టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దివంగత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత ‘మాధవి పిక్చర్స్’ సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు. కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేంద్రప్రసాద్ మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.