‘టాగోర్’ ఇంట్లో టీఎంసీ మకాం..! రవీంద్రుడికి ఘోర అవమానం..!!

0
718

తన జన్మభూమి పశ్చిమ బెంగాల్‎లోనే విశ్వకవి రవీంద్రుడికి ఘోర అవమానం జరిగింది. దేశానికి జాతీయ గీతాన్ని అందించిన మహనీయుడిని.. అధికార టీఎంసీ పార్టీ ఘోరంగా అవమానించింది. పశ్చిమ బెంగాల్‎లో అధికార పార్టీ టీఎంసీ కార్యకర్తలు అత్యుత్సాహంతో దారుణ చర్యకు పాల్పడ్డారు. ఏకంగా రవీంద్రనాథ్ టాగోర్ ఇంటినే తమ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తర కోల్‎కతాలో జరిగింది. అది కూడా చారిత్రక కట్టడాల లిస్టులో ఉన్న.. రవీంద్రుడి సొంత ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చేశారు. దీంతో కోల్‎కతా హైకోర్టు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సర్కారును ఆదేశించింది.

కోల్‎కతాలో ‘జొరాసంకో ఠాకూర్‎బరీ’ పేరుతో ఓ మ్యూజియం ఉంది. రవీంద్రనాథ్ టాగోర్ బాల్యంలో నివసించిన ఇళ్లు అది. ఆ మహనీయుడి స్మారకార్థం ప్రభుత్వం ఆ ఇంటిరి మ్యూజియంగా మార్చింది. ఇందులో రవీంద్రనాథ్ టాగోర్ జీవితానికి సంబంధించిన అనేక చారిత్రక ఘట్టాలున్నాయి. అయితే ఈ ఇంటిని తృణమూల్ పార్టీకి చెందిన ‘తృణమూల్ శిక్షాబంధు సమితి’ యూనిట్ కార్యకర్తలు తమ కార్యాలయంగా మార్చుకున్నారు. చారిత్రక కట్టడాలకు ఎలాంటి మార్పులు చేయకూడదు. అంటే, రంగులు వేయడం, రూపురేఖలు మార్చడం వంటివి మార్చే ప్రయత్నం చేయకూడదు. అయితే టీఎంసీ కార్యకర్తలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మ్యూజియం గోడలకు రంగులద్దారు. అంతేకాదు, గోడలకు మేకులు కొట్టి వాటికి తమ పార్టీ అధినేత్రి మమతా ఫోటోలను తగిలించారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేకెత్తించింది. టీఎంసీ పార్టీ నాయకులు స్వాతంత్ర్య సమరయోధుడినే అవమానించారని బీజేపీ ఘాటుగా విమర్శించింది. ఈ భవనానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నదనీ,.. మన జాతీయ గేయం.. వందేమాతరం గేయ రచయిత బకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారిగా ఇక్కడే కలుసుకున్నారని గుర్తు చేశారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్నకట్టడాన్ని పార్టీ ఆఫీసులాగా మారుస్తారా అని దుయ్యబట్టారు.

అయితే ఈ దారుణ చర్యను ‘తృణమూల్ శిక్షాబంధు సమితి’ అధ్యక్షుడు ‘సుబోధ్ దత్తా చౌదరి’ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తమ కార్యకర్తలకు కూర్చోవడానికి చోటే లేకపోవడంతో ఈ కార్యాలయాన్ని వాడుకున్నామన్నారు. దీనికోసం తాము యూనివర్శిటీ నుంచి రాతపూర్వక అనుమతిని సైతం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఈ గదిలో తాము ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదన్నారు. అయితే ఈ వాదనలను యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ‘సవ్యసాచి బసురాయ్ చౌదరి’ ఖండించారు. ఈ ఘటనపై స్పందిస్తూ తాము తృణమూల్ కార్యకర్తలకు ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. తమపై రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని వైస్ ఛాన్సలర్ అన్నారు.

అయితే ఈ భవనానికి మ్యూజియంతో పాటు, గ్రేడ్ 1 హెరిటేజ్ భవనంగా గుర్తింపు ఉండటంతో తాజా ఘటనపై కలకతా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్వదేశ్ మజ్ముదార్ అనే తన పిల్ లో రవీంద్రనాథ్ టాగోర్ బాల్యంలో ఈ భవంతిలోనే గడిపారని,.. అటువంటి భవనాన్ని రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు నాశనం చేస్తున్నారని పిల్ లో పేర్కొన్నారు. ఈ పిల్ ను డివిజనల్ బెంచ్ న్యాయవాది ఆర్ భరద్వాజ్, ఛీఫ్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ విచారించారు. ఇది చారిత్రక కట్టడం కావడంతో దాన్ని కాపాడాల్సిన అవసరముందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. దీంతో రవీంద్రభారతి యూనివర్శిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపుతూ ఈ ఘటనపై చర్యలు తీసుకుని భవంతి చారిత్రక వైభవాన్ని కాపాడాలని తెలిపారు. దీంతో పాటు ఈ చారిత్రక కట్టడంలో ఇప్పటివరకు ఆక్రమణకు గురైన వాటన్నిటినీ పునరుద్దరించాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇక ఈ ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో టీఎంసీ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. అసలు తమ పార్టీలో ‘తృణమూల్ శిక్షాబంధు సమితి’ అనే కమిటీయే లేదని తెలిపింది. దీనిపై తృణమూల్ ఎమ్యెల్యే సంతను సేన్ మాట్లాడుతూ ఈ ఘటనకు తమ పార్టీకి అసలు సంబంధమే లేదన్నారు. ఘటనకు పాల్పడిన వారిని తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fourteen + 4 =