తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు గతరాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం, భరత్ అనే నేను వంటి చిత్రాల్లో నటించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో స్వర్గం -నరకం,రాధమ్మ పెళ్లి అనే సినిమాలను సైతం నిర్మించారు. సినిమాతో పాటు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, వంటి సీరియల్స్‌లోనూ నటించారు. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు. అమ్మ సీరియల్‌లోని పాత్రకు 2005లో నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.