దారుణం.. ముగ్గురు అక్కచెల్లెళ్ళూ ఒకేసారి ఆత్మహత్య..?

0
905

రాజస్థాన్‌లోని డూడూ సమీపంలో ఓ బావిలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు, ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి. ఈ అక్కచెల్లెళ్ళలో ఇద్దరు ప్రస్తుతం గర్భిణులు. ఈ ముగ్గురూ ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. వీరి మృతికి వరకట్న వేధింపులే కారణమని భావిస్తూ ఉన్నారు. కలు మీనా (25), మమత మీనా (23), కమలేశ్ మీనా (20), నాలుగేళ్ళు, 22 రోజుల వయసుగల కలు కుమారుల మృతదేహాలు ఓ బావిలో కనిపించాయని పోలీసులు తెలిపారు. ఈ అక్కచెల్లెళ్ళ భర్తలపైనా, వారి కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ అక్కచెల్లెళ్ళ తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ప్రకారం, వారి భర్తలు వారిని వరకట్నం కోసం వేధించేవారు. మే 25న కమలేశ్ తన తండ్రికి ఫోన్ చేసి, తమను తమ భర్తలు, వారి బంధువులు కొడుతున్నారని, తమకు చాలా భయంగా ఉందని చెప్పారు. వెంటనే డూడూ గ్రామానికి చేరుకోగా అల్లుళ్లు ‘‘వాళ్ళు చనిపోయారు, మాకేమీ తెలియదు. నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా చస్తావు’’ అని బెదిరించారు. పెద్ద కుమార్తె కలు మీనాకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరి వయసు నాలుగేళ్ళు, మరొకరి వయసు 22 రోజులు. మమత, కమలేశ్ 8, 9 నెలల గర్భిణులు. ఈ అక్కచెల్లెళ్ళు, వారి పిల్లలు కనిపించడం లేదని బుధవారం ఓ ఫిర్యాదు డూడూ పోలీస్ స్టేషన్‌లో దాఖలైంది. గురువారం కేసు నమోదు చేశారు.

వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చిన తర్వాత స్పష్టమైన కారణాలు తెలుస్తాయన్నారు. మృతుల్లో ఓ మహిళ పెట్టిన వాట్సాప్ స్టేటస్‌లో.. తమను తమ బంధువులు ఇబ్బంది పెడుతున్నారని, చావడమే మంచిదని భావిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు మహిళలు గృహహింసకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కలు మీనాను ఇటీవల అత్తమామలు కొట్టడంతో.. 15 రోజులు క్రితం ఆసుపత్రి పాలైంది. ఆమె కంటికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారి ముగ్గురికి 2003లో బాల్య వివాహం జరిగింది. ఆ సమయంలో అక్కచెల్లెళ్ళలో ఆఖరి అమ్మాయి వయసు కేవలం 1 సంవత్సరం మాత్రమే. ఆ ముగ్గురు మహిళలు తమ బతుకుదెరువు కోసం కష్టపడి చదువుకున్నారు. మమత పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో ఎంపికైంది, కలు తన బిఎ కోర్సు చివరి సంవత్సరం చదువుతోంది, చిన్న చెల్లెలు కమలేష్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరింది. అయినా కూడా భర్తలు టార్చర్ పెడుతూనే ఉన్నారు. వారి ఇళ్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి నుంచి శనివారం వారి మృతదేహాలను వెలికితీశారు.