నుపుర్ శర్మ దిష్టిబొమ్మను ఉరి తీయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటేష్ ప్రసాద్

0
711

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. నుపుర్ శర్మ దిష్టిబొమ్మను ఉరితీయడంపై భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఘాటుగా స్పందించాడు. ఇది 21వ శతాబ్దమని, రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించాడు. నుపుర్ శర్మకు వ్యతిరేకంగా కర్నాటకలోని బెల్గావిలో మసీదు వద్ద ఆమె దిష్టిబొమ్మను వేలాడదీయడంపై ట్విటర్ వేదికగా వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఇది కర్నాటకలో నుపుర్ శర్మ దిష్టిబొమ్మను ఉరితీస్తున్న దృశ్యం. ఇది చూస్తుంటే మనం 21వ శతాబ్దంలోనే బతుకుతున్నామా అని అనిపిస్తున్నది. ప్రజలారా.. దయచేసి రాజకీయాలను పక్కనబెట్టండి. చిత్తశుద్ధితో బతకండి. ఇప్పటికే చాలా చేశారు..’ అని ట్వీట్ చేశాడు. మళ్లీ కొద్దిసేపటికే ఆయనే తిరిగి మరో ట్వీట్ చేస్తూ.. ‘ఇది కేవలం దిష్టిబొమ్మ కాదు. చాలామంది వ్యక్తులకు ముప్పు..’ అని చెప్పుకొచ్చాడు.

ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి. టెలివిజన్ చర్చలో భాగమైన నూపుర్ శర్మ వ్యాఖ్యను అనేక ముస్లిం దేశాలు విమర్శించాయి. నుపుర్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బీజేపీ సస్పెండ్ చేసింది. శుక్రవారం నూపుర్ శర్మకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో, కర్ణాటకలోని బెలగావిలోని ఫోర్ట్ రోడ్‌లో ఆమె దిష్టిబొమ్మను వేలాడదీయడం విమర్శలకు దారితీసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో దిష్టిబొమ్మను తొలగించారు.