పాకిస్తాన్ లో ఢీకొన్న రెండు రైళ్లు.. 30 మంది మృతి

పాకిస్తాన్ లో సోమవారం తెల్లవారు జామున రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్ ఎక్స్‌ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. పట్టాలు తప్పిన సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలును.. మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనలో 30 మంది మృతి చెందారని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలో పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా చెప్పారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. బోగీల్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకోగా వారిని బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
రెతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుందని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు లాహోర్ కు వెళుతూ ఉండగా.. మిల్లట్ ఎక్స్‌ప్రెస్ కరాచీ నుండి సర్గోదాకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది చనిపోయారని.. ఇంకో 50 మంది దాకా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 10కి పైగా బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బోగీలలో ఇరుక్కుపోయిన ప్యాసెంజర్లను బయటకు తీస్తూ ఉన్నారు. ఘటనా స్థలం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. గాయపడ్డ వాళ్లను సమీప ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు.