జమ్ముకశ్మీర్‌లో శనివారం రాత్రి పుల్వామాలోని దర్భ్‌గ్రామ్ వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు 12 గంటల పాటు కాల్పులు జరిగాయి. వారంతా లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మట్టుబెట్టిన ముష్కరులను ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షీర్గోజ్రీగా గుర్తించారు. ‘మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు స్థానికులే, వీరంతా లష్కరే తొయిబా గ్రూప్‌నకు చెందినవారిగా గుర్తించాం. వీరిలో జునైద్ అనే ఉగ్రవాది గతంలో కశ్మీరీ పోలీస్‌కు చెందిన రియాజ్ అహ్మద్ ను హత్య చేశాడు’ అని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు ఏకే -47లు, ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు స్థానికేతరులపై కూడా దాడులకు పాల్పడ్డారని విజయ్ కుమార్ తెలిపారు.