భారత్ లో ఎంతో గొప్పగా చేసుకునే పండుగ దీపావళి.. ఆరోజు ఎలాగైనా భారత్ లో బాంబు దాడులు చేయాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉంటారు. గతంలో కూడా దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులకు ప్రయత్నించారు తీవ్రవాదులు. ఇక ఈసారి కూడా టిఫిన్ బాక్స్ బాంబుతో పేలుడు సృష్టించాలని తీవ్రవాదులు ప్రయత్నించగా పంజాబ్ పోలీసులు అడ్డుకున్నారు.
భారత్ – పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్‌ను పోలీసులు నిర్వీర్యం చేశారు. జలాలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే దీనిని అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా టిఫిక్ బాంబు విషయం బయటపెట్టారు. పోలీసుల బృందం టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన అలీకే గ్రామానికి వెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేశారు. కాగా జలాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్‌కు షెల్టర్ కల్పించిన ఆయన తండ్రి జశ్వంత్ సింగ్, బల్వంత్ సింగ్‌లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రంజిత్ సింగ్‌కు సహకరించిన తర్లోక్ సింగ్ పరారీలో ఉన్నాడు. నిందితులపై సిద్వాన్ బెట్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 212, 216 చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టంలోని 18,19 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న జలాలాబాద్ పేలుడు కేసులో నిందితుడు రంజీత్ సింగ్ అలియాస్ గోరాకు ఆశ్రయం, సహాయాన్ని అందించినందుకు ఇద్దరు వ్యక్తులను లూథియానా రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటా తెలిపారు. అధికారిక ప్రకటన ప్రకారం, ముగ్గురి నుండి ఇంతకుముందు ఒక “టిఫిన్ బాంబు”, రెండు పెన్ డ్రైవ్‌లు మరియు రూ. 1.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో నిందితులు వ్యవసాయ పొలాల్లో దాచి ఉంచిన ‘మరో టిఫిన్ బాంబు’ గురించి చెప్పగానే అధికారులు అలర్ట్ అయ్యారు. నిందితులు చెప్పిన చోటున వెతుకగా.. అక్కడ ఉన్న టిఫిన్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఫిరోజ్‌పూర్‌లోని అలీ కే గ్రామంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ (పంజాబ్ పోలీస్), ఫిరోజ్‌పూర్ మరియు లూథియానా మరియు CIA (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) జగ్రాన్ బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. టిఫిన్ బాక్స్ బాంబును నిర్వీర్యం చేశామని డీజీపీ తెలిపారు.
లూథియానా రూరల్‌లోని సిద్వాన్ బెట్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) యొక్క సంబంధిత నిబంధనల ప్రకారం ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అంతర్గత భద్రత) ఆర్ ఎన్ ధోక్ తెలిపారు.