More

    తిరుపతి ఉపఎన్నికల తర్వాత జైలుకెల్లేది ఎవరు? వైసీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు

    తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ, ఇటు బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నామినేషన్ల పర్వమప్పుడే రెండు పార్టీల మధ్య పరిస్థితి ఇలా ఉంటే.., ఇక అసలు ప్రచారమప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని విశ్లేషణలు మొదలయ్యాయి. ఒక వేళా అధికార వైసీపీ గెలిచినా…, నంబర్ టు పోజిషన్ లో ఎవరు ఉంటారు? బీజేపీ ఉంటుందా? లేక టీడీపీ ఉంటుందా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

    ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ ర్యాలీతో నెల్లూరు కలెక్టరేట్ లో తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణస్వామి, ఆదిమూలపు సరేశ్, గౌతం రెడ్డి, అనిల్ కుమార్ , తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోపాటు ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు.

    ఇటు బీజేపీ జనసేన పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట బీజేపీ నేతలు సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహరావు, ఆదినారాయణ రెడ్డితోపాటు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.  ఇక తెలుగు దేశం పార్టీ తరపున పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరపున చింతామోహన్ ఇప్పటికే తన నామినేషన్లు దాఖలు చేశారు.

    తాను ఐపీఎస్ అధికారిగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేశానని బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ తెలిపారు. ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం వినిపిస్తానని… కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఇతర పార్టీల వారు గెలిచినా ఏ ప్రయోజనం ఉండదని వారు తమ గళం వినిపించలేరని ఆమె అన్నారు.

    అయితే ఇలా వైసీపీ, బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం ముగిసిందో లేదో.., వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్విటర్ వేదికగా మాటల తూటాలు పేలాయి. మొదట వైసీపీ నేత విజయసాయి రెడ్డి బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ మాత్రం తగ్గకుండా అంతే స్థాయిలో దీటుగా కౌంటర్ ఇచ్చారు.

    బీజేపీ డ్రామలను చూసి జనం నవ్వుకుంటున్నారని విజయసాయి ట్విట్ చేయగా, దీనికి స్పందించిన సోము వీర్రాజు తాము రాష్ట్రానికి ఏం ఇచ్చామో చెప్పి ఎన్నికల్లో గెలుస్తామన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన తర్వాత విజయసాయికి క్యాబేజీ పూలు పంపిస్తామని.., బెయిల్ రద్దవగానే జైలులో కూరకు అవి పనికొస్తాయని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

    Trending Stories

    Related Stories