More

    అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థులు దుర్మరణం

    అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలుగు విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. మినీవ్యాన్, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో మినీవ్యాన్‌లో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు, ట్రక్కులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, రెండు వాహనాల డ్రైవర్లతో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదావరిగూడెంకు చెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి (26), వరంగల్‌ ఎల్లమ్మబజార్‌కు చెందిన గుల్లపెల్లి పావని(22), ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన సాయి నరసింహ(23) యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూ హెవెన్, CT ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లారు. ఐదుగురు మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లి.. తిరిగి వస్తుండగా కనెక్టికట్‌ రాష్ట్రంలో పొగమంచు కారణంగా ఉదయం 5 నుండి 7 గంటల మధ్య ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రేమ్‌ కుమార్‌రెడ్డి, పావని, సాయినరసింహ అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన ఐదుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.

    సాయి నరసింహ స్నేహితులు అతని బంధువులకు సమాచారం అందించారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన సాయి నరసింహ ఎంఎస్‌ చేస్తున్నాడు. అతడి మరణవార్త వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతదేహాలను తీసుకొచ్చేందుకు కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సహకరించాలని మృతుల కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు.

    Trending Stories

    Related Stories