More

    తిరుమలకు వెళ్తున్నారా.. ఈ సూచనలు గుర్తు పెట్టుకోండి

    తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్తున్నారా..? ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది. ఇకపై కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికే దర్శనం కల్పించనున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ కానీ, దర్శనానికి మూడు రోజులు ముందు చేయించుకున్న కరోనా పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ కానీ ఉంటేనే దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల టోకెన్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా వారికి మాత్రమే రోజుకు 2 వేల టోకెన్లు జారీ చేస్తుండగా, వీటిని 8 వేలకు పెంచాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా ఇస్తున్న టోకెన్లను నిలిపివేయనున్నారు.

    ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి షాక్

    టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసింది. పాలకమండలి నియామకంపైనా హైకోర్టు విమర్శలు చేసింది. నిబంధనలకు విరుద్దంగా టీటీడీ బోర్డు సభ్యుల్ని నియమించారని.. దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని టీటీడీ స్వతంత్రతను దెబ్బ తీసేలా జీవోలు ఉన్నాయని కోర్టులో పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు జరిగాయని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు జీవోను నిలుపుదల చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం ఏపీ దేవదాయ చట్టం సెక్షన్‌ 96కు అనుగుణంగా లేదని తెలిపింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలకు సెక్షన్‌ 96 వీలు కల్పించడం లేదంది. దీనిపై క్షుణ్నంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని, వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 20కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

    Related Stories