అగ్నిపథ్‌ ఆందోళనలో పాల్గొంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

0
746

అగ్నిపథ్‌ ఆందోళనలో పాల్గొనే వ్యక్తులు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (CAS) ఎయిర్ చీఫ్ మార్షల్ V R చౌదరి హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్తతలను తాము అస్సలు ఊహించలేదని.. ఈ తరహా హింసను ఖండిస్తున్నామన్నారు. ఇది అసలు పరిష్కారం కాదని చెప్పుకొచ్చారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో చివరి దశ.. పోలీస్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు అగ్నిపథ్‌ నిరసనల్లో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటారో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో క్లియరెన్స్‌​ రాదని హెచ్చరించారు. ఆర్మీలో చేరే తలుపులు మూసుకుపోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు వీఆర్‌ చౌదరి.

అగ్నిపథ్ పథకం కింద ‘అగ్నివీర్’గా దేశానికి సేవలు అందించిన వారికి కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసింది. అగ్నివీర్ గా నాలుగేళ్లు పనిచేసి దిగిపోయిన తర్వాత త్రివిధ దళాల్లోనే రెగ్యులర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. వీరి కోసం 25 శాతం కోటాను కేంద్రం ముందే ప్రకటించింది. ఇప్పుడు దీనికి అదనంగా కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ లు (సీఏపీఎఫ్), అస్సామ్ రైఫిల్స్ లో ఉద్యోగాల్లో వీరికి 10 శాతం కోటాను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లు పనిచేసిన తర్వాత కేంద్ర పోలీసు బలగాల్లో ఉద్యోగాలకు అర్హత సంపాదించుకునేందుకు వీలుగా వయోపరిమితిలోనూ మూడేళ్లపాటు సడలింపు ఇచ్చారు. సాధారణ అభ్యర్థులకు ఉండే గరిష్ఠ వయోపరిమితికి అదనంగా మూడేళ్లపాటు వీరు పోటీ పడొచ్చని కేంద్రం తెలిపింది.