More

  భారత సాగర జలాల్లోకి తొలి విహార నౌక… డిమాండ్ ఫుల్..!

  భారత సాగర జలాల్లోకి తొలి విహార నౌక అడుగుపెట్టింది. తూర్పు తీరానికి రెండు వేల మందికి పైగా పర్యాటకులతో అడుగుపెట్టిన ఈ నౌకను అంతర్జాతీయ సంస్థ కార్డేలియా క్రూయిజ్ సంస్థ ఎంప్రెస్ క్రూయిజెస్ పేరిట నడుపుతోంది.

  ఎంప్రెస్ క్రూయిజ్ విహార నౌకను వాస్తవంగా దుబాయికి చెందిన కార్డేలియా క్రూయిజ్ సంస్థ నడుపుతోంది. ఈ సంస్థ భారత సాగర జలాల్లో మాత్రమే పర్యాటకుల కోసం నడిపేందుకు ప్రభుత్వ అనుమతి పొందింది. దీన్ని నడిపేందుకు భారత దేశం లో ప్రముఖ షిప్పింగ్ సంస్థ జే ఏం బక్సీ ఫ్రాంచైజ్ తీసుకుంది. ఈ నేపథ్యం లో ఈ నౌక చెన్నై నుండి బయలుదేరి ఈ నెల 8 న ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ చేరుకుంది. తిరిగి సాయింత్రం 8 గంటలకు విశాఖ నుండి బయలుదేరి 9 వ తేదీ మొత్తం సముద్రం లోనే ప్రయాణం చేస్తుంది. ఆ తరువాత 10 వతేది ఉదయం 7 గంటలకి పుదుచ్చేరి చేరుకుంటుంది. అదేరోజు సాయింత్రం 7 గంటల వరకు పుదుచ్చేరి లో పర్యాటకులు విహరించే విధంగా సదుపాయాలు కల్పించింది. 10 వ తేది సాయింత్రం ఏడుగంటలకు పర్యాటకులతో పుదుచ్చేరి నుండి బయలుదేరి 11న నాల్గవ రోజు చెన్నై చేరికుంటుంది.

  ఈ విహార నౌక ప్రయాణికుల సామర్ధ్యం 2400. మొత్తం 11 అంతస్థులున్న ఈ నౌక లో మొదటి రెండు అంతస్థుల్లో ఇంజన్ ఏర్పాటు, సరుకుల కోసం కేటాయించారు. 3 వ అంతస్థునుండి పర్యాటకుల కోసం కేబిన్లు ఏర్పాటు చేశారు. 10 వ అంతస్తు లో విశాలమైన డెక్ ఉంటుంది. 11 వ అంతస్తునుండి ప్రయాణికులు సూర్యోదయం, సూర్యాస్తమాయలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ అంతస్తునుండే అనంత సాగరాన్ని కూడా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు సంస్థ నిర్వాహకులు. ఇక ప్రయాణికులు ఎక్కి దిగేందుకు నౌక లో లిఫ్ట్ కూడా ఉంది. విలాసవంత మైన స్టార్ హోటల్, కాసినో, చిన్నారులకోసం కిడ్స్ అకాడమీ, సూపర్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా థియేటర్లు… ఇలా ఎన్నో ఆధునాతనమైన సౌకర్యాలను షిప్ లో అందుబాటులో తీసుకువచ్చారు నిర్వాహకులు.

  ఈ విహార నౌకలో మొత్తం నాలుగు పగళ్ళు, మూడు రాత్రులు నౌకాయానం చేస్తూ అధ్బుతమైన అనుభూతిని అందిస్తుందని ఏపీ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ మోహన్ చెబుతున్నారు. ఈ నౌకలో ప్రయాణించాలంటే ఎటువంటి పాస్ పోర్ట్ అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. పర్యాటకుల అవసరాన్ని బట్టి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. విండో ఉండే కేబిన్ ఓషన్ వ్యూ కు ఎక్కువ మంది పర్యాటకుల నుంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గ గదులను కేటాయిస్తున్నారని టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ మోహన్ చెబుతున్నారు.
  ఒక్క రోజు, ఒక్క రాత్రి ఈ నౌక లో ప్రయాణించాలంటే ఒక్కొక్కరికి 9200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

  మొదటి ట్రిప్పుకే ఈ నౌక కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో ఈ విహార నౌకను ఇప్పటివరకు ఈ నెల 8, 15, 22, 29 తేదీల వరకు మాత్రమే నడపాలని మొదట భావించారు నిర్వహకులు. అయితే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.

  ఇదిలా ఉండగా రెండువేలమందికి పైగా పర్యాటకులతో పోర్ట్ చరిత్ర లోనే తొలిసారి వచ్చిన ఈ విహార నౌకకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ అన్ని అనుమతులు ఇచ్చింది. చెన్నై నుండి మొదటి ట్రిప్పులో వచ్చిన ఈ నౌక కు 7 వ నెంబర్ జెట్టి కేటాయించింది. ఇక విశాఖ నుండి బయల్దేరే సమయంలో పర్యాటకుల రద్దీ ని నియంత్రిస్థూనే, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసుల సహకారాన్ని తీసుకుంది పోర్ట్ అథారిటీ. అయితే ఈ షిప్ లో నౌకాయానం చేసేందుకు విక్రయించే టికెట్ లకు, పోర్ట్ కు ఎటువంటి సంబంధం లేదంటున్నారు పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు.

  Trending Stories

  Related Stories