తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్టణం వెళ్లిన ఆయన వేకువజామున గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు. 1978 నుంచి శ్రీవారి సేవలోనే ఉన్న శేషాద్రి 2007లోనే రిటైరయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆయనను తిరిగి ఓస్డీగా నియమించింది.

ఆయన సన్నిహితులు మాట్లాడుతూ ‘సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాం.. అక్కడికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని’ వివరించారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవల కోసం ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగింది. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమల ఆలయంలో శ్రీవారి బంగారు రూపులు(డాలర్లు) అమ్మేవారు. ఆ విక్రయ విభాగం ఆయన ఆధ్వర్యంలో నడిచేది. కాబట్టే ఆయనకు డాలర్ శేషాద్రి అనే పేరొచ్చింది. మరణించే చివరి క్షణం వరకు స్వామి సేవలో తరించారు డాలర్ శేషాద్రి అని పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు.
