More

    Olympics 2020 : నీరజ్ గోల్డెన్ త్రో..!
    వందేళ్ల కరువుదీర్చిన వీర జవాన్..!!

    భారీ ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్‎ బంగారం కాలేదు. కుస్తీలోనూ పసిడి పట్టు దొరకలేదు. ఊరించిన హాకీ సైతం కాస్యంతోనే సరిపెట్టింది. మొదట్లో మీరాబాయి చాను, ఇటీవల రవి దహియా స్వర్ణానికి అడుగుదూరంలో ఆగిపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. గంటలకు తరిగిపోతున్నాయి. ఈసారికి ఇంతేనేమో..! ఇక స్వర్ణం దక్కదేమో..!! అని ప్రతి భారతీయ క్రీడాభిమాని నిట్టూర్చుతున్న వేళ.. మరో 24 గంటల్లో ఒలింపిక్ మహాసంగ్రామం ముగుస్తుందనగా.. అదుగో అప్పుడొచ్చాడు. బాహుబలి రేంజిలో ఈటె విసిరాడు. అథ్లెటిక్స్‎లో వందేళ్ల కరువుదీర్చాడు. భారత జవాన్ నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో ఫైనల్‎లో ఎట్టకేలకు బంగారు పతకం సాధించాడు.

    జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన.. భారత జవాన్ నీరజ్ చోప్రా.. 87.58 మీటర్ల విసిరి బంగారు పతకాన్ని గెలుపొందాడు. తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు, మూడో ప్రయత్నంలో 76.93 మీటర్లు విసిరాడు. ఇక, నాలుగో ప్రయత్నంలోనూ 80 మీటర్లకు దగ్గరగా జావెలిన్‌ని సంధించాడు. కానీ.. అది ఫౌల్ అయ్యింది. ఐదో ప్రయత్నంలోనూ అలానే జరిగింది. ఇక చివరి ప్రయత్నంలో మాత్రం 84.24 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. పసిడి పతకం దిశగా అడుగులేశాడు. చివరి అటెంప్ట్‌కి రెండు నిమిషాల ముందే నీరజ్ చోప్రాకి స్వర్ణం ఖాయమైపోయింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా.. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున అథ్లెటిక్స్‌లో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

    తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న 23 ఏళ్ల నీరజ్ చోప్రా.. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 86.59 మీటర్లు జావెలిన్ త్రోని విసిరి ఫైనల్‌కి అర్హత సాధించాడు. ఫైనల్లోనూ నీరజ్ చోప్రాకి ఎవరూ సమీపంలో కూడా లేకపోయారు. చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్లు జాకబ్ 86.67మీటర్లతో రజత పతకం దక్కించుకోగా.. ఆ దేశానికే చెందిన వాస్లీ 85.44మీటర్లతో కాంస్యానికి పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా కెరీర్‌లో నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 88.07 మీటర్లు. కాగా, అంతకంటే అరమీటరు తక్కువగా విసిరినా పసిడి పట్టేశాడు. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో జావెలిన్‌ త్రో ఫైనల్లో 88.07 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.07 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచాడు. ఇలా ప్రతిష్టాత్మక ఈవెంట్లన్నింటీలోనూ పసిడి పట్టేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు.

    హర్యానాకు చెందిన నీరజ్‌ చోప్రా పానిపట్‌ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్‌ చిన్న వయసులోనే ఇండియన్‌ ఆర్మీకి సెలక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో.. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. వెయిల్‌లిప్టర్ మీరాబాయి చాను మొదట్లోనే రజత పతకాన్ని గెలుపొందగా.. ఆ తర్వాత స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత ఫురుషుల హాకీ టీమ్ కాంస్య పతకం గెలుపొందగా.. రెజ్లర్ రవి కుమార్ దహియా రజతం గెలుపొందాడు. ఇక బజరంగ్ పునియా కాంస్య పతకం గెలుపొందగా.. నీరజో చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సమయంలో ఆ కరువు తీర్చి.. భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు.

    Related Stories