
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన్ జిల్లా పర్వానులో సాంకేతిక కారణాలతో గాలిలోనే కేబుల్ కారు నిలిచిపోయింది. దీంతో ఇందులోని పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.
సోమవారం మధ్నాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో 11 మంది ప్రయాణికులు కేబుల్ కారులో ఉన్నారు. సుమారు మూడు గంటల రెస్క్యూ ఆపరేషన్‌లో ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. టింబర్ ట్రయిల్ ఆపరేటర్ టెక్నికల్ టీమ్, పోలీసు టీమ్ ఘటనా స్థలిలోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సోలాన్ జిల్లా పోలీసు చీఫ్ వీరేంద్ర శర్మ తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు సమాచారం ఇచ్చినట్టు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ధన్‌బీర్ ఠాకూర్ తెలిపారు.
పర్వానూలోని టింబర్ ట్రెయిల్ ప్రైవేట్ రిసార్ట్‌కు చెందిన రోప్ వేపై వెళ్లే కేబుల్ కార్లు ఎంతో ప్రసిద్ధి. శివాలిక్ పర్వత శ్రేణుల మీదుగా ఇవి ప్రయాణిస్తూ పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి. కాగా, గతేడాది అక్టోబర్‌లోనూ ఇదే తరహాలో గాల్లో కేబుల్ కార్ నిలిచిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టి 10 మందిని కాపాడారు. అయినప్పటికీ ఒక వ్యక్తి మృతిచెందాడు.