More

  కెంపెగౌడ VS టిప్పు సుల్తాన్..! విగ్రహాల ఆవిష్కరణలో ఎవరిది చిత్తశుద్ధి..?

  కర్నాటకలో కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బెంగళూరు నేడు దేశంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా వెలుగొందుతూ ఉందంటే.. దానికి కెంపెగౌడే కారణం. అందుకే ఆయనను బెంగళూరు నగర నిర్మాతగా పిలుచుకుంటారు. ఇప్పుడున్న ఎవెన్యూ రోడ్డు, ఉల్సూర్, ఎలహంక, కె.ఆర్. మార్కెట్ పరిధి మొత్తం కెంపెగౌడ హయాంలోనే అభివృద్ది చెందింది. దీంతో పాటు బెంగళూరులో నివసించే ప్రజలకు దాహార్తి తీర్చడానికి అప్పట్లోనే రాజధాని నగరం చుట్టూ దాదాపు వెయ్యి చెరువులు తవ్వించారు కెంపెగౌడ. ఈ విధంగా బెంగళూరు నగరాన్ని సుపరిపాలనతో అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిది. అందుకే ఆ మహనీయుడిని నగర వాసులు ఎంతగానో ఆరాధిస్తారు. నగరంలో ఎక్కడ చూసినా కెంపెగౌడ విగ్రహాలు, ఆయన పేరుమీద కూడళ్ళు, బస్టాండ్‎లు కనిపిస్తాయి. బెంగళూరు నగరానికి వేసిన పునాదులు వేయడం ద్వారా ఆయన దేశానికి సేవలను గుర్తించిన ప్రధాని మోదీ.. 108 అడుగుల కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే దీన్ని విపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించడం ఇష్టం లేకనో, లేక కెంపెగౌడపై వ్యతిరేకతతోనో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై అక్కసు వెళ్ళగక్కుతోంది. ఇక బీజేపీ విగ్రహాన్ని ఆవిష్కరించగానే కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ‘తన్వీర్ సెయిత్’ తాము కూడా వందడుగుల టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని ప్రకటించేశాడు. ఈ విగ్రహానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను తొలగించే ప్రయత్నంలో ఉన్నామని.. ఇవన్నీ పూర్తవగానే టిప్పు విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని తెలిపాడు. దీంతో మరోసారి టిప్పు సుల్తాన్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో టిప్పు సుల్తాన్ కు వందడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత అర్హత ఉందా..? టిప్పు సుల్తాన్ కర్నాటకకు చేసిన మేలేమిటి..? కాంగ్రెస్ నాయకులు ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వెనకున్న మర్మమేమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం.

  ఏ రాజుకైనా ప్రజాసంక్షేమమే పరమావధిగా ఉండాలి. అనుక్షణం ప్రజల కోసమే పరితపిస్తూ,.. తన రాజ్యం సురక్షితంగా ఉండేందుకు పాటుబడాలి. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా..? అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుని దాన్ని పరిష్కరించేందుకు శ్రమించాల్సిన అవసరం ఉంది. అయితే టిప్పు సుల్తాన్ ఇందుకు పూర్తి భిన్నంగా తన మతమే ప్రధాన అజెండాగా వ్యవహరించాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ తన మతాన్నే పాటించాలనే ఉన్మాదంతో వ్యవహరించేవాడు. కొన్ని వేలమంది హిందువులు, క్రిస్టియన్లను ఇస్లాంలో మత మార్పిడి చేశాడు. ఇందుకు ఒప్పుకోని వారిని నగ్నంగా ఏనుగులకు కట్టి ఈడ్చుకు వెళ్ళేలా చేశాడు. ఇతడి చేతిలో లక్షలాదిమంది బలవ్వగా ఎంతో మంది రాజ్యం వదిలి పారిపోయారు. ఈ దురాగతాలు ఎప్పుడో ఒకసారి కాకుండా ప్రతిరోజూ జరిగేవి. హిందువుల పండుగల సమయంలో కూడా టిప్పు సుల్తాన్ ఉన్మాదం ఆగలేదు. కర్నాటకలోని మేల్కొటే గ్రామంలో దీపావళి పర్వదినాన టిప్పు సుల్తాన్ తన సైన్యాన్ని పంపి శ్రీరంగపట్నంలోని నరసింహస్వామి గుడి దగ్గర పండుగ జరుపుకుంటున్న మాండ్య కులస్థులను ఊచకోత కోయించాడు. వందల మందిని చెట్లకు వేలాడదీసి రాక్షసానందం పొందారు. దీంతో ఆ దురాగతాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ మెల్కొటే పట్టణంలో దీపావళిని జరుపుకోవడంలేదు. దీంతో పాటు ఏకంగా కర్నాటక హైకోర్టు కూడా టిప్పు సుల్తాన్‎ను స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించడానికి నిరాకరించింది. అయితే ఇంతటి దుర్మార్గాలకు పాల్పడిన టిప్పు సుల్తానుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళుగా వంతపాడుతూనే ఉంది. ఎన్నో కట్టడాలకు టిప్పు సుల్తాన్ పేరును పెట్టడం, జయంతులు జరపడం లాంటివి చేస్తూ వచ్చింది. అయితే కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా టిప్పు సుల్తాన్‎పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జయంతులు జరిపినా కూడా భారీ పోలీసు బందోబస్తుతో చేయాల్సి వచ్చేది. అయినా కూడా మైనార్టీ సంతుష్టీకరణే ధ్యేయంగా బతికే హస్తం పార్టీ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

  తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కెంపెగౌడ విగ్రహావిష్కరణ చేయగా,.. వెనువెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘తన్వీర్ సెయిత్’ తాను వందడుగుల విగ్రహాన్ని కట్టిస్తానని ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన వెనుక హస్తం పార్టీకి చిత్తశుద్ది ఎంతుందో తెలియదు కానీ,.. తన్వీర్ సెయిత్ చిత్తశుద్దిపై మాత్రం ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సదరు ఎమ్మెల్యేకి టిప్పుపై ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకురావడానికి వచ్చే సంవత్సరంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలే ప్రధాన కారణమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. దీంతో టిప్పు విగ్రహాన్ని ఉపయోగించుకుని తరచూ వార్తల్లో నిలవచ్చనే వ్యూహంతోనే తన్వీర్ సెయిత్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

  ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీని ఎదుర్కొనే సమయంలో టిప్పు సుల్తాన్ ను సమర్థించడం ఆ పార్టీకి ఎంతవరకు లాభిస్తుందో అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ లో మొఘలుల కాలంలో ఇస్లామిక్ దండయాత్రలు ఎన్నో జరిగాయి. అప్పట్లో కూడా దేవాలయాలపై దాడులు, ఇస్లామేతరుల ఊచకోతలు ఎన్నో జరిగాయి. హిందువులపై జిజియా లాంటి భయానక పన్నులు కూడా విధించబడ్డాయి. అయితే అవన్నీ దాదాపు నాలుగువందల ఏళ్ళ క్రితం జరిగాయి. దీంతో వీరి దురాగతాలన్ని చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉన్నాయి. అందులోనూ భారత్ ను పాలించిన ప్రభుత్వాలన్నీ చరిత్ర పుస్తకాల్లో ఇస్లామిక్ దండయాత్రికుల దురాగతాలను బయటకు చెప్పకుండా చేయడంతో నేటి ప్రజలకు ముఘలుల దురాగతాల గురించి ఎక్కువగా తెలియడంలేదు. అయితే కర్నాటక పరిస్థితి అలాంటిది కాదు. టిప్పు సుల్తాన్ ది 18వ శతాబ్దమే కావడంతో ఆయన బ్రతికున్న కాలం కూడా నేటి కాలానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో కొన్ని తరాల ముందు జరిగిన దురాగతాల ఆనవాళ్ళు ఇప్పటికీ కర్నాటక ప్రజల ఇళ్ళతో పాటు కులాల పరంగా ఇప్పటికీ గుర్తులు మిగిలాయి. అందుకే మాండ్య కులస్థులు నాటి దురాగతాలను మర్చిపోకుండా ఇప్పటికీ దీపావళిని జరుపుకోవడంలేదు. దీంతో పాటు కర్నాటకలో గురువులు, మఠాల సంఖ్య కూడా ఎక్కువే.. వీరు కూడా వీలైనప్పుడల్లా టిప్పు సుల్తాన్ దురాగతాలను ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజల్లో టిప్పుపై ఉన్న ప్రకోపం ఇప్పటికీ తగ్గలేదు.

  అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వంతపాడి ఓట్లు సాధించడం అసాధ్యమే. మైనార్టీ సంతుష్టీకరనే ధ్యేయంగా మెజార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కన్నడిగులు దాన్ని ఎంతమాత్రం స్వీకరిస్తారన్నది కూడా అనుమానమే.

  Trending Stories

  Related Stories