కాలంలో లాహార్‌ జైల్లో రాజకీయ ఖైదీలకు మెరుగైన వసతుల కోసం 34 రోజులపాటు నిరాహార దీక్షలు చేశారు భగత్ సింగ్ ! అయితే 64 రోజులపాటు నిరహదీక్షను కొనసాగించిన జతీన్‌దాస్‌ మరణించడం భగత్‌ను తీవ్రంగా కలిచివేసింది. చాలా రోజులు విచారణ కొనసాగించిన ప్రభుత్వం భగత్‌సింగ్‌,సుఖ్‌దేవ్‌,రాజ్‌గురులకు ఉరిశిక్ష, మరికొందరికి 5 ఏళ్ళు, ఇంకొందరికి 7ఏళ్ళ శిక్షలు విధించింది. దేశవ్యాప్తంగా భగత్‌సింగ్‌తోపాటు ఆయన అనుచరులను విడుదల చేయాలని పెద్ద ఎత్తున వైస్రాయిపై ఒత్తిడి పెరిగింది. దీంతో మొదట ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే 1931 మార్చి 23వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం లాహార్‌ జైలులో ఉరితీసింది. వారి మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించకుండా… రహస్యంగా దహనం చేయించేందుకు యత్నించింది బ్రిటీష్‌ ప్రభుత్వం. వేలాది మంది ప్రజలు అక్కడికి రావడం చూసి భయపడిన బ్రిటీష్ ప్రభుత్వ పోలీసు అధికారులు సగం కాలిన వారి దేహాలను ముక్కలుగా నరికి నదిలో పారవేయించి అక్కడి నుంచి పరారు అయ్యారు. నదిలో దూకి ముక్కలు చేయబడిన ఆ శరీర భాగాలను సేకరించి తిరిగి దహసన సంస్కార క్రియలు నిర్వహించారు. వారి ఈ చరిత్ర అందరికీ తెలిసినదే అయినా ఆ స్ఫూర్తి నేటి భారతీయ యువలకులలో కనుమరుగవుతున్న తరుణంలో మరోమారు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు దేశం కోసం చేసిన ఈ బలిదానం గురించి స్మృతికి తెచ్చుకుంటున్నాం.. జై హింద్.. భారత్ మాతాకి జై..

Related Articles

Leave a Reply

Your email address will not be published.

18 + twenty =

Back to top button