పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సమరం ముగిసినా కూడా…అధికార తృణమూల్ కాంగ్రెస్ కు , రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీకి మధ్య రాజకీయ సమరం ఇంకా కొనసాగుతూనే ఉంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యకర్తలు, వారి ఆస్తులే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన హింసాకాండతో మొదలైన ఈ సమరం.., ఇప్పుడు నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు తెరపైకి రావడంతో తారాస్థాయికి చేరింది.
మమత మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుతోపాటు, మరికొంతమందిని సీబీఐ అధికారులు, ఈ ఉదయం అరెస్టు చేయడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాననే విషయాన్ని సైతం మమత మార్చిపోయారు. గంటల పాటు సీబీఐ కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు తోడుగా అక్కడే ధర్నాలో ఉండిపోయారు. అంతేకాదు తన కేబినెట్ లోని మంత్రులైన ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను అరెస్టు చేయడంపై ఆమె సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా వారి అరెస్టులు జరగలేదని.., తనను సైతం అరెస్టు చేయండి అంటూ నినదించారు.
దీంతో తమ కార్యకలాపాలను సీఎం మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారంటున్నారని ఢిల్లీలోని తమ హెడ్ క్వార్టర్స్ కు కోల్ కత్తా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఫిర్యాదు కూడా చేశారు. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులతోపాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్ కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను అరెస్టు చేసినట్లుగా సీబీఐ ధృవీకరించింది. ఈ అరెస్టులతో కేంద్రం-మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య ఢీ అంటే ఢీ వాతావరణం నెలకొంది.
మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ లో జరిగిన హింసాకాండకు మమతా బెనర్జీయే కారణమని బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టారని.., వారిని హింసాకాండకు ప్రేరేపించారని…వెస్ట్ మిడ్నాపూర్ లోని కోత్వాలీ పోలీస్ స్టేషన్ లో మమతా బెనర్జీపై దిలీప్ ఘోష్ ఫిర్యాదు చేశారు.
బెంగాల్ లో ఎన్నికల అనంతరం తృణమూల్ గుండాల బెదిరింపులకు భయపడి చాలా మంది ప్రజలు అసోంలో ఏర్పాటు చేసిన రెండు శిబిరాల్లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. తృణమూల్ కార్యకర్తలు జరిపిన దాడుల్లో 16 మంది తమ కార్యకర్తలు మరణించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బీజేపీ కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అటు రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ కూడా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించివచ్చారు. అంతకు గవర్నర్ పర్యటనపై మమతా ప్రభుత్వానికి .. రాజ్ భవన్ కు మధ్య లేఖల యుద్ధం కొనసాగింది. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ సూత్రాలను, ప్రొటోకాల్ నియమాలను పాటించడం లేదని మమతా బెనర్జీ ప్రభుత్వం గవర్నర్ పై ఆరోపణలు గుప్పించింది. అయితే తాను రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటున్నానని గవర్నర్ ధనకర్ మమతకు తేల్చిచెప్పారు.
ఇక ప్రస్తుతం తెరపైకి వచ్చిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసు విషయానికి వస్తే.. నారద న్యూస్ పోర్టల్ జర్నలిస్టు మథ్యూ శామ్యూల్ తాను తెహల్కా న్యూస్ పోర్టలో పనిచేస్తున్నప్పుడు.. 2014లో దాదాపు 12 మందికి పైగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన బడా నేతలను స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా కలిశారు. వారి అవినీతి భాగోతాలను రహస్యంగా వీడియోలు తీశారు. అయితే ఈ వీడియోలను మథ్యూ మొదట తెహల్కాకు అందించారు. అయితే వీటిని ఎందుకనోగానీ తెహల్కా బయటపెట్టలేదు. దీంతో మథ్యూ శామ్యూల్ సొంతంగా నారదా న్యూస్ పోర్టల్ ను ప్రారంభించాడు . 2016లో సరిగ్గా బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకువస్తున్న తరుణంలో వీటిని తన న్యూస్ పోర్టల్ ద్వారా తృణమూల్ కాంగ్రెస్ నేతల అవినీతి విశ్వరూపాన్ని బయటపెట్టాడు.
ఇది బెంగాల్ అంతటా సంచలనం సృష్టించింది.అయితే ఆ సమయంలోనే మమతా బెనర్జీ నారదా స్టింగ్ ఆపరేషన్ ను రాజకీయ కుట్రగా కొట్టిపారేశారు. స్టింగ్ ఆపరేషన్ లో చిక్కిన మంత్రులను, నేతలను ఆమె బహిరంగంగానే వెనుకేసుకువచ్చారు. ఇష్యూను తెరమరుగు చేసేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. బెంగాల్ లోకల్ మీడియాతోపాటు నేషనల్ మీడియాలోని ఓ సెక్షన్ ఈ విషయంలో మమతాకు అండగా నిలిచారనే ప్రచారం అప్పట్లో జరిగింది. దీంతో 2016లో జరిగిన ఎన్నికల్లో శారద స్టింగ్ ఆపరేషన్ ను.., టీఎంసీ నేతల అవినీతిని జనం అంతగా పట్టించుకోలేదు. అసలు ఇది ఎన్నికల ప్రచారస్త్రమేకాకుండా మమతా జాగ్రత్తపడ్డారు. మొత్తం 294 సీట్ల గాను మమతా బెనర్జీ పార్టీ 211స్థానాల్లో గెలుచుకుంది. తిరుగులేని మెజారిటీ రావడంతో..ఇక ఈ కేసుకు పూల్ స్టాప్ పెట్టేందుకు మమతా ఎంతగానో ప్రయత్నించారు. రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించి మమ అనిపించేందుకు ప్రయత్నించారు.
అయితే నారదా స్టింగ్ ఆపరేషన్ పై అందులో వెలుగులోకి వచ్చిన విషయాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోల్ కత్తా హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో మమత బెనర్జీ కంగుతిన్నారు. కోల్ కత్తా హైకోర్టు..ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయినా పట్టువిడవని మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును నిలిపివేయించేందుకు ప్రయత్నాలు చేసింది. ఒక దశలో అయితే హైకోర్టు పక్షపాతంతో వ్యవహారించిందనేంత వరకు వెళ్లింది మమతా బెనర్జీ. దీంతో సుప్రీం కోర్టు మందలించడంతో హైకోర్టుకు క్షమాణలు చెప్పి పిటిషన్ ను ఉపసంహరించుకుంది.
ప్రస్తుతం ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నవారిలో ఫిర్హాద్ హకీమ్, కాకోలి ఘోష్ దస్తిదారు, సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, హెచ్ఎంఎస్ మీర్జా, సౌగత్ రాయ్, ముకుల్ రాయ్, సుబేందు అధికారి, సుబ్రతా ముఖర్జీ, సోవన్ ఛటర్జీ, ప్రసూన్ సేన్ బెనర్జీ ఉన్నారు. ముకుల్ రాయ్, సబేందు అధికారి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి అనేది పెద్ద నేరమేమి కాదని, జనం సైతం అవినీతిని పట్టించుకోవడం లేదని మమతా బెనర్జీ ప్రభుత్వం తన చర్యలతో వెనుకోసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. అందుకేనేమో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై ఆమె ఇంత వరకు చర్యలు తీసుకున్నది లేదు. పైగా వారికి తిరిగి మంత్రిపదవులను సైతం కట్టబెట్టి మమతానురాగాలు కురిపించింది.
విచిత్రం ఏమిటంటే…మమతా ఏలుబడిలో జరిగిన శారద చిట్ ఫండ్ కుంభోణంపై గానీ, నారద స్టింగ్ ఆపరేషన్ పై కానీ అటు నేషలన్ మీడియా కానీ, ఇటు మన తెలుగు మీడియా కానీ చేయాల్సినంతగా హైలేట్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే లెఫ్ట్, లిబరల్ లుటియెన్స్ జర్నలిస్టులపై మమతానురాగాలున్నాయనే టాక్ ఉంది.! అందుకే నేమో.. మతం ఓడింది మమతా గెలిచిందనే హెడ్డింగులు పెట్టారనుకుంట! కానీ మమతా గెలుస్తుంది… కేవలం మతం ఓట్లతోననే సత్యాన్ని మాత్రం ఈ లుటియెన్స్ మీడియా జర్నలిస్టులు చెప్పరు. తృణమూల్ జరుపుతున్న హింసాకాండపై నోరు మెదపరు.! ఇదే హింసాకాండా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగివుంటే ఈపాటికి సీన్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.! బ్రేకింగ్ న్యూసులు. , స్పెషల్ స్టోరీలు, గ్రౌండ్ జీరో కవరేజీలు, అంతర్జాతీయ మీడియాలో వ్యాసాలు., భారత్ లో ఇన్ టాలరెన్స్ పెరిగిపోయిందని.. మోదీ గద్దె దిగాలంటూ హ్యాష్ ట్యాగులు కనిపించేవి. సో దేశ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. జాతీయవాద జర్నలిజానికి మద్దతును ఇవ్వండి!