పాకిస్తాన్ మద్దతిస్తున్న తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెడుతూ ముందుకు వెళుతోంది. భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్ కమాండర్ షామ్ సోఫీగా గుర్తించారు. జైషే మహ్మద్ ఉగ్రవాది షామ్ సోఫీని భద్రతా దళాలు బుధవారం కాల్చిచంపాయి. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేసింది. పుల్వామా జిల్లాలోని అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలోని తిల్వాని మొహల్లా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదిని అంతం చేసినట్లు ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ తెలియజేశారు. జమ్మూ కశ్మీర్ పోలీస్, CRPF మరియు ఇండియన్ ఆర్మీ సంయుక్త ఆపరేషన్ సమయంలో అతను మరణించాడు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆ ప్రాంతంలో మరిన్ని బలగాలను పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. గత మూడు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగడం ఇది ఆరోసారి. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మంగళవారం పోషియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్‌ఈటీతో సంబంధాలున్న ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి.
కేంద్ర పాలిత ప్రాంతంలో హిందూ మరియు సిక్కు పౌరులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు హత్యలు చేస్తున్న నేపథ్యంలో భద్రతా దళాలు తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. అక్టోబర్ 12 న పాకిస్తాన్ కు చెందిన కొత్త ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) కి చెందిన ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలు చంపేశాయి. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే-తోయిబా (లెట్) కు చెందిన తీవ్రవాది ముఖ్తార్ షా ను సైన్యం చంపింది. బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాకు చెందిన వీరేంద్ర పాశ్వాన్ అనే వీధి విక్రేత హత్యకు కారణమైన ఉగ్రవాదుల్లో ఒకడు ముఖ్తార్ షా. అక్టోబర్ 11 న, బందిపోరాలోని గుండ్ జహంగీర్ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ టిఆర్‌ఎఫ్‌తో సంబంధం ఉన్న మరో ఇస్లామిక్ తీవ్రవాది ఇంతియాజ్ అహ్మద్ దార్‌ని కాల్చి చంపాయి. అహ్మద్ దార్ బందిపోరాలోని షాగుండ్ వద్ద ఒక పౌరుడిని చంపడంలో పాల్గొన్నాడు. అదే రోజు, జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సమయంలో భారత సైన్యంలోని ఒక JCO మరియు 4 మంది జవాన్లు ప్రాణాలను త్యాగం చేశారు.
తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్.ఐ.ఏ.
అక్టోబర్ 13, బుధవారం నాడు ఎల్‌ఇటి, టిఆర్‌ఎఫ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. ఈ ఉగ్రవాదులు వసీమ్ అహ్మద్ (చత్తబాల్, శ్రీనగర్), తారిఖ్ అహ్మద్ దార్ (షేర్‌గర్హి, శ్రీనగర్), బిలాల్ అహ్మద్ మీర్ అలియాస్ బిలాల్ ఫుఫు (పరింపొర, శ్రీనగర్), తారిఖ్ అహ్మద్ బాఫండా (రాజౌరి కడల్, శ్రీనగర్)కు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం నాడు ఎన్‌ఐఏ విచారణకు సంబంధించి జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్, పుల్వామా మరియు శ్రీనగర్‌లోని 16 ప్రదేశాలలో దాడులు జరిపింది. జమ్మూ కాశ్మీర్ మరియు న్యూఢిల్లీ సహా ఇతర ప్రధాన నగరాల్లో హింసాత్మక ఉగ్రవాద చర్యలను చేపట్టడానికి భౌతికంగా, సైబర్‌స్పేస్‌లో కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ఏజెన్సీ అందుకుందని ఎన్ఐఏ పత్రికా ప్రకటనలో పేర్కొంది. హిజ్బ్-ఉల్-ముజాహిద్దీన్ (HM), అల్ బదర్, టిఆర్ఎఫ్, పీపుల్ ఎగైనెస్ట్ ఫాసిస్ట్ ఫోర్సెస్ (PAFF) మొదలైన అనుబంధ సంస్థలకు సహాయం చేస్తున్న తీవ్రవాదులను స్లీపర్ సెల్స్ లను పట్టుకునే పనిలో అధికారులు పలు చోట్ల సుదీర్ఘ సోదాలను నిర్వహించారు.