More

    ఎలాగైనా దేశాన్ని విడిచిపెట్టాలి.. ఎయిర్ పోర్టుకు వేలల్లో చేరుకుంటున్న ప్రజలు

    ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు రాజధాని కాబూల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారాన్ని తాలిబాన్లకు అప్పగించింది. ఆఫ్ఘన్ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ నియమితులయ్యారు. కాబూల్ లో శాంతిభద్రతలపై ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలను కోరారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆఫ్ఘన్ ను విడిచి తజకిస్థాన్ లో ఆశ్రయం పొందినట్టు ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

    తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ ఆఫ్ఘన్లు, విదేశీయులు ఆఫ్ఘన్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. పేదలు తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. తమ పౌరులను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ప్రయత్నించాయి. ఆదివారం కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని అమెరికా సైన్యం హెలికాప్టర్లలో కాబూల్‌ ఎయిర్‌పోర్టులోని ఔట్‌పోస్టుకు తరలించింది. ఇతర దేశాలకు చెందిన వారిని కూడా ఆయా దేశాలకు తరలించారు. అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ రాజీనామా చేయడంతో ఆఫ్ఘన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌లో అల్లర్లు, లూటీలు జరగకుండా నివారించడానికే తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిదీన్‌ ప్రకటించారు. సైనిక దళాలు ఖాళీ చేసిన ఔట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

    తాలిబాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరుకున్నారు. ఎలాగైనా ఆఫ్ఘనిస్థాన్ ను వీడాలని ప్రజలు భావించారు. తాలిబాన్ల చేతిలో హింసను భరించలేక ఆఫ్ఘన్‌లు తమ ఇళ్ల నుంచి విమానాశ్రయానికి పెద్ద సూట్‌కేసులతో పారిపోయారని వీడియోలు తెలుపుతున్నాయి. విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రయాణీకులు ఏకంగా విమానాల దగ్గరకు వెళ్లిపోయారు. అక్కడ ఉంచిన విమానాలను ఎక్కడానికి ప్రయత్నించారు. దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలకు సంబంధించిన వీడియోలను చూడొచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం సాయంత్రం కంటే.. సోమవారం ఉదయం కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది.

    Trending Stories

    Related Stories