ఏజ్.. జస్ట్ నంబర్ మాత్రమే అని ఊరికే అనలేదు..! సంకల్పం ఉంటే ఏ వయసులో అయినా సాధించవచ్చు. 18 రోజుల పాటు 2,400 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేయాలంటే కేవలం యువతీ-యువకులకు మాత్రమే సాధ్యం అని మాత్రం అనుకోవచ్చు.. కానీ 56 ఏళ్ల వయసు ఉన్న మహిళ ఈ ప్రయాణాన్ని ఎంతో సులువుగా కంప్లీట్ చేశారు. కేరళకు చెందిన మినీ ఆగస్టీన్ అనే మహిళ ఢిల్లీ నుంచి లేహ్ వరకు బైకు మీద ప్రయాణం చేశారు.
మినీ ఆగస్టీన్ ఢిల్లీ నుండి లేహ్ సర్క్యూట్‌ను 18 రోజుల్లో పూర్తి చేశారు. ఆమె బుల్లెట్‌లో 2400 కి.మీ. ప్రయాణించారు. కేరళలో జన్మించిన మినీకి చిన్నప్పటి నుండే బైక్స్ అంటే చాలా ఇష్టం. ఈ మహిళా బైకర్ తన 500-సీసీ బుల్లెట్ బైక్‌ను ఢిల్లీ నుండి లేహ్ వరకు తీసుకువెళ్లారు. తన సోదరులతో కలిసి ఒకేలా ఆమెను తల్లిదండ్రులు పెంచారు. సోదరులతో కలిసి మొదట సైకిల్ తొక్కిన ఆమె.. ఆ తర్వాత బైక్ రైడింగ్ ను మొదలు పెట్టారు. తల్లిదండ్రులు, భర్త, పిల్లలు ఎంతో ప్రోత్సహించారు. ఆమె భర్త ఆమెకు 350 సీసీ బుల్లెట్ ను నడపడం నేర్పించారు. ఢిల్లీ నుంచి ఆమె ట్రావెలింగ్ లైఫ్ ను మొదలుపెట్టారు. అందుకు ఆమె ఏడాది పాటు కఠిన శిక్షణనే తీసుకున్నారు. రోడ్డుపై జాగ్రత్తగా ఉండేందుకు, సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు ప్రతిరోజూ సాధన చేశారు. అలా ఆమె అనుకున్నది సాధించారు.
ఢిల్లీ నుండి లేహ్ రైడ్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఇది సాధించడానికి ఆమె కఠినమైన దినచర్యను అనుసరించారు. రోడ్డుపై ఆమె సురక్షితంగా ప్రయాణించేలా చూసుకుంది. సామాజిక ఒత్తిడి కంటే అభిరుచి గొప్పదని నిరూపించిన ఆమె ఖచ్చితంగా రోల్ మోడల్.