More

    భారత్ కు మరో బంగారు పతకం.. సుమీత్ ఆంటిల్ ప్రపంచ రికార్డు

    టోక్యో పారాలింపిక్స్ లో భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎఫ్64 కేటగిరీలో జావెలిన్ త్రో ఫైనల్లో సుమీత్ ఆంటిల్ స్వర్ణం గెలిచాడు. జావెలిన్ ను 68.55 మీటర్ల దూరం విసిరిన సుమీత్ ఈ క్రమంలో సరికొత్త వరల్డ్ రికార్డు కూడా నమోదు చేశాడు. తన తొలి ప్రయత్నంలో 66.95 మీటర్లు విసిరిన సుమీత్, రెండో ప్రయత్నంలో మరింత మెరుగయ్యాడు. ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి నూతన ప్రపంచ రికార్డు స్థాపించాడు. ఈ పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ బరియాన్ రజతం సాధించగా, శ్రీలంక పారా అథ్లెట్ దులన్ కొడితువాక్కు కాంస్యం దక్కించుకున్నాడు. సుమీత్ ఆంటిల్ ప్రదర్శనపై ప్రశంసలు దక్కుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ప్రశంసల్లో ముంచెత్తారు. టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు ఇది రెండో స్వర్ణం. ఇప్పటికే మహిళా షూటర్ అవని లేఖర తొలి స్వర్ణం అందించింది.

    టోక్యో పారాలింపిక్స్ లో డిస్కస్ త్రో క్రీడాంశంలో కాంస్యం గెలిచిన వినోద్ కుమార్ పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అతడి నుంచి పతకం వెనక్కి తీసుకున్నారు. వినోద్ కుమార్ ఏ విధమైన అంగ వైక్యలం కలిగి ఉన్నాడన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పారాలింపిక్స్ కాంపిటీషన్ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 41 ఏళ్ల వినోద్ కుమార్ డిస్కస్ త్రో ఫైనల్ ఈవెంట్ లో 19.91 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఫలితాన్ని కొందరు పోటీదారులు కాంపిటీషన్ ప్యానెల్ వద్ద సవాల్ చేశారు. దాంతో విచారణ జరిపిన ప్యానెల్ వినోద్ కుమార్ ఏ విధమైన వైకల్యం కలిగి ఉన్నాడో గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని, అతడిని ఎఫ్52 కేటగిరీలో పోటీపడేందుకు అర్హుడిగా భావించలేమని వెల్లడించింది. కొన్ని ప్రత్యేకమైన వైకల్యాలు కలిగివున్న వారిని ఎఫ్52 కేటగిరీలో పోటీపడేందుకు అనుమతిస్తారు. అయితే, ఎఫ్52 కేటగిరీలో పేర్కొన్న వైకల్యాల్లో దేన్ని వినోద్ కుమార్ కలిగివున్నాడో వర్గీకరించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని ప్యానెల్ అభిప్రాయపడింది.

    Medal Winners!

    Related Stories