కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త అధ్యాయం.. ఎవరీ అనన్య..?

0
803

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రేడియో జాకీ చరిత్ర సృష్టించబోతున్నారు. వెంగర నియోజకవర్గం నుంచి.. డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ తరఫున టీవీ గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. అయితే, ఇందులో ప్రత్యేకత ఏముందనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్న.. ఆమె ఒక ట్రాన్స్ జెండర్. పేరు అనన్య కుమారి అలెక్స్. కేరళ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో పోటీచేస్తున్న తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కారు.

28 ఏళ్ల అనన్య కుమారి అలెక్స్.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పీకే కున్హలికుట్టిపై పోటీచేస్తున్నారు. కొల్లాం ప్రాంతానికి చెందిన అనన్య ఇంటర్ వరకు చదువుకున్నారు. ఇప్పటికే తొలి ట్రాన్స్ జెండర్ రేడియో జాకీగా ఇప్పటికే పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న అనన్య.. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. కేరళ నుంచి తొలి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టిస్తారు. అనన్య పోటీచేస్తున్న డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ.. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం.

అనన్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్బంగా అనన్య మాట్లాడుతూ ఇతర మహిళలు, పురుషులకు మల్లే తమకు కూడా పూర్తి శక్తిసామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. తమపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఇతరుల్లాగే తమకు గౌరవం ఇస్తే చాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ఆమె ప్రత్యర్థి.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి కున్హలికుట్టి స్వాగతించారు.

ఇదిలావుంటే తన ప్రత్యర్థి కున్హలి కుట్టిపై విమర్శలు గుప్పించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎన్నో ఏళ్లుగా స్త్రీలను ప్రత్యక్ష ఎన్నికలలో అనుమతించడం లేదన్నారు. ఆ పార్టీకి వెన్నెముక లాంటి తన ప్రత్యర్థి కున్హలికుట్టి భావజాలం కూడా ఇదేనని అనన్య దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలిచి స్త్రీలు, ట్రాన్స్ జెండర్లు మంచి పాలన అందిస్తారని నిరూపించదల్చుకున్నానని ఆమె చెప్పారు.

అలాగే, తన కష్టాలను నెమరువేసుకున్నారు. కొంతకాలం క్రితం తాను సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పారు. అయితే, ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల తనలో కొన్ని సమస్యలు తలెత్తాయని.. ఇందుకోసం ఆసుపత్రిపై న్యాయపోరాటానికి దిగుతున్నట్టు ప్రకటించారు. ఇక, సెక్స్ మార్పిడి ఆపరేషన్ వల్ల తాను కుటుంబానికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసిన అనన్య, తన తల్లి, సోదరుడు తనను ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు. అయితే, తన తండ్రి మాత్రం తనను అర్థం చేసుకున్నారని.. ఆయన ఒక్కరే తనకు సపోర్టుగా నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు అనన్య. చూడాలి మరి, కేరళ ఎన్నికల్లో గెలిచి.. తొలి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తారో లేదో..

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

5 × 3 =