More

  తిరుపతి – సెంటర్ ఆఫ్ గ్రావిటీ

  సెంటర్ ఆఫ్ గ్రావిటీ-గురుత్వాకర్షణ సూత్రం భౌతిక శాస్త్రంలోనే కాదు, రాజకీయ రణక్షేత్రంలోనూ ఉంటుంది. ఆధునిక యుద్ధ విద్యల్లోనూ దర్శనమిస్తుంటుంది. ఏపీ రాజకీయాల్లో తిరుపతి ఉప ఎన్నిక-సెంటర్ ఆఫ్ గ్రావిటీగా మారింది. గెలుపెవరిది అన్న చర్చ కంటే రెండో స్థానం ఎవరిది అన్న చర్చ కాస్త ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీలో రెండో స్థానమే ఏపీ రాజకీయాలను మార్చే కీలక అంశంగా చూస్తున్నారు పరిశీలకులు.

  తిరుపతి ఉప ఎన్నికపై వైసీపీ-టీడీపీల అంతర్గత వ్యూహాలేంటి? రెండో స్థానంలో టీడీపీ వస్తే మేలని వైసీపీ భావిస్తోందా? బీజేపీ రెండో స్థానంలోకి వస్తే రాబోయే రోజుల్లో వైసీపీకి పొంచి ఉన్న ముప్పేంటి? వైసీపీ గెలిచినా ఫరవాలేదు, తామకు రెండో స్థానం వస్తే చాలని చంద్రబాబు భావిస్తున్నారా? రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి బీజేపీ నిలువరించే రాజకీయ క్రీడా ప్రాంగణంగా తిరుపతిని చూడాలా? ఇంతకూ తిరుపతి ఫలితం ఎలా ఉండబోతోంది? తుది ఫలితం అంచనా వేయడం సాధ్యమా, అసాధ్యమా? ఇలాంటి ఆసక్తికర అంశాలను లాజికల్ గా చర్చిద్దాం…

  ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తన మొత్తం శక్తి, సామర్థ్యాలను తిరుపతిలోనే కేంద్రీకరించింది. భారీ ఎత్తున శ్రేణులను మోహరించింది. గెలుపు… నల్లేరుమీద నడక అనే అధికార పార్టీకి ఈ స్థాయి అసాధారణ కేంద్రీకరణ దేనికీ అనే సందేహం రావడం సహజం. పైగా ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా తిరుపతి ఉప ఎన్నికల్లో తాము ఓడిపోతే 22 మంది వైసీపీ లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తారంటూ సవాలు విసిరారు.

  నిజానికి రాజకీయ పరిణతి ఉన్న నేత విసిరే సవాలు కాదు ఇది. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు వారివే! పైగా ఇటీవలే జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల్లో ఆ ఏడు నియోజక వర్గాల పరిధిలో వారే విజయం సాధించారు. తిరుపతి కార్పోరేషన్ వారి చేతిలోనే ఉంది. దానికి తోడు అంగబలం, అర్థం బలమూ ఉన్నాయి. ఇంతా ఉండగా బెంగ దేనికి? 22 ఎంపీ స్థానాలను ఫణంగా పెట్డడం ఎందుకు? ఇక్కడే ఉంది అసలు కిటుకు!

  వైసీపీ బెంగ గెలుపు గురించి కాదు. convenient enemy పారిపోయి steel tempered enemy గ్రౌండ్ అవుతాడా అనే భయమే వైసీపీ భారీ మోహరింపు వెనుక ఉన్న అసలు కారణం. విమర్శలకు మిడిసిపడి సవాళ్లు విసరడం వెనుక ఆంతర్యం బీజేపీ ఎక్కడ రెండో స్థానంలోకి వస్తుందో అనే… సంశయ భారమే!!

  convenient enemy అంటే అనుకూల ప్రత్యర్థి మైదానం నుంచి నిష్క్రమించి steel tempered enemy-కాకలు తీరిన యోధుడు ప్రత్యక్షమైతే పరిస్థితి ఏంటి అన్నదే వైసీపీని వేధిస్తున్న సంకట స్థితి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ-వైసీపీకి అనేక విజయాలు సాధించిపెట్టిన అనుకూల రాజకీయ వైరి పక్షం. చంద్రబాబు బలంగా ఉన్నంత కాలం వైసీపీకి విమర్శించేందుకు మైదానంలో ఓ అనుకూల శతృవు ఉంటాడు. ఒక రకంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది టీడీపీ వైఖరి అంటారు సీనియర్ రాజకీయవేత్తలు.

  వైసీపీ చంద్రబాబుపై చేసే విమర్శలు జనరంజకంగా ఉంటాయి. చంద్రబాబునాయుడుపై విమర్శలు చేసేందుకు వైసీపీ ఓ నాటక ప్రయోక్తల బృందాన్నే నియమించింది. సదరు బృందం ప్రతిరోజూ సాధారణ జనానికి సైతం అంతుబట్టని బూతుపురాణంతో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఈ ప్రహసనం నడుస్తున్నంత కాలం వైసీపీ ప్రాబల్యం కొనసాగుతుంది. అదే వైసీపీ ధీమా.

  తిరుపతి ఉప ఎన్నికల్లో తాము గెలవటం మాత్రమే కాదు, టీడీపీ రెండో స్థానంలో ఉండాలని కూడా వైసీపీ లోలోపల బలంగా కోరుకుంటోంది. అనుకూల శతృవు అందుబాటులో ఉండటమే విజయానికి సోపానమని వైసీపీ భావిస్తోంది.

  అలా కాకుండా దేశమంతటా విస్తరించిన, కేంద్రంలో అధికారంలో ఉన్న కాకలు తీరిన యోధుడిలాంటి బీజేపీ రెండో స్థానంలోకి వస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటీ అన్న భయం వైసీపీని వేధిస్తోంది. ఈ భయం వైసీపీకి మాత్రమే పరిమితం కాలేదు. టీడీపీని కూడా వేటాడుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో తమ పార్టీ గెలవదని చంద్రబాబు నాయుడుకు తెలుసు. అయితే తాము ఓడినా రెండో స్థానం దక్కితే చాలని టీడీపీ భావిస్తోంది. పొరపాటున బీజేపీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే బిచాణా ఎత్తేయాలనే భీతి బాబుగారి ముఖారవిందంలో కనిపిస్తూనే ఉంది.

  తెలంగాణలో బలహీన శతృవు కాంగ్రెస్ పార్టీని  బలి ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ ముందు వికసిత కమలం ప్రత్యక్షమైంది. దీంతో బోధి వృక్షం దొరక్క కేసీఆర్ పడిన అవస్థలే..చంద్రబాబు  ఙ్ఞానోదయానికి కారణం.

  వైసీపీ స్థానిక ఎన్నికల్లో గెలిచినా, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విజయం సాధించినా… రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోల్స్ లో భారీ విజయం నమోదు చేసినా చంద్రబాబునాయుడుకు అంతగా బెంగ ఉండదు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాకపోయినా మరో  ఎన్నికలో అయినా వ్యవస్థలను సముదాయించి, వైసీపీకి న్యాయపరమైన చిక్కులు కల్పించి… అధికారం చేపట్టవచ్చన్నది టీడీపీ ధీమా. అలా కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే పుట్టగతులుండవన్నది చంద్రబాబు విజన్-20-30. పదేళ్లు పోరాడితే పక్కా విజయం అన్నది ఆయన విశ్వాసం. 

  మొత్తంగా రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక బలమైన జాతీయ పార్టీని నిలువరించేందుకు సిద్ధం చేసుకున్న వేదిక- తిరుపతి ఉప ఎన్నిక. తిరుపతి ఉప ఎన్నిక కేవలం గెలుపోటముల చర్చకు పరిమితం కాలేదు. అంతకు మించి…బహుదూరపు ఏపీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే గరినాభిగా మారింది.

  త్రిముఖ పోరులో వైసీపీ-టీడీపీలకు మరో తలనొప్పి….బీజేపీకి జనసేన మద్దతు తెలపడం. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్-సామాజిక విషయాల్లో, ప్రజా సమస్యల్లో ఆయన జోక్యం ఓటింగ్ సరళిపై ప్రభావం చూపిస్తే పరిస్థితి ఎంటన్నదే అసలు సమస్య.

  నువ్వూ నేనూ పక్కపక్కనే ఉందాం. వాణ్ని మాత్రం రానివ్వద్దూ అన్నది వైసీపీ-టీడీపీ వైఖరిగా కనిపిస్తోంది. ఈ నిర్ధారణకు రావడానికి కారణమేంటి? అంటే గెలిచే వైసీపీకి అంత గగుర్పాటు దేనికి? అదేదో దేశ రాజకీయాలను శాసించే ఎన్నికగా చిత్రంచడం ఎందుకు అన్న శంక.

  ఈ ఉప ఎన్నిక‌లో తెలుగుదేశం ఓటు బ్యాంకుకు భారీగా క‌న్నం ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ప్రీ పోల్ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎంత బ‌లం పెరిగినా, అదంతా తెలుగుదేశం పార్టీకి బ‌ల‌హీన‌త‌గా మారే అవ‌కాశాలున్నాయి.

   గత ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోయినా తాజా ఎన్నికల చిత్రం గతంలో ఉన్నట్టు లేదు. కేంద్రంలో వ‌రుస‌గా రెండో సారి అధికారంలోకి రావ‌డంతో బీజేపీ కాన్ఫిడెంట్ లెవ‌ల్స్ చాలా పెరిగాయి. ఆ పై జ‌న‌సేన మద్దతు బీజేపీకి ప్ల‌స్ పాయింట్ గా మారింది. 

  తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బ‌లిజ‌ల ఓట్లు గ‌ణ‌నీయంగా ఉండ‌టంతో.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రభావం కారణంగా బీజేపీకి బ‌దిలీ అయ్యే ప‌రిస్థితి కొంత వ‌ర‌కూ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌మ‌లం పార్టీ పెద్ద సంఖ్యలోనే ఓట్ల‌ను సాధించ‌వ‌చ్చ‌నే అంచ‌నాలు వెలువడుతున్నాయి.

  1952లో ఈ ఎంపీ సీటుకు తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి రెండు సార్లు అంటే 1952, 1957 ఎన్నికల్లో మాఢభూషి అనంతశయనం అయ్యంగార్ కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీ.దాస్, ఆ తర్వాత రెండు సార్లు 1971, 1977లలో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి టీ. బాలకృష్ణయ్య, 1980లో కాంగ్రెస్ నుంచి పసల పెంచలయ్య విజయం సాధించారు. 1984లో చింత్రామోహన్ టీడీపీ నుంచి గెలిచారు.

  తర్వాత కాంగ్రెస్ లో చేరిన చింతా మోహన్ 1989, 1991లలో కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996 కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీగా గెలిచారు. 1998లో తిరిగి టీడీపీలో చేరిన చింతామోహన్ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  1999లో తిరుపతి సీటు బీజేపీకి దక్కింది. టీడీపీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ అభ్యర్థి నందిపాక వెంకటస్వామి విజయం సాధించారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ తిరుపతి ఎంపీగా గెలుపొందారు. 2014లో వెలగపల్లి వరప్రసాద రావు, 2019లో బల్లి దుర్గాప్రసాద్ రావు వైసీపీ తరపున గెలుపొందారు.

  తిరుపతి పార్లమెంట్ స్థానంలో తొలి నుంచి టీడీపీయేతర పార్టీలకే మొగ్గు కనిపిస్తోంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒక్కసారి 1984లో టీడీపీ తరపున చింతామోహన్ విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.

  కానీ, తొలిసారిగా 1999లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి విజయం దక్కింది. 2004, 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ గెలిచారు. తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రయత్నం చేస్తూ పలువురు అభ్యర్థులను మారుస్తూ రంగంలో దిగినా పట్టు సాధించలేకపోయింది.

  మొత్తంగా టీడీపీ ఎన్నికల గ్రాఫ్ చూస్తే…ఫలితాన్ని అంచనా వేయడం కష్టం. తిరుపతి ఓటర్లు ఎప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గుతారో చెప్పడం అసాధ్యం. కేవలం తిరుపతి అనే కాదు, ఎక్కడైనా పోలింగ్ తర్వాత వచ్చే అంచనాలకూ, ప్రీపోల్ అంచనాలకు సంబంధం ఉండదు.

  ఇక చాలా మంది విశ్లేషకులు గత లోక్ సభ ఎన్నికల ఫలితాల గణాంకాలను ఉదహరిస్తున్నారు. ఎన్నికల రాజకీయాల్లో రెండు ఎన్నికలను పోల్చి ఫలితాన్ని బేరీజు వేయడమంత అఙ్ఞానం మరొకటి ఉండదు. ఏ గత ఎన్నికా రాబోయే ఎన్నిక ఫలితాన్ని నిర్ణయించదు. పైగా రెండు ఎన్నికల ఫలితాల మధ్య వ్యత్యాసం భూమ్యాకాశాలంత ఉంటుంది.

  భారతదేశ ఎన్నికల చరిత్రను నిశితంగా గమనించిన వారికిది తెలుస్తుంది. గత ఎన్నికలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవచ్చు. డిపాజిట్ కోల్పోయిన వాడు విజయం సాధించవచ్చు.

  అందాకా ఎందుకు గత ఎన్నికల్లో వైసీపీ అంతటి భారీ విజయాన్ని నమోదు చేస్తుందనీ, టీడీపీ అత్యంత దారుణ పరాభవం పాలవుతుందని ఎవరైనా ఊహించారా? నలభై ఏళ్ల పార్టీ, కేడర్ తో పాటు సీనియర్ నేతలతో పాటు అర్థబలం బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉన్న టీడీపీ పట్టుమని పదేళ్లు నిండని పార్టీ ముందు అభాసు పాలవుతుందని ఎవరైనా జోస్యం చెప్పారా?

  ఎన్నిక ఊహకు అందని మాయాజాలం. దీర్ఘకాలంలో రూపొందిన ఓటర్ల అభిప్రాయాలు అనేక తక్షణ కారణాల వల్ల మారిపోవచ్చు. ఆగంతుకంగా వచ్చే ఉద్వేగపూరిత పరిణామాలు ఓటింగ్ సరళిని మార్చివేసిన సందర్భాలు అనేకం ఉన్నాయంటారు భారత ఎన్నికల సరళిపై సాధికారికమైన పుస్తకం రాసిన మిలన్ వైష్ణవ్. ‘‘costs of democracy’’ పేరుతో ఆయన పుస్తకంలో అనేక ఆసక్తికరమైన ఎన్నికల ఫలితాలనూ, ఎన్నికల ఖర్చు పెట్టుబడిగా మారిన పరిణామాన్ని విశ్లేషించారు.

  లెక్కకు మించిన డబ్బు ఖర్చు చేసీ.. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థులూ, యాధాలాపంగానో, తప్పని స్థితిలోనో పోటీచేసి గెలిచినారూ, తమ గెలుపు ఎలా సాధ్యమైందో తెలియక గింజుకునేవారి సంఖ్య గణనీయంగానే ఉందంటారు మిలన్ వైష్ణవ్.

  చదవకుండానే పరీక్ష పాసైన విద్యార్థి పొందే చిత్రమైన ఆశ్చర్యం.. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులకు తారసపడిన దాఖలాలున్నాయంటారు. గెలిచేందుకు డబ్బు పంచేవారి సంఖ్యతో పాటు ఎన్నికల ఖర్చు- అమెరికా ఎన్నికలను మించి పెరిగినా సరే…డబ్బు మాత్రమే ఫలితాన్ని నిర్ణయించదని తేల్చేశారు మిలన్ వైష్ణవ్.

  బరిలో ఉన్న ఇద్దరో ముగ్గురో బలమైన అభ్యర్థలు ఒకరిని మించి ఒకరు ఖర్చు చేసినా విజయం కేవలం  ఒకరినే వరిస్తుంది. అటువంటి సందర్భంలో డబ్బు గెలిపించింది అనే వాదన ఓడిపోతుందంటారు.

  దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ డబ్బూ-మద్యం లేదా దబాయింపు-దౌర్జన్యంతో అధికారాన్ని చెలాయిస్తున్నాయి. 1999 తర్వాత ప్రాంతీయ పార్టీలకు వచ్చే ఓటింగ్ శాతం క్రమంగా తగ్గిపోతున్నది. మసకబారిన తమ ప్రాముఖ్యతను తిరిగి పెంచుకోవడానికి జాతీయస్థాయి విధాన నిర్ణయాలను విమర్శించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి.

  ఏపీలో బీజేపీ రెండో స్థానంలోకి వస్తే వైసీపీ బరిగీసి నిలబడలేదు. చంద్రబాబును విమర్శించినట్టూ విమర్శించలేదు. అట్లాగని సఖ్యత ప్రదర్శించలేదు. ఈ స్థితిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీ ప్రాబల్యం పెరిగితే…తన రాజకీయ భవిషత్తు ప్రమాదంలో పడుతుందనే భయం చంద్రబాబునాయుడిని వెంటాడుతోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నిక కేవలం ఒకానొక సాధారణ బైపోల్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చివేసేందుకు సిద్ధమైన వేదికగా చూడాలి.

  Related Stories