కార్పొరేట్ కంపెనీలను మించిన టీటీడీ..! శ్రీవారి ఆస్తి ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

0
829

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని సాధారణ రోజుల్లో దర్శించుకునే భక్తుల సంఖ్యే లక్షల్లో వుంటే.. ఇక పర్వదినాలు, పవిత్ర మాసాలు, ఉత్సవాలు, వేడుకలు, వాహన సేవల సమయాల్లో..ఆ భక్తజనవరద ఎంతలా పొంగుతుంది. ఆధ్యాత్మిక పరిమళాలు ఎంతలా వెదజల్లబడతాయి..అంటే..అనంతం అని తప్ప మరో సమాధానం రాదు.

తిరుమలలో స్వామివారికి జరిగే పుష్పార్చనలో.. దాదాపు దేశంలో విరబూసిన పరిమళ పుష్పాలన్నీ వినియోగిస్తారు. పుణ్యస్నాల విషయానికొస్తే.. తిరుమలలో వున్న తీర్థాలు ఎక్కడైనా వుంటాయా అనిపిస్తుంది. ఎన్నోతీర్థాలు కాలగర్బంలో కలిసిపోయాక సైతం..కలియుగ వైకుంఠంలో నెలకొని వున్న తీర్థాలు ఎక్కడా లేవు అనే మాటలో అతిశయోక్తి ఏమి లేదు. ప్రసాదం.. అంటే భగవంతుని అనుగ్రహం. దైవ ప్రసాదం కోసం భక్తులు ఎప్పుడూ తహతహలాడతారు. తిరుమలలో తయారు చేసినన్ని ప్రసాదాలు ఎక్కడ ఉండవు అనే విషయం అందరికీ తెలిసిందే.

తిరుపతి లడ్డు ప్రసాదం..పేరు వింటేనే ఎంతో భక్తి భావం కలిగినప్పుడు..ఆ రుచికర లడ్డు ప్రసాదాన్ని తింటే..ఇక భవసాగరం అనే మాటకు తావు వుంటుందా. స్వామివారికి వాహన సేవలు నిర్వహించడంలోనూ.. తిరుమల ఫస్ట్ ప్లేస్ లోనే వుంటుంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతుంటే..అసలు అది భూలోకం అని ఎవరైనా భావిస్తారా..! ఇసుకేస్తే రాలని అసంఖ్యాక భక్తజనుల మధ్య..గరుఢారూఢుడైన సాగే స్వామివారి గరుడ వాహన సేవను చూసి, తిరుమలను…వైకుంఠమనే భావనకు భక్తులు వచ్చేస్తారు. గోదామాత సమర్పించిన పవిత్ర మాల, సహస్ర నామ మాల, లక్ష్మీహారం, మరెన్నో సువర్ణ, రజిత ఆభరణాలకు తోడు..లెక్కకట్టలేనంత సొమ్ముతో తయారుచేసిన ప్రత్యక సువర్ణ కంఠాహారాన్ని స్వామివారికి ప్రత్యేకంగా గరుడ వాహన సేవనాడే వేస్తారు. గరుడ వాహనం పై విహరిస్తున్న స్వామిని సేవించిన వారికి సకలాభీష్ట సిద్ధితో పాటు జ్ఞాన, వైరాగ్యాలు సమకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఒకపిలుపులో పిలికితే పలుకుతావట…ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి, నా పెన్నిధి..ఇది గాయక శిఖామణి, స్వామివారి మహా భక్తురాలు శ్రీరంగం గోపాల రత్నం గానం చేసిన మహోన్నత చిత్రగీతం. కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేర వచ్చిన భక్తులను నీ అండ చేర్చి కాపాడమని గానంలో వుంటుంది. అంతటి అభయమూర్తి, అభయహస్త దీవెనలు అందుకోవాని భక్తజనావళి ఎప్పుడూ ఉవ్విళూరుతూ వుంటుంది. వడ్డీకాసుల వాడిగా పేరొందిన శ్రీనివాసుడి ఆలయ సంపద..ఇంత అని చెప్పడం ఎవరి తరం. భక్తులు సువర్ణ, రజిత తదితర వస్తురూపంలో ఇచ్చే కానుకలు, ద్రవ్యరూపంలో అందజేసే సంపద, విరాళాలుగా వచ్చే ఆదాయం..ఓహ్..ఒకటేమిటి..ఇలా అన్నిరీతుల్లో స్వామివారి ఆలయానికి, టీటీడీ దేవస్థానానికి అపరిమిత సంపద లభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరొందిన తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి వారి ఆలయంతో సమానమైన స్థాయిలో వున్న ఏకైక హైందవ దేవాలయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం.

ప్రతి నిత్యం కనీసం లక్షమంది భక్తులు, యాత్రికులు ఈ పవిత్ర దేవళాన్ని సందర్శిస్తారు. ఏడాదికి సగటున 30 నుంచి 40 మిలియన్ల యాత్రికులు ఇక్కడకు విచ్చేస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో, పండువలు, పర్వదినాల సమయంలో….దాదాపు అయిదు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శంచుకుంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధికసంఖ్యలో భక్తులు దర్శించే ఆలయంగా తిరుమల శ్రీవారి ఆలయానికి పేరుంది.

ఐటీ దిగ్గజ సంస్థలు విప్రో, అల్ట్రాటెక్, నెస్టల్ ఇండియా కంటే…తిరుమల ఆలయ సంరక్షకులు అత్యంత ధనవంతులు అని రూఢీ అయ్యింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయ నికర విలువ 30 బిలియన్లు అంటే దాదాపు 2 లక్షల 50 వేల కోట్ల రూపాయలు అని ప్రకటించారు. ఇది విప్రో, అల్ట్రాటెక్, ఇండియా ఈటీ సహా భారత దేశంలోని అనేక బ్లూ చిప్ కంపెనీల విలువ కంటే ఎక్కువ అని తేలింది. బెంగళూరుకు చెందిన విప్రో 2 లక్షల 14 వేల కోట్ల రూపాయలు, అల్ట్రాటెక్ లక్షా 99 వేల కోట్ల రూపాయలు కాగా, ఎఫ్‌ఎంసిజి బ్రాండ్ నెస్లే ఇండియా విలువ లక్షా 96 వేల కోట్ల రూపాయలు. ONGC,ఇండియన్ ఆయిల్ తదితర ప్రభుత్వ యాజమాన్య ఆయిల్ సంస్థలు, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి ఆటోమోటివ్ మేజర్‌లు సైతం టీటీడీ కంటే తక్కువ విలువనే కలిగి ఉన్నాయి.

టీటీడీ ఆస్తులను గమనిస్తే.. బ్యాంకుల్లో 10.25 టన్నుల బంగారు డిపాజిట్లు వున్నాయి. 2.5 టన్నుల బంగారు ఆభరణాలతో పాటు 16,000 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు వున్నాయి. దేశవ్యాప్తంగా మరెన్నో టీటీడీ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా వున్నాయి. TCS, రిలయన్స్ వంటి వాటితో సహా కేవలం రెండు డజన్ల కంపెనీలు మాత్రమే టీటీడీ స్థాయితోటి పోటీపడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరగడం, అధిక శాతం మంది భక్తులు ఆలయానికి భూరి విరాళాలు ఇస్తూండడంతో.. టిటిడి విలువ మరింత పెరిగే అవకాశం వుంది.

ఫిబ్రవరిలో సమర్పించిన 2022-23 సంవత్సరానికి 3,100 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌లో, బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల ద్వారా వడ్డీ రూపంలో 668 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని టిటిడి అంచనా వేసింది. అలాగే తిరుమల కొండ ఆలయ హుండీలో సుమారు 2.5 కోట్ల మంది భక్తులు సమర్పించే నగదు, కానుకలు కలిసి1000 కోట్ల రూపాయల ఆదాయంగా అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

9 − four =