దేశ వ్యాప్తంగా వ్యకిన్ల కొరత ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొందరు డబ్బులకు కక్కుర్తి పడి ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్లను బయట వ్యక్తులకు అమ్మేస్తూ ఉన్నారు. బెంగళూరు పోలీసులు బ్లాక్ మార్కెట్ లో వ్యాక్సిన్లను అమ్ముతున్న వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. బిబిఎంపి హెల్త్ సెంటర్ లో వైద్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళ బయటి వ్యక్తులకు వ్యాక్సిన్ ను అమ్ముతూ పట్టుబడింది.
25 సంవత్సరాల డాక్టర్ పుష్పితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజునాథ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆమె విధులను నిర్వర్తిస్తూ ఉంది. వ్యాక్సిన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తమ బంధువైన ప్రేమతో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను బయటి వ్యక్తులకు అమ్ముతూ ఉంది. ఒక్కో కోవిషీల్డ్ వ్యాక్సిన్ షాట్ కు 500 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. పబ్లిక్ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్లను కొట్టేసి.. ప్రేమ ఇంట్లో బయటి వ్యక్తులకు వేస్తూ ఉన్నారు.
సీనియర్ పోలీసు అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఆసుపత్రుల్లో వేయడానికి ఇచ్చిన వ్యాక్సిన్లను బయటి వారికి వేస్తూ ఉన్నారు. ప్రేమ ఇంట్లో వాటిని వేస్తూ ప్రజల దగ్గర నుండి డబ్బులను తీసుకుంటూ ఉన్నారని’ చెప్పుకొచ్చారు.
ఫేక్ కోవిద్-19 సర్టిఫికెట్లను కూడా:
చామరాజ్ పేటలో పబ్లిక్ హెల్త్ కేర్ లో పని చేస్తున్న ఇద్దరు వైద్యులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు కోవిద్ పాజిటివ్ ఉన్నా కూడా కోవిద్-19 నెగటివ్ సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు. రెమ్డెసివీర్ వయల్స్ ను కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతూ ఉన్నారు. ఫేక్ కోవిద్-19 నెగటివ్ సర్టిఫికెట్ కోసం 500 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. ఒక్కో రెమ్డెసివీర్ వయల్ కు 25000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సంఘటనల్లో ఇద్దరిని అరెస్టు చేశారు.