More

  మోదీకి చెక్..? భారీ ప్లాన్ లో ప్రతిపక్షం..!

  అనేక కొత్త పరిణామాలకు రంగసిద్ధమవుతోంది. ఆశించని స్థితి తారసపడనుందా అన్న శంక రాజకీయరంగంలో క్రమంగా ఆవరిస్తోంది. ఊహించని మబ్బుతెర ఒకటి ముసురుకుంటోంది. ఇటీవల దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగానే కాదు, ఆశ్చర్యకరంగానూ ఉన్నాయి. అయితే వీటి వెనుక కేవలం అధికార సాధన మాత్రమే లక్ష్యంగా  ఉందా అంటే, కాదని తాజా దృశ్యాల వెనుక దోబూచులాడే డైనమిక్స్ రూఢీ చేస్తున్నాయి.

  టెలివిజన్ తెరల వెనుక, పత్రికా కథనాల్లోని వాక్యాల మధ్య-Between the linesలో  ఒక సరికొత్త రాజకీయ వీచిక లీలగా కనపడుతోంది. అయితే ఇది శుభశూచకమా? అశుభశూచకమా? బహుశా ఇది త్వరలోనే తేలిపోవచ్చు లేదా అభాసగా ముగిసిపోవచ్చు.

  ఈ సరికొత్త పరిణామాల లోగుట్టును పుస్తకాల్లో, బుద్ధిజీవుల్లో మేధల్లో గాలించలేం. సామాజిక చలనసూత్రాలే వీటిని పట్టిస్తాయి. నేషనలిస్ట్ హబ్ ఈ గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు రైట్ యాంగిల్. ఈ తీవ్ర మార్పు గురించి జాగరూకత పరిచేందుకే నేషనలిస్ట్ హబ్ ప్రయత్నం మొదలుపెట్టింది.

  ఈమధ్య కాలంలో నినాదాల స్వభావం మారింది. నేతల తీరు మారుతోంది. రాజకీయ స్వభావంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగిందా అనే సందేహం వచ్చేలా ఉంది వాతావరణం. అంతే కాదు, ఉప్పు-నిప్పూ పార్టీలన్నీ చెట్టాపట్టాలేసుకునేలా ఉన్నాయి. చెట్టూపుట్టా పట్టిన నేతలంతా సమావేశ స్థావరాలకు చేరేందుకు సర్దుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

  ఒక బలశాలి ‘పున:ప్రవేశాన్ని’ అడ్డుకోవాలన్న కసి ఈ రాజకీయ కదలికలో వ్యక్తమవుతోంది. ఈ Political turmoil కారణాలు తేలిపోయేవి కాదు, బలమైనవే! కొన్ని రాజకీయ పక్షాల ఉనికిని ప్రశ్నార్థకం చేసేవే!!

  మోదీని గద్దె దించాలంటే వ్యక్తిగతంగా గతంలో లాగా తనపై చేసే ఆరోపణలు, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం అనే మాటలు సరిపోవట్లేదు. అందుకే మరో పంచాయుధ స్తోత్రాన్ని ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి విపక్ష పార్టీలు. అవేంటంటే..!

  1. FRBM-Fiscal Responsibility and Budget Management చట్ట సవరణ తిరస్కరణ
  2. చట్టబద్ధంగా రావాల్సిన జీఎస్టీ నష్ట పరిహార నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణ
  3. రిజర్వ్ బ్యాంక్ చేబదుళ్లు-ways and means advances వడ్డీ రేట్లు తగ్గించకపోవడం
  4. కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడం
  5. దేశవ్యాప్తంగా జలవనరులు-ప్రాజెక్టులు ఇక కేంద్రం చేతిలోకి పోతాయనే శంక

  ఈ ‘పంచాయుధ స్తోత్రం’ మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రాంతీయ పార్టీలకు కునుకులేకుండా చేస్తోంది. వీటివల్ల తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే ఈ నిర్ణయాలకు కారణమైన పార్టీని, ఆ ప్రభుత్వాన్నీ ఎలా దెబ్బకొట్టాలనే సవాలు ఏడేళ్లుగా దేశంలోని రాజకీయ పక్షాలను వేధిస్తోంది. కాంగ్రెస్ తో ఉంటే కంచిగరుడ సేవే అవుతుంది. కూటమి పెట్టాలంటే కుక్కలు చింపిన విస్తరి ‘గతం’ గుర్తువస్తుంది. ఏం చేయాలో తెలియక, ఒకసారి లొంగుబాటు, మరోసారి కుంగుబాటుతో కుదేలవుతున్నాయి.

  అప్పుడే గుర్తుకు వచ్చింది ‘సమాఖ్య స్ఫూర్తి’.  అదేంటో క్లుప్తంగా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని విధాన నిర్ణయాలను చేస్తుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడం రాష్ట్రాల బాధ్యత. ఇక కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో, కేంద్ర జాబితా అంశాలపై తుది నిర్ణయం కేంద్రానిదే. వీటిని రాష్ట్రాలు అమలు చేస్తాయి. రాష్ట్ర జాబితా విషయంలో రాష్ట్రానిదే తుది నిర్ణయం. ఉమ్మడి జాబితాలో ఉభయుల నిర్ణయం ఉంటుంది. ఇదే ఫెడరల్‌ వ్యవస్థ. అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం ప్రత్యేక నిబంధన ద్వారా సవరణలు చేయవచ్చు.

  అంటే రాజ్యాంగం హామీ ఇచ్చిన ‘సమాఖ్య స్ఫూర్తి’ని ఆధారం చేసుకుని రాజకీయం చేయాలన్న ఉద్దేశం. ఈ సాంకేతికతను వాడుకుని కేంద్రంపై అభాండం వేయవచ్చా? ప్రయోజనాన్ని గుర్తించి ప్రభుత్వం తీసుకున్న మార్పును స్వాగతించాలా?

  ఒకనాటి అవసరాలు, పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోకూడదా? అలా అన్యాయమైన సవరణలు చేసిన కాలం లేదా? రాజ్యాంగం శిలాశాసనమా?

  ఈ ఐదు కీలక నిర్ణయాలు తీసుకోవడం వెనుక కేంద్రానికి రాజకీయ ఉధ్దేశాలున్నాయా? లేదా ప్రజాప్రయోజనాలున్నాయా అనేది తెలియాలంటే…ఈ విధానాల రూపకల్పనలో ఉన్న మంచి చెడులేంటో తెలుసుకోవాలి. ఒక్కొక్కటిగా అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  ఎఫ్ఆర్బీఎం అంటే..ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత ఉండాలి. ఈ సమతుల్యత లేని పక్షంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విపరీతంగా అప్పుచేసి వెళ్లిపోతే తర్వాత వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందుల్లో పడతాయి. అప్పు ఒకేసారి తీసుకోకుండా దఫాలుగా తీసుకోవాలి. ఒకేసారి తీసుకుంటే రుణభారం పెరిగి ఆర్థిక స్థిరత్వం కోల్పోతుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి మించి ద్రవ్య లోటు ఉండకూడదు. కేంద్రం తన స్థూల దేశీయ ఉత్పత్తిలో 3శాతం మించి ద్రవ్య లోటు ఉండకూడదు. ఆదాయం ఉన్న రాష్ట్రాలు మరో .5 శాతం పెంచుకోవచ్చు.

  ద్రవ్యలోటుకు లోబడి ఖర్చులు ఉండాలి. ఆదాయానికి మించి ద్రవ్యలోటు ఉండకూడదు. మొత్తం ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే అదే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో ధరల పెరుగుదల అనివార్యమవుతుంది. Act of god సాకుతో ఎఫ్ఆర్బీఎం శాతం పెంచితే ద్రవ్యోలణం వచ్చి క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయడం రిజర్వ్ బ్యాంకుకు అనివార్యంగా మెడకు పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆదాయానికి మించి ఖర్చు చేయకూడదు. ఇదీ స్థూలంగా చట్టం సారాంశం. అయితే ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4 మించి ద్రవ్యలోటు ఉండకూడదని పేర్కొంది. ఒక శాతం పెంచింది.

  ఈ కారణంగానే కేంద్రం ఎఫ్ఆర్బీఎం చట్టసవరణకు ఒప్పుకోవడంలేదు. పైగా ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించింది. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఈ ఏడాది జూలైలో భారీ షాక్‌ ఇచ్చింది.ఈ మధ్య కాలంలోనే  ఏపీకి రావాల్సిన రూ.3,470 కోట్లను ఓవర్‌డ్రాఫ్ట్‌ బకాయిల కింద ఆర్బీఐ జమ చేసుకుంది.

  అది మర్చిపోకముందే ఇప్పుడు రాష్ట్ర రుణపరిమితిలో కేంద్రం రూ.17వేల కోట్లు కోతపెట్టింది. మరోవైపు కార్పొరేషన్లకు సంక్షేమ బాధ్యతలను అప్పగించిన సర్కారు.. వీటిద్వారా పరిమితికి మించి వేల కోట్ల రుణాలు తెస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను అతిక్రమించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వం రూ.21,500 కోట్ల అప్పు తెచ్చి సంక్షేమ పథకాల కోసం ఉపయోగించింది.

  ఇప్పటికే తీసుకున్న వడ్డీ, అసలు చెల్లింపు కోసం ఇంకా ఎక్కువ అప్పులు తీసుకోవాలి. పరిమితికి మించి అప్పులు చేశారంటూ 2021-22లో రాష్ట్రానికి అనుమతించిన అప్పుల పరిమితిని కేంద్రం రూ.42వేల కోట్ల నుంచి రూ.27వేల కోట్లకు కుదించింది. బాబు హయాంలో 132.31 శాతం అప్పు పెరిగినట్టూ అంచనాలున్నాయి.

  ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఏమీ తక్కువ తినలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి లక్షా 80 వేల 239 కోట్లు. 11 వేల 691 కోట్ల రూ. వడ్డీ చెల్లించింది. ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి నాటికి రూ. 2,86,804 కోట్లకు చేరనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర బడ్జెట్లోనే అధికారికంగా ప్రస్తావించింది.  వీటికి కట్టే వాయిదాలు, వడ్డీలకే  బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు కేటాయించింది. ఇలాగే అప్పులు చేస్తే త్వరలో ఎఫ్ఆర్బీఎం చట్ట ఉల్లంఘనల రాష్ట్రాల జాబితాలో చేరడం ఖాయమంటారు నిపుణులు.

  నిజానికి రాష్ట్రాలు తెస్తున్న అప్పులు సుస్థిర అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రాజెక్టుల కోసం కాదు, సంక్షేమ పథకాల పేరుతో పెన్షన్లు, ఇతర స్కీంల పేరుతో నగదు పంపిణీలు చేస్తోంది. ఈ పథకాలు కూడా రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించినప్పుడు ప్రకటించే సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాయి.

  ఈ కారణంగా నీటి ప్రాజెక్టులు, ఉద్యోగ కల్పనా రంగాల పురోగతి కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల కారణంగా కేంద్రం ఆర్థిక ఇక్కట్లు పడి, అక్కడ కూడా సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అసాధ్యంగా మారుతుంది. ఇక జీఎస్టీ నష్టపరిహారం కింద చెల్లించాల్సిన నిధుల విషయంలో కరోనా కారణంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా చెల్లిస్తుందన ప్రకటించింది. ఆ ప్రకారమే చెల్లిస్తోంది కూడా.

  ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల గొడవేంటో చూద్దాం….

  కావేరీ, నర్మద, మహానది, పెరియార్, మహాదాయి ఇలా చెప్పుకుంటూ పోతే వివాదాల్లో చిక్కుకున్న నదుల జాబితా చాలా పెద్దది. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జల వివాదాల్లో ముందున్నాయి. కృష్ణ, గోదావరి, వంశధార, పెన్నా నదుల జలాల పంపకంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

  కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ర్టాలు జగడానికి దిగడంతో కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా జోక్యం చేసుకుంది. విభజనచట్టంలో తనకు సంక్రమించిన అధికారాల ఆధారంగా కృష్ణానదితో పాటు గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు సహా నిర్మాణంలో ఉన్న వివాదాస్పద ప్రాజెక్టులన్నింటిపై అధికారాలను సొంతం చేసుకుంటూ రెండు నదులకూ బోర్డులను ఏర్పాటు చేస్తూ గెజిట్లు విడుదల చేసింది.

  అనేక ప్రాజెక్టుల నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం ప్రాజెక్టులను పూర్తి చేయడం కాదు, కొనసాగిస్తూ ఉండటం. దీని వల్ల పార్టీలకు నిధులిచ్చే కాంట్రాక్టు సంస్థల జేబులు నింపవచ్చు. అమాత్యులు తమ కంపెనీలకే ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును ఇప్పించుకోవచ్చు. నేతలకు నిధులు పుష్కలంగా రావచ్చు. అంతిమంగా ప్రజల డబ్బు ఏళ్ల తరబడి నేతలకు చేరడం సజావుగా జరిగి పోతూనే ఉంది.

  ఏదైనా రాజకీయ సమస్య తీవ్రమైనపుడు దాన్ని జనం దష్టి మరల్చేందుకు ప్రాజెక్టుల వివాదాలను బయటకు తెచ్చి పొరుగు రాష్ట్రాలే దోషులని బూచీ చూయించడం ఇదీ డెభ్బై ఏళ్లుగా మన పాలకుల తీరు. సుమారు 1950లో మొదలైన పోలవరం 2021లోనూ కొనసాగుతున్నదంటే ప్రభుత్వాల తీరు అర్థమవుతుంది. చీటికీ మాటికీ జలవివాదాలను లేవదీసి పరస్ఫరం ఫిర్యాదులు చేసుకోవడం, రాజ్యాంగ సంస్థలపై అవాకులూ చవాకులూ పేలడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దీంతో ఫుల్ స్టాప్ పెట్టేందుకు నిర్ణయించింది.

  లక్ష కోట్ల రూపాయలు అప్పును నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఖర్చు చేయకుండా సంక్షేమం పేరిట పంచిపెడుతున్నారు.వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడం కోసం అప్పులు చేసి పప్పు బెల్లాల వలె పంచిపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు శక్తికి మించి చేస్తున్న అప్పులను ఎవరు తీర్చాలి? కేంద్రానికి సరైన సమాచారం కూడా ఇవ్వకుండా నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించి మరీ అప్పు చేస్తున్నాయి అన్నీ రాష్ట్రాలు. మరోవైపు దేశంలోని అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి. బాధ్యత లేకుండా అప్పులు చేసి రాష్ర్టాలను దివాలా తీయించవచ్చా?

  మొత్తంగా పంచాయుధ స్తొత్రం ప్రాంతీయ పార్టీలకు, అవి మద్దతు పలికే కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది. ఎలాగైనా ప్రజాప్రయోజనాలను కాపాడే రాజకీయానికి చరమగీతం పాడాలని సంకల్పించుకున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని అనుభవిస్తూ, అవినీతి సామ్రాజ్యాలను నిర్మించుకున్న పార్టీలు ఒక్కతాటిపైకి  రావాలని కోరుకుంటున్నాయి. ఈ ఆశను నిజం చేయబోతున్నడో ‘ఆశాఢభూతి’.

  ఎన్నికలు వచ్చినపుడల్లా రాజకీయ యవనికపై విదూశక పాత్రలో అధిక ప్రసంగాలు చేసే ప్రశాంత్ కిషోర్ అనేబడే నాటకావతంసుడు త్వరలో సాక్షాత్కరించే ప్రహసనానికి దర్శకత్వం వహించబోతున్నాడు. తనను విఫల రాజకీయుడిగా ప్రకటించుకున్నవాడు ‘వ్యూహకర్త’ ఎలా అవుతాడో అర్థంకాని పజిల్. ఎవరినో ప్రధాని చేయడమెందుకు తానే కావొచ్చుకదా అనే చిలిపి సవాలు విసిరితే తెలుస్తుంది అసలు బండారం. మొత్తంగా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ను ఓడించేందుకు అన్నీ ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఆ వేడి అన్ని రాష్ట్రాల్లో కనపడుతోంది. వారి కల నెరవేరుతుందో, మధ్యలో ‘నాటక స్రావమే’ జరిగిపోతుందో వేచి చూడాలి. ఓటర్లుగా బారులు తీరే ప్రజలే అప్రమత్తంగా ఉండాలి.

  Trending Stories

  Related Stories