మరికొద్ది గంటల్లో ఒలింపిక్స్ మొదలవ్వనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది జరగాల్సిన క్రీడలు వాయిదా పడ్డాయి. నేడు ప్రారంభం కానున్నాయి. మొత్తం 206 దేశాలకు చెందిన 11,300 మంది క్రీడాకారులు వివిధ అంశాల్లో పోటీ పడనున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. టోక్యోలోని ఒలింపిక్స్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభ వేడుకలు మొదలుకానున్నాయి. జపాన్ చక్రవర్తి నరుహిటో లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాగత ప్రసంగాలు, ఆయా దేశాల జాతీయజెండాల ఎగురవేత, క్రీడాకారుల పరేడ్, ఆతిథ్య దేశం తమ సాంస్కృతి, సంప్రదాయాలు, ఔనత్యాన్ని చాటేలా కళాకారుల ఆటపాటలు విశ్వక్రీడల ప్రారంభ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు. గతంలో 10 వేలకుపైగా క్రీడాకారులు ప్రారంభ వేడుకల పరేడ్‌లో పాల్గొనేవారు. ఈసారి మాత్రం చాలా తక్కువ మందితో నిర్వహించనున్నారు. ఎక్కువమంది కళాకారులతో కూడిన ప్రదర్శనలను ప్రీ-రికార్డింగ్ చేసి ప్రసారం చేయనున్నారు. మరికొన్ని లైవ్ ప్రోగ్రాంలూ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో మూవింగ్ ఫార్వర్డ్ థీమ్‌తో ఒలింపిక్స్ వేడుకలు నిర్వహిస్తుండగా.. యునైటెడ్ బై ఎమోషన్ అనే థీమ్‌తో టోక్యో-2020 ఒలింపిక్స్ ప్రారంభోత్సవం జరగనుంది.
టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మొత్తం 19 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఆరుగురు అధికారులు కూడా పాల్గొననున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా దేశాల అథ్లెట్ల సంఖ్యను ఓపెనింగ్ సెర్మనీ కోసం కుదించారు. షూటింగ్, బ్మాడ్మింటన్, ఆర్చరీ, హాకీ జట్లకు చెందిన ఆటగాళ్లను ప్రారంభ వేడుకలకు ఇండియా దూరం పెట్టింది. హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మాత్రం ఒక్కడే జాతీయ జెండాతో భారత అథ్లెట్ల బృందంలో పాల్గొంటారు. ఫెన్సింగ్ ప్లేయర్ సీఏ భవాని దేవి, జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, స్విమ్మర్ సాజన్ ప్రకాశ్‌తో పాటు 8 మంది బాక్సర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. మణ్‌ప్రీత్‌తో పాటు బాక్సర్ మేరీకోమ్ జాతీయ జెండాతో పరేడ్ చేస్తారు. లవ్‌లినో బోర్‌గోయిన్, పూజా రాణి, అమిత్ పంగల్, మనీష్ కౌశిక్, ఆశిశ్ కుమార్, సతీష్ కుమార్‌లు కూడా ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొంటారు. అధికార బృందంలో చెఫ్ డీ మిషన్ బీరేందర్ ప్రసాద్ బైష్యా, డిప్యూటీ చెఫ్ డీ మిషన్ డాక్టర్ ప్రేమ్ వర్మ, టీమ్ డాక్టర్ అరున్ బాసిల్ మాథ్యూ, టీటీ మేనేజర్ ఎంపీ సింగ్, బాక్సింగ్ కోచ్ అలీ ఖమర్, జిమ్నాస్టిక్స్ కోచ్ లఖానా శర్మలు ఉన్నారు.
ఈ ఏడాది భారత్ నుంచి 120 మంది వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో భారత బృందం ఒలింపిక్స్‌కు వెళ్లలేదు. వీరిలో 68 మంది పురుషులు కాగా, 52 మంది మహిళలు ఉన్నారు. ఆర్చరీ, ఆర్టిస్టిక్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బ్యాండ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి 18 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొంటున్న ఆటగాళ్లు పసిడి పతకం సాధిస్తే రూ.75 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) తెలిపింది. రజత పతకం సాధించినవారికి రూ.40 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నది. ఇక ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొనే క్రీడాకారులందరికీ లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ఐవోఏ తెలిపింది.