NH Opinion

టిప్పు సుల్తాన్.. సెక్యులర్ ది గ్రేట్ కాదా..?

మన దేశంలో చరిత్ర అంతా…తప్పుల తడకేనని చాలా మంది అంటారు..! మన దేశ చరిత్ర…పాఠ్యపుస్తకాల్లో అసలైన జాతీయ హీరోలను ఇప్పటికీ విలన్ లుగా చూపెడుతున్నారని చాలా మంది జాతీయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నో దురాగాతలకు పాల్పడిన సుల్తాన్లను మాత్రం వీరులుగా, ది గ్రేట్ అంటూ మన పిల్లలకు బోధిస్తున్నారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ చరిత్ర కూడా అదే కోవలోకి వస్తుంది. తాను రాజ్యంలోకి వచ్చిన రోజు నుంచే హిందువులను ముస్లింలుగా మార్చేందుకు సిద్ధం కావాలని అజ్ఞనాలు జారీ చేసినా టిప్పును కొంతమంది కుహనా మేధావులు అయితే టిప్పు సెక్యులర్ ది గ్రేట్ గా ప్రచారం చేస్తున్నారు.

భారత దేశ చరిత్రలో అత్యంత క్రూరుడైన చక్రవర్తిగా పేరుబడినవాడు ఔరంగజేబు..! హిందువులను ఎన్నో అత్యాచారాలకు గురిచేశాడు. హిందువుల ఆచారాలపై వారి ఆరాధాన స్థలాలు, పవిత్ర దేవాలయాలను సైతం విధ్వంసం చేశాడు. అంతేకాదు దేశంలోని కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే…కాశీ విశ్వనాథ ఆలయం, మధురలోని శ్రీకృష్ణుడి జన్మస్థానంలోని దేవాలయాన్ని ఈ దుర్మార్గుడే ధ్వంసం చేయించాడు. అంతేకాదు పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రమైన ప్రయాగరాజ్ లోని వేలాది సంవత్సరాల నుంచి హిందువులు ఆరాధిస్తూ వస్తున్న ఒక వృక్షాన్ని సైతం వేళ్లతో సహపెకిలించివేశాడు.

1707లో ఔరంగజేబు మరణం తర్వాత…, ఆ బాధ్యతను దక్షిణ భారతంలో టిప్పు సుల్తాన్ తీసుకున్నాడా…అన్నట్లుగా హిందూ దేవాలయాలపైనా అతని విధ్వంసకాండ కొనసాగింది. ఔరంగజేబు తన 50 ఏళ్ల పాలనలో హిందువులను తీవ్ర అణిచివేతలకు గురిచేశాడు. ఇక టిప్పు సుల్తాన్ అయితే ఈ విషయంలో ఔరంగజేబును సైతం మించిపోయాడు. టిప్పు సుల్తాన్ పాలించింది 17 సంవత్సరాలే అయినా.., అతడు హిందువులపై చేసిన దురాగతాలు మాత్రం ఔరంగజేబుకు ఏమాత్రం తీసిపోవు. హిందువుల సంప్రదాయాలపైనా, పుణ్యక్షేత్రాలపైనా, హిందూ స్త్రీలపైనా అతడి దురాగతాలు కొనసాగాయి.

లూయిస్ రైస్ అనే బ్రిటీష్ చరిత్రకారుడైతే…టిప్పు సుల్తాన్ చనిపోయేనాటికి అతని మైసూర్ రాజ్యంలో కేవలం రెండు హిందూ దేవాలయాలు మాత్రమే మిగిలాయని…, తన హిస్టరీ ఆఫ్ మైసూర్ అండ్ కూర్గ్ లో రాశాడు. అవి కూడా మైసూరు దగ్గరలోని శ్రీరంగపట్టణం కోటలోనివి. టిప్పు సుల్తాన్ ముస్లిం అయినా జాతకలపై మాత్రం బాగా నమ్మకం ఉండేది. తన జాతకాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి తన మంచిచెడులు చెప్పే జోతిష్యుల సంతృప్తి కోసమే ఈ రెండు దేవాలయాలను మిగిలించాడని అంటారు. తాను ధ్వంసం చేసిన మిగతా హిందూ దేవాలయాల ఆస్తులన్నింటిని 1790కి ముందే స్వాధీనం చేసుకున్నాడు.

బ్రిటీష్ వారి కాలంలో మలబార్ కు కలెక్టర్ గా పనిచేసిన విలియం లోగాన్ అనే అతను మలబారులో టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాలను మసీదులుగా మార్చిన వైనాన్ని మలబారు మాన్యువల్ లో పేర్కొన్నారు. అంతేకాదు లూయిస్ బి. బౌరీ అనే
చరిత్రకారుడు అయితే…తన మలబారు దండయాత్రలో టిప్పు సుల్తాన్ ఆడవారిని, పసిపిల్లల్ని కూడా వదలకుండా చిత్రవధ చేశాడని పేర్కొన్నాడు.

అలాగే టిప్పు సుల్తాన్ పన్నుల పేరుతో హిందువులను ఏ విధంగా దోచుకున్నది ఎం.హెచ్. గోపాల్ అనే చరిత్రకారుడు టిప్పు సుల్తాన్స్ మైసూర్ ఎన్ ఎకనామిక్ హిస్టరీలో తెలిపాడు. ఇంటి పన్నులు, పంటలు, ఇంకా ఇతర వాడుక పన్నుల నుంచి ముస్లింలకు స్పెషల్ మినహాయింపులు ఇచ్చాడు. హిందువుల నుంచి మాత్రం పన్నులు వసూలు చేసేవాడు. ఈ విషయాన్ని మన కుహనా సెక్యులర్ చరిత్రకారులు ఎక్కడా చెప్పరు. ఇది టిప్పు మార్క్ పరమత సహనం.

ఇక ఆ రోజుల్లో అప్పటికే మతం మారిన క్రైస్తువులు, ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన క్రైస్తవులు తన రాజ్యంలో ఉండటాన్ని టిప్పు సహించలేకపోయాడు. దాంతో తన రాజ్యం నుంచి క్రైస్తవులను వెళ్లగొట్టి వాళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు తన రాజ్యంలో ముస్లింలుగా మతం మారేవారికి ఎన్నో పథకాలను , తాయిలాలను ఆశలుగా చూపించేవాడు టిప్పు! వాళ్లకు ఏ వృత్తిలో ఉన్నా…, వారిపై ఏరకమైన పన్నులూ విధించేవాడు కాదు. తన రాజ్యంలో హిందువులు అధిక సంఖ్యాలుగా ఉన్నా కూడా…ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవాడు.

అలాగే ప్రభుత్వ పదువుల్లో ఉన్నా హిందువులందరిని టిప్పు దాదాపుగా తొలగించాడని చరిత్రకారులు చెబుతారు. రాజ్యంలో ముఖ్యపదవులను ముస్లింలకు కట్టెబట్టాడు. ఒక్క దివాన్ పదవిని మాత్రం…తన తండ్రి కోరిక మేరకు పండిత్ పున్నయ్యకు కట్టబెట్టాడు. అది కూడా తన అవసరం దృష్ట్యా ఆ పదవిలో కొనసాగించాడని కొంతమంది చరిత్రకారులు చెప్పే మాట!

అంతేకాదు తన రాజ్యంలో మాట్లాడే కన్నడ, మరాఠి భాషలను కాదని…తన ప్రభుత్వంలో అన్నిరకాల లెక్కలు, ప్రత్యుత్తరాలు పర్షియన్ భాషలోనే నమోదు చేయాలని టిప్పు సుల్తాన్ ఆదేశించాడు. టిప్పు కంటే ముందు ప్రభుత్వపరమైన ఈ గణాంకాలన్నింటినీ కన్నడ భాషలో నమోదు చేశారు. ఆ తర్వాత ఈ వివరాలను మరాఠీ భాషలోకి అనువాదం చేసేవారు.

టిప్పు సుల్తాన్ పాలనలో అత్యంత భయంకరమైనది క్రూరమైనది మలబార్ పై ఆయన జరిపిన దాడి..! టిప్పు సాగించిన దమనకాండలో హిందువుల రక్తం ఏరులై ప్రవహించిందని స్వయంగా వామపక్ష రచయిత, కేరళ వాసి అయిన ఫణిక్కరే తెలిపాడు. విలియం లోగాన్ అనే ఆంగ్లేయుడు…మలబారులో టిప్పు సుల్తాన్ నేలమట్టం చేసిన దేవాలయ వివరాలను తన మలబారు మాన్యువల్ లో వివరంగా పేర్కొన్నాడు.

మలబార్ దాడి తర్వాత తాను అక్కడ సాగించిన నరమేధాన్ని తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన బద్రుజ్ జుమాన్ ఖాన్ కు రాసిన లేఖలో స్వయంగా తెలిపాడు టిప్పు! తన ఈ లేఖలో మలబారుపై జరిపిన దాడిలో తాను గొప్ప విజయం సాధించానని, ఏకంగా నాలుగు లక్షలమంది హిందువులను…ముస్లింలుగా మతం మార్చేశానని…ఇప్పుడు ట్రావన్ కోర్ సంస్థానాధీసులపై దండయాత్రకు వెళ్లాలంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు టిప్పు!

ట్రావన్ కోర్ ప్రాంతంపై దండయాత్ర తర్వాతే టిప్పు పతానం ప్రారంభమైందని అంటారు.ఈ దండయాత్రే 1792లో మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి కారణమైంది. 1792లో శ్రీరంగపట్నం యుద్ధంలో జరిగిన పరాభవం అతని స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసిందని అంటారు. ఈ యుద్దంలో పెద్ద మొత్తంలో ధనంతోపాటు తన రాజ్యంలో సగం భాగాన్ని కోల్పోయాడు టిప్పు. దక్షిణ భారత సుల్తాన్ కావాలని కలలు గన్న టిప్పు ఒక దశలో భారత్ పై దండయాత్ర చేయాలని ఇరాన్, అప్గనిస్తాన్ పాలకులకు లేఖలు కూడా రాశాడు. అటు భారత్ లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తనకు సాయంగా ఫ్రెంచ్ సైన్యాలను పంపాలని కూడా లేఖలు రాశాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + 18 =

Back to top button